Jonna dosa: బరువు, షుగర్ తగ్గించే జొన్న దోశ-healthy jonna dosa for breakfast helps in weightloss and diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jonna Dosa: బరువు, షుగర్ తగ్గించే జొన్న దోశ

Jonna dosa: బరువు, షుగర్ తగ్గించే జొన్న దోశ

Koutik Pranaya Sree HT Telugu
Sep 26, 2024 06:30 AM IST

Jonna dosa: ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారంతో మీ రోజును ప్రారంభించాలనుకుంటే ఈ జొన్న దోశను ట్రై చేయండి. బరువు తగ్గడంలో సాయం చేస్తుంది. మధుమేహులకు మంచి అల్పాహారమే. తయారీ చూసేయండి.

జొన్న దోశ
జొన్న దోశ (smithakalluraya)

మీరు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటే, బరువు తగ్గాలనుకుంటే జొన్న దోశలు మంచి అల్పాహారం. ఈ గ్లూటెన్ లేని జొన్న దోశ రెసిపీ మీ అల్పాహారానికి ఉత్తమం అని చెప్పొచ్చు. ఈ రెసిపీ తయారు చేయడం చాలా సులభం. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ఉండే పీచు ఎక్కువ సేపు ఆకలిని అవ్వకుండా చూస్తుంది. గ్లూటెన్ ఫ్రీ కాబట్టి, జొన్న దోశ అలర్జీల అవకాశాలను తగ్గిస్తుంది. ఇతర ధాన్యాలతో పోలిస్తే జొన్నలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జొన్న దోశ ఎలా చేయాలో తెలుసుకుందాం.

డయాబెటిస్ ఉన్నవాళ్లు దీన్ని ప్రయత్నించాలనుకుంటే కాస్త మార్పు చేసి ఈ కింది రెసిపీనే ప్రయత్నించొచ్చు. కేవలం జొన్నపిండి, రవ్వ వాడి దోశ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే జొన్నలు, మినప్పప్పు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మిక్సీ పట్టుకుని కూడా దోశలు వేయొచ్చు. ఇక్కడ చెబుతుంది మాత్రం ఇన్స్టంట్ రెసిపీ. అంటే పిండితోనే నేరుగా దోశలు వేసే పద్ధతి.

జొన్న దోశ తయారీకి కావలసిన పదార్థాలు

1 కప్పు జొన్నపిండి

1/4 కప్పు బియ్యం పిండి

1/4 కప్పు రవ్వ

అర చెంచా జీలకర్ర

2 పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు

1 అంగుళం అల్లం ముక్క, తురుము

నీరు తగినంత

ఉప్పు సరిపడా

3 చెంచాల నూనె

జొన్న దోశ తయారీ విధానం:

  1. జొన్న దోశ పిండి తయారీ చాలా సులభం. దాని కోసం ఒక పెద్ద గిన్నెలో జొన్నపిండి, బియ్యంపిండి, రవ్వ వేసుకోవాలి.
  2. అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, ఉప్పు వేసి నీళ్లు పోసుకోవాలి.
  3. మామూలు దోశల కన్నా పిండి కాస్త పలుచగానే ఉండేట్లు చూసుకోవాలి.
  4. పెనం పెట్టుకుని దోశ పిండి వేసి వీలైనంత పలుచగా వేసుకోవాలి. అంచుల వెంబడి నూనె వేసుకుని రెండు వైపులా కాల్చుకుంటే చాలు. జొన్న దోశ రెడీ.
  5. వేడిగా ఏదైనా చట్నీతో సర్వ్ చేసేయడమే.