దీర్ఘాయువు కోసం, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అలా కాకపోయినా బతికి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండేందుకైనా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. గుండె త్వరగా అలసిపోకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా, నరాలలో కలిగిన అడ్డంకిని తొలగించడానికి సహాయపడుతుంది. అనేక సందర్భాల్లో, పోషకాహార నిపుణులు సాధారణ వ్యక్తి బడ్జెట్‌కు అందని ఆహార పదార్థాల గురించి సూచిస్తారు.
కానీ, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అటువంటి ఖరీదైన ఆహార పదార్థాలను కొనుగోలు చేయలేని వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ సాధారణ, చౌకగా దొరికే 5 పదార్థాలతో కూడా మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండే ఆ 5 పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన గుండె కోసం బ్రోకలీ తినమని చాలా సలహాలు ఇస్తారు. బ్రోకలీ పోషకాల నిధి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే మీరు బ్రోకలీ లాంటి ఆహార పదార్థాలను తినమని చెప్తుంటారు. మీరు కూడా అదే విధమైన పోషకాలను కోరుకుంటే, మీ ఆహారంలో కరివేపాకును చేర్చండి. కరివేపాకు మీ పొరుగువారి నుండి ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు మార్కెట్లో లభిస్తుంది.
ఆరోగ్యంగా ఉండటానికి, బాదం, అక్రోట్ వంటి నట్స్‌ను రోజూ తినమని సలహా ఇస్తారు. బాదం, అక్రోట్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కానీ, సాధారణ వ్యక్తికి రోజూ బాదం, అక్రోట్ వంటి ఖరీదైన నట్స్ తినడం బడ్జెట్ కు దాటిన విషయం. అలాంటి సందర్భంలో, మీరు చియా సీడ్స్ తినవచ్చు. చియా సీడ్స్ నానబెట్టి తినాలి. చాలా తక్కువ మోతాదులో తీసుకుంటే, మీ గుండెకు ఆరోగ్యకరం.
గుండె ఆరోగ్యానికి తక్కువ నూనెను ఉపయోగించమని సలహా ఇస్తారు. ఖరీదైన ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగిస్తే మంచిదని చెప్తుంటారు. ఆలివ్ ఆయిల్లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కూడా గుండెకు మేలు చేస్తాయి. కానీ, అంత ఖరీదైన ఆలివ్ ఆయిల్ వాడే బదులుగా అవే గుణాలున్న శుద్ధి చేయని ఆవనూనెను వంటలో ఉపయోగించడం ఉత్తమం.
మార్కెట్లో దొరికే ఖరీదైన పండ్లలో అవకాడో టాప్ వరుసలో ఉంటుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ పోషకాలు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ, ఆవకాడో అంత కాస్ట్లీ పండు కొనుగోలు చేయలేని వారు దానికి బదులుగా వెల్లుల్లిని వేయించి తినండి. ఇది అవకాడో లాంటి ముఖ్యమైన పోషకాలను గుండెకు అందిస్తుంది.
గుండె ఆరోగ్యానికి దానిమ్మ తినడం చాలా ముఖ్యం. దానిమ్మలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనోల్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కానీ, ప్రతిరోజూ గుండె ఆరోగ్యం కోసం దానిమ్మ కొనుగోలు చేసి తినడం కుదరని వారు బీట్రూట్ కూడా తినొచ్చు.
సంబంధిత కథనం