కాల్షియం, ఐరన్ లోపానికి ఇంట్లోనే దివ్యౌషధం ఈ హెల్తీ హల్వా, రెసిపీ చూసేయండి!-healthy halwa is a homemade remedy for calcium and iron deficiency check out the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కాల్షియం, ఐరన్ లోపానికి ఇంట్లోనే దివ్యౌషధం ఈ హెల్తీ హల్వా, రెసిపీ చూసేయండి!

కాల్షియం, ఐరన్ లోపానికి ఇంట్లోనే దివ్యౌషధం ఈ హెల్తీ హల్వా, రెసిపీ చూసేయండి!

Ramya Sri Marka HT Telugu

కాల్షియం, ఐరన్ లోపంతో బలహీనంగా ఉన్నామని ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ప్రత్యేకమైన హల్వా మీ కోసమే! రుచికరమైన, పోషకాలు ఉన్న ఈ హల్వాను ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోండి.

పోషకాల హల్వా తయారీ

సాయంత్రం అయ్యిందంటే చాలు, టీతో పాటు స్నాక్స్ కావాలనిపిస్తుంది కదా? బయటి నూనెలకు బదులు ఇంట్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్ తయారుచేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ ప్రత్యేకమైన హల్వా రెసిపీ మీ కోసమే. సాధారణంగా మనం తినే హల్వా కంటే ఇది చాలా డిఫరెంట్. ఎందుకంటే, ఇందులో వాడే పదార్థాలన్నీ పోషకాల గనులే.

ముఖ్యంగా మఖానాలు, వివిధ రకాల పప్పులు, గింజలు, కొబ్బరి వంటివి కలపడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం, ఐరన్ లోపాలతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

మఖానాలు - 2 కప్పులు

బాదం పప్పులు - 1/2 కప్పు

జీడిపప్పులు - 1/2 కప్పు

గుమ్మడి గింజలు - 1/4 కప్పు

అవిసె గింజలు - 1/4 కప్పు

యాలకులు - 2

కొబ్బరి పొడి - 1 కప్పు

పాలు - 1 కప్పు

నెయ్యి - 2-3 చెంచాలు

పంచదార/బెల్లం - తీపి అవసరాన్ని బట్టి.

టేస్టీ అండ్ హెల్తీ హల్వా
టేస్టీ అండ్ హెల్తీ హల్వా

తయారుచేసే విధానం:

  1. ముందుగా ఒక మందపాటి పాన్ లేదా కడాయిని స్టవ్ మీద పెట్టి వేడి చేయండి.
  2. వేడయ్యాక, అందులో మఖానాలను వేసి, నూనె లేకుండా డ్రై రోస్ట్ అంటే 5-7 నిమిషాల పాటు కరకరలాడే వరకు వేయించుకోండి.
  3. వేయించిన మఖానాలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని మరోసాని పాన్ వేడి చేయండి.
  4. ఇప్పుడు బాదం పప్పులు, జీడిపప్పులు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, యాలకులు వేసి, మీడియం ఫ్లేమ్‌పై 5 నిమిషాల పాటు లేదా మంచి సువాసన వచ్చేవరకు వేయించుకోండి.
  5. అవి మాడిపోకుండా చూసుకోండి.
  6. ఇప్పుడు వేయించిన పప్పులను కూడా మఖానాలు వేసిన ప్లేట్‌లోనే ఉంచి చల్లారనివ్వండి.
  7. అవి చల్లారిన తర్వాత, వాటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోండి.
  8. అందులోనే ఒక కప్పు కొబ్బరి పొడిని కూడా కలపండి.
  9. వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా, కొంచెం పలుకుగా ఉన్నా పర్వాలేదు.
  10. ఈ ప్రొటీన్ పౌడర్‌ను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి. అలా ఉంచడం వల్ల చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది.

హల్వా తయారుచేయడం:

  1. ఒక మందపాటి కడాయి లేదా పాన్ తీసుకోండి. అందులో ఒక కప్పు పాలు పోసి వేడి చేయండి.
  2. పాలు కాస్త వేడి అయిన తర్వాత, మీరు ముందుగా తయారుచేసుకున్న పొడిని ఒక కప్పు పాలకు ఒక కప్పు పొడి చొప్పున వేయండి.
  3. మీరు ఎక్కువ హల్వా చేయాలనుకుంటే, పాలు, పొడిని పెంచుకోవచ్చు.
  4. మంటను చిన్నగా ఉంచి పొడి వేసిన వెంటనే గరిటెతో ఉండలు కట్టకుండా నిదానంగా బాగా కలుపుకుంటూ ఉండాలి.
  5. మిశ్రమం కాస్త చిక్కబడటం మొదలుపెట్టాక, రెండు నుంచి మూడు చెంచాల నెయ్యిని అందులో వేయండి.
  6. నెయ్యి వేసిన తర్వాత, హల్వా పాన్ అంచులకు అంటుకోకుండా, అది నెయ్యిని వదిలి, పైకి తేలే వరకు బాగా కలుపుతూ వేడి చేయండి.
  7. సుమారు 5-10 నిమిషాలకు గానీ, హల్వా రెడీ అవదు.
  8. మీరు తీపి కావాలనుకుంటే, నెయ్యి వేసిన తర్వాతే కొద్దిగా పంచదార లేదా తురిమిన బెల్లాన్ని వేసుకోవచ్చు. అది కరిగే వరకు బాగా కలపండి.
  9. అంతే. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన, నోరూరించే హల్వా రెడీ అయినట్లే.
  10. దీన్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మీ కుటుంబంతో కలిసి ఈ న్యూట్రియంట్ హల్వాను ఆస్వాదించండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.