Heart Attack: జన్యువును రీయాక్టివేట్ చేసుకుంటే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడొచ్చట!-heart attack reactivating a gene might help recover from the risk of heart attack ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Attack: జన్యువును రీయాక్టివేట్ చేసుకుంటే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడొచ్చట!

Heart Attack: జన్యువును రీయాక్టివేట్ చేసుకుంటే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడొచ్చట!

Ramya Sri Marka HT Telugu
Jan 19, 2025 06:30 PM IST

Heart Attack: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వస్తున్న ప్రమాదకరమైన వ్యాధి గుండెపోటు. సరైన సమయంలో స్పందించకపోతే ఇది ప్రాణాలనే బలి తీసుకోవచ్చు. తాజా పరిశోధనల ప్రకారం ఈ ప్రమాదకరమైన సమస్య నుంచి తప్పించుకునేందుకు ఓ మార్గం దొరికింది. మనలోనే ఉండే ఒక జన్యువు సహాయంతో గుండెపోటు అనేదే లేకుండా చేయొచ్చట.

జన్యువును రీయాక్టివేట్ చేసుకుంటే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడొచ్చట!
జన్యువును రీయాక్టివేట్ చేసుకుంటే గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడొచ్చట! (Pixabay)

పరిశోధనలతో జ్వరం లాంటి సమస్య నుంచి కరోనా వంటి మహమ్మారి వరకూ రక్షణ సంపాదించుకోగలిగాం. మారుతున్న జీవనశైలితో పాటు పెరిగే సమస్యలను కట్టడి చేయాలంటే, దానికి తగ్గట్లు చికిత్సను కనుగొనాలి. ఈ క్రమంలోనే గుండెపోటు ప్రమాదాలను నివారించేందుకు కూడా పరిశోధనలు జరిపి ఓ ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొన్నారు.

పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

గుండెపోటుతో బాధపడే వ్యక్తులలో నిష్క్రియాత్మక జన్యువు (డార్మెంట్ జీన్)ను రీయాక్టివేట్ చేయడం ద్వారా సమస్య నుంచి బయటపడేయొచ్చు. ఎలుకలలోనూ, మనుషులలోనూ ఈ విధంగా చికిత్స చేసి గుండె సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చట. సాధారణంగా గుండెపోటు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేక కణజాలం ఏర్పడుతుంది. ఇది హార్ట్ బీట్ కు సహకరించదు. దీని ఫలితంగా క్రమంగా గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తుంటాయి. అది అలాగే కొనసాగితే పూర్తిగా గుండె ఫెయిల్ అయ్యే ప్రమాదముంది. జీబ్రాఫిష్ లాంటి జంతువుల్లో ఈ సమస్యను వాటంతట అవే పరిష్కరించుకుంటాయి. ఏదో గాయం జరిగినట్లుగా 60 రోజుల్లో సమస్య నుంచి బయటపడతాయి.

ఎలాంటి ప్రయోగాలు చేశారు?

ఈ సూచనలతో శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. అందులో హెచ్ఎమ్జీఏ1 అనే ప్రొటీన్ ఈ గుండెపోటు నివారించడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. హెచ్ఎమ్జీఏ1అనే జన్యువును రీయాక్టివేట్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చని తెలుసుకున్నారు. ఆ జన్యువు చురుకుగా మారి గాయపడిన లేదా ఏదైనా సమస్యకు గురైన గుండెకు మరమ్మతులు చేస్తుందట. వీటి ఫలితంగానే పనితీరు మెరుగై ఒకసారి గుండెపోటు ప్రమాదానికి గురైన వారు లేదా గుండెపోటు రాబోయే సూచనలు ఉన్నవారు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఈ ప్రక్రియను ఎలుకలపై జరపడంతో విజయవంతంగా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించగలదని రుజువైంది.

ఎలుకలపై జన్యు చికిత్స ఫలితాలు:

శాస్త్రవేత్తలు వైరస్ వెక్టర్‌ను ఉపయోగించి ఎలుకల గుండెకు గాయమైన కణజాలానికి హెచ్‌ఎమ్‌జీఏ1 జన్యువును అందించారు. ఫలితంగా గుండె కండర కణాలు విభజించి పెరగడం ప్రారంభించాయి. గుండె మొత్తం పనితీరు మెరుగుపడింది. అదనపు కణజాలం పెరుగుదల లేదా ఆరోగ్యకరమైన కణజాలంలో విభజన వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించలేదు. గాయానికి ప్రతిస్పందనగా మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడినట్లు నిర్ధారణ అయింది.

మనుషులలో కలిగే ప్రయోజనాలు

మనుషులలో కూడా హెచ్‌ఎమ్‌జీఏ1 జన్యువు ఉంటుందట. ఇది గర్భస్థ శిశువుల అభివృద్ధి సమయంలో చురుకుగా ఉంటుంది. కానీ, పుట్టిన తరువాత ఏ పని చేయకుండా స్థిరంగా ఉంటుంది. ఈ జన్యువును తిరిగి చైతన్య పరచడం ద్వారా గుండెపోటు తర్వాత గుండె దగ్గర ఏర్పడే కణజాలాన్ని నిర్మూలించే, గుండె పనితీరు పునరుద్ధరించడంలో సహాయపడగలదు.

ఎలుక జన్యు నిర్మాణం దాదాపు మనుషులతో పోలి ఉంటుందనే నమ్మకంతో మనుషులలోనూ అవే ప్రయోజనాలు కలగొచ్చని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి, మనుషులపై ఇంకా పరిశోధనలు జరపలేదు. తర్వాతి దశలో మనుషులపై హెచ్ఎమ్జీఏ1 జన్యువు యాక్టివేట్ చేయడం ద్వారా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారట. అది సక్సెస్ అయితే కేవలం జన్యువును రీయాక్టివేట్ చేసి గుండెపోటు ప్రమాదాలను తగ్గించవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం