జాగ్రత్త.. మీ శరీరంలో ఈ 7 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి, ఇవి ప్రాణాంతక వ్యాధులకు సంకేతాలు కావచ్చు!
warning signs from body you should never ignore: చాలా సార్లు మన శరీరం వ్యాధులకు సంకేతాలను ఇస్తుంది. కానీ అవగాహన లేకపోవడం వల్ల మనం వాటిని పెద్దగా పట్టించుకోము. అలా నిర్లక్ష్యం చేయకూడని ప్రాణాంతక వ్యాధుల సంకేతాలు కొన్నింటి గురించి ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేతీ వివరించారు. అవేంటంటే..
నేటి బిజీబిజీ లైఫ్‌లో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాల వ్యాధుల ప్రమాదం పెరిగింది. నిజానికి ఏ వ్యాధి అయినా ప్రారంభంలోనే దాని లక్షణాలు శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి. కానీ చాలా సార్లు అవగాహన లేకపోవడం వల్ల మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాము. వ్యాధి గుర్తించే సమయానికి అది తీవ్రమైన దశకు చేరుకుంటుంది. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేతీ తన సోషల్ మీడియాలో ఆరోగ్యంతో సంబంధించిన ముఖ్యమైన విషయాలను తరచుగా పంచుకుంటారు, వాటిలో వారు కొన్ని హెచ్చరిక సంకేతాలను కూడా ప్రస్తావించారు.
శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సంబంధింత పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి తీవ్రమైన వ్యాధికి సంకేతాలు కావచ్చు. డాక్టర్ చెప్పిన ఆ హెచ్చరిక సంకేతాలను తెలుసుకుందాం.
1. అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి
డాక్టర్ సేతీ ప్రకారం అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడం, ఆ నొప్పి మీ ఎడమ చేతి వైపు వ్యాపించడం జరిగితే దాన్ని పొరపాటున కూడా ఉపేక్షించకూడదు. నిజానికి ఈ నొప్పి గుండెపోటుకు సంకేతం. మీకు ఈ రకమైన నొప్పి కలిగినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించుకుని మీ ప్రాణాలను కాపాడుకోండి.
2. మాట్లాడటంలో ఇబ్బంది
ఒక వ్యక్తికి అకస్మాత్తుగా మాట్లాడటంలో ఇబ్బంది మొదలైతే, వారి ముఖం ఒక వైపు వంగి ఉన్నట్లు అనిపిస్తే ఈ రకమైన లక్షణాలను నిర్లక్ష్య చేయకండి. ఎందుకంటే ఇది స్ట్రోక్ సంకేతం కావచ్చు. ఈ రకమైన సమస్య ఏర్పడినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
3. మలం లేదా మూత్రంలో రక్తం
డాక్టర్ సేతీ ప్రకారం, ఒక వ్యక్తి మలం లేదా మూత్రంలో రక్తం కనిపిస్తే అది చిన్న విషయం కాదు. ఇది కిడ్నీ లేదా పెద్దపేగుతో సంబంధించిన తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు. దీన్ని తేలికగా తీసుకోకండి. వైద్యుడి సలహా తప్పక తీసుకోండి.
4. పొట్టలో తట్టుకోలేని నొప్పి
ఒక వ్యక్తికి పొట్టలో అకస్మాత్తుగా తీవ్రమైన అంటే తట్టుకోలేనంత నొప్పి కలిగితే అది కూడా ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కావచ్చు. నిజానికి పిత్తాశయం లేదా కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నప్పుడు కూడా పొట్టలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ రకమైన లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఆయా శరీర భాగాలు ప్రమాదంలో పడతాయి.
5. అకస్మాత్తుగా బరువు తగ్గడం
ఎలాంటి వ్యాయామం లేదా ఆహార నియంత్రణ లేకుండా అకస్మాత్తుగా ఎవరికైనా బరువు తగ్గడం ప్రారంభమైతే అది సాధారణం కాదు. సంతోషించాల్సిన విషయం అస్సలు కాదు. అకస్మాత్తుగా ఎలాంటి ప్రయత్నం లేకుండా బరువు తగ్గడం అనేది ఏదో ఒక వ్యాధికి సంకేతం కావచ్చు. కాబట్టి ఈ రకమైన లక్షణం కనిపించినప్పుడు జాగ్రత్త పడండి.
6. రక్తంతో కూడిన దగ్గు
జలుబు, దగ్గు సమస్యలు సాధారణం. కానీ దగ్గనిప్పుడు నోట్లో నుంచి రక్తం వస్తే సాధారణం కాదని గుర్తుంచుకోండి. ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చు. డాక్టర్ సేతీ ప్రకారం, దగ్గినప్పుడు రక్తం రావడం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో పాటు మరేదైనా ప్రాణాంతక వ్యాధి లక్షణం కావచ్చు. కాబట్టి దీన్ని ఉపేక్షించకండి, వెంటనే డాక్టర్ సలహా తీసుకోండి.
7. కళ్లు మనసబారడం
ఒక వ్యక్తికి అకస్మాత్తుగా కంటి చూపులో సమస్య వస్తే, కళ్లు మసకబారినట్లు అనిపిస్తే లేదా వారి దృష్టి కోల్పోతున్నట్లు అనిపిస్తే అది రెటీనా డిటాచ్ అవడానికి సంకేతం. డాక్టర్ ప్రకారం, ఈ రకమైన లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మంచి కంటి నిపుణుడిని సంప్రదించండి. లేదంటే దీర్ఘకాలికంగా ఇది మిమ్మల్ని కంటి చూపు లేకుండా చేస్తుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం