రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోకపోతే గుండెకు ప్రమాదమట! ఎలాగో తెలుసుకోండి!-healthy mouth and healthy heart understanding the oral systemic link ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోకపోతే గుండెకు ప్రమాదమట! ఎలాగో తెలుసుకోండి!

రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోకపోతే గుండెకు ప్రమాదమట! ఎలాగో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

రోజుకు రెండు సార్లు బ్రష్ చేయకపోతే పాడయ్యేది మీ దంతాలు, నోటి ఆరోగ్యం మాత్రమే కాదట. గుండె ఆరోగ్యానికి కూడా ప్రమాదమేనట. నమ్మశక్యంగా లేదా? అయితే ఇది చదవండి. నోటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి మధ్య సంబంధం గురించి తాజా అధ్యయనాలు చెబుతున్న ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి.

నోటీ ఆరోగ్యానికి, గుండె ఆఱోగ్యానికి సంబంధం ఏంటి?

రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల దంతాలు బలంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. నోటి దుర్వాసన, చిగుళ్లు, నాలుకకు సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే తెలియని మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రోజుకు రెండు సార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోకపోతే గుండె జబ్బుల బారిన పడే ప్రమాదముందట. అవును నోటి ఆరోగ్యం మీ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అదెలాగో తెలుసుకుందాం రండి.

నోటి ఆరోగ్యానికి గుండె జబ్బులకు మధ్య సంబంధం ఏంటి?

మే 5న వెలువడిన పరిశోధనల ప్రకారం, నోటిలోని బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ విషయాన్ని వారు ఏయే అంశాల ఆధారంగా చెబుతున్నారంటే..

బ్యాక్టీరియా, ఎండోథెలియల్ నష్టం:

రక్తప్రవాహంలోకి చేరిన కొన్ని రకాల నోటి బ్యాక్టీరియా రక్త నాళాల లోపలి పొర అయిన ఎండోథెలియానికి అతుక్కుంటాయి. ఇది రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇన్ఫెక్షన్ ఇతర ముఖ్యమైన అవయవాలకు వ్యాప్తి చెందడానికి అవకాశం కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇది అవయవ వైఫల్యానికి లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.

పెరియోడాంటైటిస్, కొరోనరీ ఆర్టరీ వ్యాధి:

2021లో Pmc.ncbi.nlm.nih.govలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ఆరోగ్యకరమైన చిగుళ్ళు ఉన్నవారితో పోలిస్తే పెరియోడాంటైటిస్ ఉన్నవారికి కొరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ఇతర అధ్యయనాలు 'డోస్-రెస్పాన్స్' ప్రభావాన్ని సూచిస్తున్నాయి. దీని అర్థం చిగుళ్ల వ్యాధి ఎంత తీవ్రంగా ఉంటే, గుండె జబ్బుల ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని.

వాపుకీ గుండె జబ్బులకు మధ్య ఉన్న సంబంధం:

నోటి నుండి వచ్చే బ్యాక్టీరియా శరీరంలో వాపును కలిగిస్తుంది. దీర్ఘకాలిక పెరియోడాంటైటిస్ దీర్ఘకాలిక రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది, దీని వల్ల C రియాక్టివ్ ప్రోటీన్, సైటోకిన్‌ల వంటి తాపజనక మార్కర్ల స్థాయిలు పెరుగుతాయి. ఈ అణువులు రక్త నాళాల లైనింగ్‌లను దెబ్బతీస్తాయి. అథెరోస్క్లెరోసిస్ అభివృద్ధికి దోహదం చేస్తాయి. తద్వారా రక్తపోటు పెరుగుతుంది, గుండెపోటు, స్ట్రోక్ వంటి జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుంది.

నోటి పరిశుభ్రత విషయానికొస్తే..

సరైన నోటి పరిశుభ్రత లేకపోవడం వల్ల ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ (IE) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండె లోపలి పొర( లైనింగ్) లేదా కవాటాలకు వచ్చే ఇన్ఫెక్షన్. నోటి బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి గుండెలోని దెబ్బతిన్న ప్రాంతాలలో స్థిరపడినప్పుడు ఈ పరిస్థితి సాధారణంగా తలెత్తుతుంది.అంతేకాదు 2024లో Pubmed.ncbi.nlm.nih.govలో ప్రచురించిన కొత్త పరిశోధన ప్రకారం, శరీర మైక్రోబయోమ్‌లోని మార్పుల ద్వారా కూడా నోటి పరిశుభ్రత అనేది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

కాబట్టి నోటి ఆరోగ్యం అనేది కేవలం దంతాలు, చిగుళ్ల సమస్యలకు మాత్రమే పరిమితం కాదని తెలుసుకోండి. ముఖ్యంగా చిగుళ్ల వ్యాధిని కేవలం సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకండి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించడం, నోటి పరిశుభ్రతను పాటించడం ద్వారా మీ గుండెను కూడా కాపాడుకోండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.