Healthy Ice creams: షుగర్ లేకుండా హెల్తీ ఐస్ క్రీంలు ఎప్పుడైనా తిన్నారా..? ఇంట్లోనే ఈ సింపుల్ రెసిపీలతో ట్రై చేసేయండి!-healthy ice creams have you ever eaten healthy ice creams without sugar try these simple recipes at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Ice Creams: షుగర్ లేకుండా హెల్తీ ఐస్ క్రీంలు ఎప్పుడైనా తిన్నారా..? ఇంట్లోనే ఈ సింపుల్ రెసిపీలతో ట్రై చేసేయండి!

Healthy Ice creams: షుగర్ లేకుండా హెల్తీ ఐస్ క్రీంలు ఎప్పుడైనా తిన్నారా..? ఇంట్లోనే ఈ సింపుల్ రెసిపీలతో ట్రై చేసేయండి!

Ramya Sri Marka HT Telugu

Healthy Ice creams: మీకిష్టమైన ఐస్ క్రీంలను హెల్తీగా తినాలనుకుంటున్నారా? ఎటువంటి ఆర్టిఫీషియల్ క్రీంలు లేకుండా, చక్కెర వాడకుండా తయారుచేసుకునే రెండు రకాల ఐస్ క్రీం రెసిపీలు మీ ముందుకు తీసుకొచ్చాం. పుచ్చకాయ, డ్రై ఫ్రూట్స్‌తో చేసే ఈ ఐస్ క్రీంలు రుచితో పాటు మీ సమ్మర్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇంట్లోనే ఐస్ క్రీంలు తయారుచేసుకునేందుకు సింపుల్ రెసిపీలు

ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా? చిన్నారుల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతి ఒక్కరికీ ఐస్ క్రీం తినాలనే ఉంటుంది. కానీ, ఐస్ క్రీం తినడం వల్ల ఏదైనా సమస్య వస్తుందేమోననే భయంతో ముందే నో చెప్పేస్తుంటారు. కానీ, వేసవికాలం ఐస్ క్రీం తినాలనే కోరిక చంపుకోవడం కష్టమే. ముఖ్యంగా పిల్లల్ని ఈ సమయంలో ఆపలేం. అందుకే మార్కెట్లో దొరికే ఏదో ఒక ఐస్ క్రీం తెచ్చి ఇచ్చేస్తుంటాం. అలా కాకుండా మన ఇంట్లోనే, మన కళ్ల ముందే హెల్తీగా ఐస్ క్రీం తయారుచేసుకుంటే బాగుంటుంది కదా. అది కూడా షుగర్ లేకుండానే వాళ్ల ఆరోగ్యాలకు మేలు చేసే పుచ్చకాయ, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితోనే. వినడానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా ఈ ఐస్ క్రీంలు చాలా బాగుంటాయి.

మరింకెందుకు ఆలస్యం..! చక్కెర లేకుండా ఇంట్లోనే తయారుచేసుకునే పుచ్చకాయ ఐస్ క్రీం, డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీం ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

1. పుచ్చకాయ ఐస్ క్రీం (Watermelon Icecream):

కావాల్సిన పదార్థాలు

  • పుచ్చకాయ - 1
  • నిమ్మరసం - 1
  • తేనె - 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

  1. పుచ్చకాయ ఐస్ క్రీం తయారు చేయడం కోసం ముందుగా ఒక పుచ్చకాయను తీసుకుని పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఆ తర్వాత వాటిల్లో ఉండే గింజలన్నీ తీసేసి మిక్సీ జార్‌లో వేయండి.
  3. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో నిమ్మరసం, తేనె వేసి జ్యూస్ చేయండి.
  4. ఆ ద్రావణాన్ని ఐస్ క్రీం మౌల్డ్స్ లో లేదా మీ ఇంట్లో ఉండే చిన్న గ్లాసుల్లో వేసుకుని గాలి లోపలికి వెళ్లకుండా మూత బిగించండి.
  5. వీటిని డీప్ ఫ్రిజ్ లో పెట్టి ఒక పది గంటల పాటు ఉంచండి.

అంతే, ఇక మీకు కావాల్సిన హెల్తీ అండ్ టేస్టీ ఐస్ క్రీం రెడీ అయినట్లే.

2. డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీం (Dry Fruits Icecream):

కావాల్సిన పదార్థాలు:

  • బాదంపప్పు - ఒక కప్పు
  • జీడిపప్పు - ఒక కప్పు
  • ఫూల్ మఖానా - ఒక కప్పు
  • ఖర్జూరం (సీడ్లెస్)- 10 నుంచి 15
  • కోకూ పౌడర్ - అర కప్పు
  • వెనీలా ఎసెన్స్ - అర టీ స్పూన్
  • పాలు - ఒక కప్పు
  • వేడి నీళ్లు

తయారీ విధానం:

  1. డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీం తయారుచేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి.
  2. అందులో బాదంపప్పులు, జీడిపప్పులు, మఖానా వేయండి. దీంట్లోనే అవి మునిగేంత వరకూ వేడి నీళ్లు పోసుకుని పక్కకు పెట్టుకోండి.
  3. అరగంట పాటు వీటిని నానబెట్టిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకోండి.
  4. ఈ మిక్సీ జార్లో వాటితో పాటుగా గింజలు తీసేసిన ఖర్జూరాలు, కోకో పౌడర్, వెనీలా ఎసెన్స్‌తో పాటు కప్పు పాలను పోసి చిక్కటి పేస్ట్ లా అయ్యే విధంగా మిక్సీ పట్టండి.
  5. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గాజు కంటైనర్లో గానీ, ఐస్ క్రీం మౌల్డ్స్‌లో గానీ వేసి మూత గట్టిగా బిగించండి.
  6. దానిని డీప్ ఫ్రిజ్‌లో 8 నుంచి 10 గంటల పాటు ఉండనివ్వండి.

ఆ తర్వాత దానిని తీసి చూశారంటే, హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీం రెడీ అయిపోయినట్లే.

ఇంటిల్లి పాది ఎటువంటి ఆందోళన, అనారోగ్యం కలుగుతుందనే భయం లేకుండా ఐస్ క్రీంను ఎంజాయ్ చేసేయొచ్చు.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం