Diabetes Prevention Tips: డయాబెటిక్ కుటుంబ చరిత్రలు ఉన్నాయా? అయితే ఇలా ఉండాల్సిందే!
Diabetes Prevention Tips: ఇంట్లో డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఉంటే దాని ప్రభావం మనమీదా పడొచ్చు. జన్యుపరంగా అది వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ముందుగానే మధుమేహం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
డయాబెటిస్ (pexels)
ఇవాళ, రేపు ప్రతి ఇంట్లోనూ చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. భారత దేశంలో సర్వ సాధారణంగా ఈ సమస్య కనిపిస్తూ ఉంది. మధుమేహం వచ్చిన వారు రోజూ మందులు వాడుకుంటూ, వాకింగ్ ఇతర వ్యాయామాలు చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. డయాబెటీస్ వస్తే సరే. మరి ఇది అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఎలాంటి జీవన విధానాన్ని అనుసరించడం వల్ల దీని బారిన పడకుండా ఉండొచ్చు? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ కుటుంబ చరిత్రలు ఉన్నవారు తప్పకుండా వీటిని అనుసరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

డయాబెటీస్ రాకుండా ఉండాలంటే వీటిని అనుసరించాల్సిందే :
- ఎప్పుడూ బరువు పెరగకుండా చూసుకోండి. ఒకవేళ ఊబకాయంతో బాధ పడుతున్నట్లయితే దాన్ని తగ్గించుకునేందుకు తగిన జీవన విధానాన్ని అవలంబించండి. శారీరక శ్రమను పెంచుకోవడం, వ్యాయామాలు చేయడం, ఆహార నిబంధనలతో మెల్లిగా మీరు ఉండాల్సిన బరువుకు చేరుకోండి.
- ఆహారంలో ఎక్కువ సరళమైన కార్బోహైడ్రేట్‌లను తీసుకోకండి. చక్కెరలు అధికంగా ఉన్న జ్యూసులు, శీతల పానీయాలకు దూరంగా ఉండండి. ప్రోసెస్డ్ ఫుడ్స్, వేయించిన పదార్థాలను తగ్గించండి. ట్రాన్స్ ఫ్యాట్లు అధికంగా ఉండే ఆహారాలను తినకండి. ఇవన్నీ మీ రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచేస్తాయి. అలాగే ఆహారం తినేప్పుడు బాగా నమిలి తినండి. దీని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గకుండా ఉంటుంది.
- ఒత్తిడిని తగ్గించుకోండి. ఎక్కువగా రోజుల పాటు ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల ఆ ప్రభావం శరీరపు రోగనిరోధక వ్యవస్థ మీద, హార్మోన్ల విడుదల మీద పడుతుంది. దీన్ని నియంత్రించుకోవడానికి యోగా, బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు, ధ్యానం లాంటివి చేసుకోండి. రోజూ పది నుంచి 15 నిమిషాల పాటైనా ప్రాణాయామం చేసుకోండి. కపాలభాతి, అనులోమ, విలోమ ప్రాణాయామాలతో మంచి ఫలితాలు ఉంటాయి.
- వారానికి తక్కువలో తక్కువ 150 నిమిషాలైనా వ్యాయామం ఉండేలా చూసుకోండి. అంతకంటే ఎక్కువ సమయం చేస్తే ఇంకా మంచిది. వాకింగ్, రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్, డ్యాన్స్... ఇలా మీకు నచ్చిన వాటిని ఎన్నుకుని చేసుకోండి. ఎప్పుడో ఒక రోజు మిస్ అయినా మిగిలిన రోజుల్లో నిర్ణీత వ్యవధిని పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఇలా చేయడం వల్ల కండరాలు దృఢంగా మారతాయి.
- మీరు ఆఫీసుల్లో పని చేసుకునే వారైతే ఎక్కువ సేపు ఒకటే పొజిషన్‌లో కూర్చుని అలా ఉండిపోకండి. అరగంటకు ఒకసారైనా కుర్చీ నుంచి లేచి నాలుగడుగులు వేయండి. శరీరాన్ని విరుచుకుని ఫ్లెక్సిబుల్‌గా మార్చుకోండి.
- ధూమపానం చేయడం వల్ల అది మీ రక్త నాళాలను బలహీన పరుస్తుంది. టైప్2 డయాబెటీస్ రిస్క్‌ని పెంచుతుంది. ఆరోగ్యకరంగా ఉండాలంటే ధూమపానానికి దూరంగా ఉండాల్సిందే అని గుర్తుంచుకోండి.