Sorakaya Patties: పిల్లల కోసం సొరకాయ ప్యాటీస్ తయారు చేసి ఇవ్వండి.. వేసవిలో ఇవి చాలా మంచివి!-healthy breakfast recipes try patties with bottleguard in this hot summer for your kids breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sorakaya Patties: పిల్లల కోసం సొరకాయ ప్యాటీస్ తయారు చేసి ఇవ్వండి.. వేసవిలో ఇవి చాలా మంచివి!

Sorakaya Patties: పిల్లల కోసం సొరకాయ ప్యాటీస్ తయారు చేసి ఇవ్వండి.. వేసవిలో ఇవి చాలా మంచివి!

Ramya Sri Marka HT Telugu

Sorakaya Patties: వేసవిలో శరీరానికి చల్లదనం అందించే సొరకాయను వారానికి రెండు సార్లైనా తప్పక తినాలట. రొటీన్ గా కర్రీ, పచ్చడి వంటివి కాకుండా సొరకాయతో ఈ సారి ప్యాటీస్ తయారు చేసి చూడండి. సొరకాయ అంటే నచ్చని వాళ్లు కూడా వీటిని ఇష్టంగా తింటారు. ఇదిగోండి ఈ సింపుల్ రెసిపీతో ఈజీగా సొరకాయ ప్యాటీస్ చేసేయండి.

సొరకాయతో తయారు చేసిన రుచికరమైన ప్యాటీస్

వేసవిలో నీరు ఎక్కువ తాగడంతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు పండ్లను తినడం చాలా అవసరం. నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయల్లో సొరకాయ ముందు వరుసలో ఉంటుంది. ఇది శరీరానికి తక్షణమే చల్లదనాన్ని అందిస్తుంది. అంతే కాదు సొరకాయలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు వంటివి సమృద్ధిగా కలిగిన సొరకాయ రక్తపోటు నుంచి కాలేయం వరకూ, చర్మం నుంచి జుట్టు వరకూ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా మేలు చేసే సొరకాయను వారానికి రెండు సార్లైనా తినకపోతే ఎలా? సొరకాయతో ఎప్పటిలాగా కూరలు, పచ్చళ్లు వంటివి కాకుండా ఈసారి వైరైటీగా ప్యాటీస్ తయారు చేయండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి మాత్రమే కాదు రుచిలో కూడా భలే ఉంటాయి. ఇదిగోండి రెసిపీ ఇవాళే ట్రై చేయండి.

సొరకాయ ప్యాటీస్ తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు:

  • సొరకాయ- ఒక కప్పు
  • శనగపిండి- రెండు టేబుల్ స్పూన్లు
  • బియ్యం పిండి- రెండు టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ- ఒకటి
  • కరివేపాకు
  • జీలకర్ర పొడి- పావు టీ స్పూన్
  • కారం పొడి- పావు టీ స్పూన్
  • ఉప్పు- రుచికి సరిపడా
  • నెయ్యి లేదా వెన్న - రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు

సొరకాయ ప్యాటీస్ తయారు చేసే విధానం..

  1. సొరకాయతో ప్యాటీస్ తయారు చేయడం కోసం ముందుగా సగం సొరకాయను తీసుకుని దాని తొక్క తీసేయండి.
  2. సొరకాయ ముక్కను సన్నగా తురుముకుని ఒక బౌల్ లో వేయండి.
  3. ఇప్పుడు దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేయండి.
  4. తరువాత దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలను వేయండి.
  5. ఆపైన జీలకర్ర పొడి, కారం పొడిలతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేయండి.
  6. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేంత వరకూ బాగా కలపండి. సొరకాయలో ఆల్రెడీ నీరు ఉంటుంది కనుక ఇందులో నీరు పోయాల్సిన అవసరం లేదు. ఓకవేళ పొరపాటున పిండి కాస్త ఎక్కువ పడి గట్టిగా అనిపిస్తే ఒకటి లేదా రెండు స్పూన్ల నీటిని పోసి పిండిని బాగా కలపండి.
  7. ఇప్పుడు ఈ మిశ్రమానికి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయండి.
  8. పదినిమిషాల తర్వాత మూత తీసి మళ్లీ ఒకసారి బాగా కలపండి. తరువాత పిండిని చిన్న చిన్న వుండలుగా తీసుకుని ప్యాటీస్( టిక్కీల్లాగా) తయారు చేసుకోండి.(ఇవి రెండు లేదా మూడు ఇంచులు ఉంటే సరిపోతుంది).
  9. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని దాంట్లో రెండు లేదా మూడు స్పూన్ల వెన్న లేదా నెయ్యిని వేసి వేడి చేయండి.
  10. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ప్యాటీస్ ను వేయించండి. మీరు కావాలంటే వీటిని నూనెలొ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు . కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కనుక. నెయ్యి లేదా వెన్నలో షాలో ఫ్రై చేసుకోవడం ఉత్తమం.
  11. ఇలా ప్యాటీస్ రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేంత వరకూ అటు ఇటు తిప్పుతూ వేయించారంటే రుచికరమైన, ఆరోగ్యకరమైన సొరకాయ ప్యాటీస్ రెడీ అయినట్టే.

వీటిని మీకు నచ్చిన టమాట చట్నీ, గ్రీన్ చట్నీ, అల్లం చట్నీలతో గానీ లేదంటే సాస్ లతో కానీ కలిపి సర్వ్ చేసేయచ్చు. ఇవి మీకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పనికొస్తాయి. సాయంత్రం స్నాక్ రూపంలో కూడా చక్కగా ఉంటాయి. ఏదైమైనా సొరకాయ ప్యాటీస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి తప్పకుండా వారంలో ఒకసారి వీటిని తినేందుకు ప్రయత్నించండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం