Heart Attack kit: ఈ హార్ట్ ఎటాక్ కిట్ ఏడు రూపాయలు మాత్రమే, ప్రతి ఇంట్లోనూ ఇది ఉండాల్సిందే
Heart Attack kit: ఇప్పుడు ఎవరికి హార్ట్ ఎటాక్ వస్తుందో చెప్పలేని పరిస్థితి. అందుకే ప్రతి ఇంట్లోనూ హార్ట్ ఎటాక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటే అన్ని విధాలా మంచిది.
Heart Attack kit: ఆధునిక కాలంలో 20 ఏళ్లకే గుండెపోటు బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు ఎవరికి గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అందుకే కాన్పూర్ లోని లక్ష్మీపతి సింఘానియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎమర్జెన్సీ ప్యాక్ ను తయారు చేశారు. ఇది ‘హార్ట్ ఎటాక్ ఫస్ట్ ఎయిడ్ కిట్’ గా చెప్పుకోవచ్చు. దీనికి ‘రామ్ కిట్’ అని పేరు పెట్టారు. అందులో రామ మందిరం ఫోటోతో పాటు అవసరమైన మందులు, మెడికల్ కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి. ప్రస్తుతం ఇది కాన్పూర్ లోనే అందుబాటులో ఉంది. అక్కడ జనవరి 13 నుంచి 5000 కుటుంబాలకు రామ్ కిట్లను అందించనున్నారు.
ఎకోస్ప్రిన్, రోసువాస్టానిన్, సోర్బిట్రేట్... అని మూడు రకాల మందులు ఉంటాయి. ఇందులో ఒకటి బ్లడ్ థిన్నర్, ఇంకోటి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే ముందు, మరొకటి గుండె పనితీరును మెరుగుపరిచే టాబ్లెట్. గుండె నొప్పిగా అనిపిస్తున్నప్పుడు తక్షణ ఉపశమనం కోసం వీటిని వేసుకోవాల్సి వస్తుంది. అత్యవసర సమయంలో ఈ మందులు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో గుండె జబ్బులు, స్ట్రోక్ కేసులు పెరిగిపోతాయి. కాబట్టి ఈ రామ్ కిట్ అందరి ఇళ్లల్లో ఉంటే మంచిది.
ఈ కిట్‌ను నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసినట్టు వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ కిట్ ఖరీదును కేవలం ఏడు రూపాయలు మాత్రమే పెట్టారు. గుండెపోటు లేదా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఈ మందులను తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం కొంతవరకు తగ్గుతుంది. ఆసుపత్రులకు తరలించే వరకు రోగి జీవించి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెలో విపరీతమైన నొప్పి వచ్చినప్పుడు కిట్లో ఉన్న మందులను వేసుకొని నేరుగా దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒత్తిడి బారిన పడకుండా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ గుండెను కాపావుకోవాలి. ప్రతి రోజూ వాకింగ్, రన్నింగ్ వంటివి కనీసం గంట పాటూ చేయాల్సిన అవసరం. బరువును అదుపులో పెట్టుకుంటే గుండె సమస్యలు తక్కువగా వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగ ఉండాలి. జంక్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయాలి. రోజులో కాసేపు మీకు ఇష్టమైన పనులను చేయాలి. సంగీతాన్ని వినడం, కామెడీ స్కిట్లు చూడడం వంటివి చూస్తే మంచిది. గుండెకు ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది.