Ragi coffee: రాగి కాఫీ ట్రై చేశారా? రుచితో పాటూ ఆరోగ్యం కూడా-healthy and tasty ragi coffee recipe know how to make it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Coffee: రాగి కాఫీ ట్రై చేశారా? రుచితో పాటూ ఆరోగ్యం కూడా

Ragi coffee: రాగి కాఫీ ట్రై చేశారా? రుచితో పాటూ ఆరోగ్యం కూడా

Koutik Pranaya Sree HT Telugu
Published Aug 12, 2024 03:30 PM IST

Ragi coffee: రాగిపిండితో కాఫీ చేసుకోవచ్చని తెలుసా? కాఫీ తాగకుండా ఉండలేని వాళ్లు దాన్ని కాస్త ఆరోగ్యకరంగా మార్చేయాలనుకుంటే ఈ రాగి కాఫీ రెసిపీ ప్రయత్నించండి.

రాగి కాఫీ
రాగి కాఫీ (freepik)

చాలా రకాల కాఫీలు తాగే ఉంటారు కానీ, రాగిపిండితో చేసిన కాఫీ రుచి మాత్రం చూసి ఉండరు. ఆరోగ్యంతో పాటూ, రుచిగా కాఫీ తాగాలి అనుకుంటే ఒకసారి ఈ రాగి కాఫీ ప్రయత్నించండి. చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది.

రాగి కాఫీకోసం కావాల్సిన పదార్థాలు:

1 చెంచా రాగిపిండి

1 చెంచా ఇన్స్టంట్ కాఫీ పొడి

మీ రుచికి సరిపడా పంచదార లేదా బెల్లం

కప్పున్నర నీళ్లు

కప్పు పాలు

సగం టీస్పూన్ యాలకుల పొడి

రాగి కాఫీ తయారీ విధానం:

1. ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని కొద్దిగా వేడెక్కాక రాగి పిండి కలుపుకోవాలి. కనీసం రెండు నిమిషాలైనా రాగిపిండిని ఉడకనివ్వాలి.

2. ఇప్పుడు అందులోనే యాలకుల పొడి, కాఫీ పొడి, పాలు కూడా పోసుకోవాలి.

3. మరో రెండు మూడు నిమిషాలు సన్నం మంట మీద ఉడికించుకోవాలి.

4. ఇప్పుడు పంచదార లేదా బెల్లం కలిపుకుని కరిగిపోయాక వేడిగా సర్వ్ చేసుకోవడమే. రాగి కాఫీ రెడీ అయినట్లే.

5. ఇంకాస్త సులభంగా రెసిపీ రెడీ చేసుకోవాలి అనుకుంటే.. ముందుగానే రాగి పిండిలో కాఫీ పొడి, పంచదార, యాలకుల పొడి కలిపి మిక్సీ పట్టి పెట్టుకోవాలి.

6. నేరుగా నీళ్లలో ఈ పొడిని చెంచాడు ఉడికించి పాలు పోసుకుంటే రాగి కాఫీ రెడీ అవుతుంది. దీన్ని వేడిగా లేదంటే ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా కూడా తాగొచ్చు.

రాగిపిండి లాభాలు:

రాగులతో జావా చేసుకుని తాగడం అంటే అందరికీ ఇష్టం ఉండదు .ఆరోగ్యకరం అని తెలిసినా తాగలేరు. అలాంటప్పుడు దాంతో విభిన్న రెసిపీలు ప్రయత్నించి చూడొచ్చు. వాటిలో ఈ రాగి కాఫీ కూడా ఒకటి. రాగుల్లో పీచు ఎక్కువ. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. డయాబెటిస్ ఉన్నవాళ్లకు రాగులు చేసే మేలు చెప్పలేనిది. అమైనో యాసిడ్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. గ్లుటెన్ ఉండదు. కాబట్టి రాగిపిండిని ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

 

Whats_app_banner