Feeling Tired Always: రోజంతా అలసిపోయినట్లుగానే ఫీలవుతున్నారా.. ? అందుకు కారణమయ్యే 8 పనులేంటో తెలుసుకోండి!-health tips do you feel tired all day find out what 8 things are causing it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Feeling Tired Always: రోజంతా అలసిపోయినట్లుగానే ఫీలవుతున్నారా.. ? అందుకు కారణమయ్యే 8 పనులేంటో తెలుసుకోండి!

Feeling Tired Always: రోజంతా అలసిపోయినట్లుగానే ఫీలవుతున్నారా.. ? అందుకు కారణమయ్యే 8 పనులేంటో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

Feeling Tired Always: రోజంతా లేజీగా, నీరసంగా ఫీలవుతున్నారా? మీరు ఎంత ప్రయత్నించినా ఈ అలసటను తగ్గంచుకోలేక పోతున్నారా? లైట్ తీసుకోవద్దు. ఇది కాస్త సీరియస్ సమస్యే. విటమిన్ లోపం నుంచి క్రోనిక్ జబ్బుల వరకూ ఈ 8 సమస్యలు మిమ్మల్ని పట్టిపీడిస్తున్నాయని తెలుసుకోండి.

అలసట, నీరసంతో ఇబ్బందిపడటానికి కారణాలను తెలుసుకోండి

మనలో చాలా మందికి ఉదయం లేచినప్పటి నుంచీ అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. ఆహరం సరిగ్గా తీసుకుంటున్నా, వ్యాయామం వంటివి చేస్తున్నా, శరీరానికి కావల్సినంత రెస్ట్ తీసుకుంటున్నా కూడా ఈ ఫీలింగ్ నుంచి బయటకు రాలేదు. కాఫీలు, టీలు వంటి డ్రింక్స్ తాగినా కూడా యాక్టివ్ అవలేరు. మీకూ ఇలాగే జరుగుతుందా? అయితే మీరు గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు సమస్య మూలం తెలుసుకోకుండా ప్రయోగాలు చేస్తున్నారని. దీనికి కారణం మీరు ఫాలో అవుతున్న పేలవమైన లైఫ్ స్టైల్, పోషకాల లోపం లేదా బ్లడ్ షుగర్ లో హెచ్చు తగ్గులు, థైరాయిడ్, స్ట్రెస్ కూడా కావొచ్చు. ఒక్కోసారి మీరు తీసుకునే మెడిసిన్ కూడా ఈ సమస్యను పెంచే అవకాశం ఉంది. రోజంతా మీరు అలసట భావంతోనే ఉండటానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటో తెలుసుకోండి.

అలసత్వాన్ని పెంచే 8 అంశాలేంటో తెలుసుకుందామా..

1. విటమిన్ B12 లోపం

విటమిన్ B12 రక్తకణాలను ఉత్పత్తి చేయడంలో, నరాల పనితీరులో కీలకంగా వ్యవహరిస్తుంది. మీలో ఈ విటమిన్ లోపం ఉంటే, శరీరం సరిగా విధులు నిర్వర్తించలేదు. అంతేకాదు, నీరసం, బలహీనత, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ లోపం వల్ల కొన్నిసార్లు కండరాల్లో పటుత్వం కూడా కోల్పోతారు. ఐరన్, విటమిన్ డీ, మెగ్నీషియంలు లోపించినా కూడా బలహీనత పెరుగుతుంది.

2. ఎలక్ట్రోలైట్ సమన్వయ లోపం

ఈ సమస్యను మనం చాలా సార్లు ఎదుర్కొంటుంటాం. మీలో ఎవరైనా విరేచనాల సమస్యతో హాస్పిటల్ కు వెళితే వైద్యులు తక్షణ శక్తి కోసం సూచించేది ఎలక్ట్రోలైట్ పౌడర్. దానిని బట్టే మీరు ఓ విషయం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, విరేచనాలతో నీరసపడిన మీరు ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వల్ల మళ్లీ శక్తిని పొందుతారు. ఇక్కడ ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, కాల్షియం. ఇవి కండరాలతో పాటు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఒకవేళ ఈ మినరల్స్ లోపిస్తే, మీలో డీ హైడ్రేషన్, కిడ్నీ సమస్యలు వంటివి తలెత్తుతుంటాయి. ఈ లోపం వల్ల నీరసం కలిగించడంతో పాటు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

3. నిద్ర సమస్యలు

రాత్రంతా నిద్రపోయినా తెల్లవారిన తర్వాత లేచి నీరసంగా ఫీలవుతుంటే, మీకు నిద్ర సమస్య అయిన (sleep apnea) ఉందని అనుమానించాలి. ఈ సమస్య ఉన్న వారిలో నిద్రపోయినప్పుడు కాసేపటి వరకూ శ్వాస ఆగిపోతుంది. ఫలితంగా ప్రశాంతంగా నిద్రపోలేరు. తక్కువ నిద్ర పగటి పనివేళల్లో మీకు సమస్యను కలుగజేస్తుంది. తరచుగా అలసిపోయినట్లుగా, మైకం కమ్మినట్లుగా అనిపించి ఇబ్బందికరంగా మారుతుంది.

4. రక్తంలో సమస్యలు:

ఎర్ర రక్త కణాల్లో ఆక్సిజన్ సరిగా ఉత్పత్తి కాకపోతే మీ శరీరం ఆరోగ్యకరంగా ఉండదు. ఇలాంటి సమయంలో ఎనిమియా వచ్చే ప్రమాదం ఉంది. ఈ లోపం వల్ల నీరసం, బలహీనత, మైకం కమ్మినట్లుగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంటాయి. ఇది ప్రత్యేకించి ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

5. ఇన్ఫెక్షన్లు:

వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా నీరసం, బలహీనతలు ఏర్పడి శరీరంలో శక్తిని తగ్గిస్తాయి. అది ఫ్లూ అయినా జలుబు లాంటి సమస్యలైనా మిమ్మల్ని బలహీనంగా మార్చేస్తుంది.

6. న్యూరలాజికల్ సమస్యలు:

మల్టీపుల్ స్లెరోసిస్, పార్కిన్సన్స్ జబ్బులు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించి, ఇతర విధులు నిర్వర్తించేందుకు ఆటంకంగా మారతాయి. ఆ పరిస్థితిలో మీలో బలహీనత, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో మీ బరువును మోయడం కూడా మీకు కష్టంగా అనిపించొచ్చు.

7.థైరాయిడ్ సమస్యలు:

మెటబాలిజంను క్రమబద్ధీకరించడంలో థైరాయిడ్ గ్రంథి కీలకంగా వ్యవహరిస్తుంది. ఒకవేళ మీలో హైపోథైరాయిడిజం సమస్య ఉంటే అలసిపోయినట్లుగా అనిపించడం, బరువు పెరుగుతుండటం, బలహీనతలు, జలుబు వంటి వాటికి కారణం కావొచ్చు. ఫలితంగా మెటబాలిజం నెమ్మెదిస్తుంది. చివరకు శరీరం రోజువారీ విధులు నిర్వర్తించుకునేందుకు కూడా సరైన శక్తిని సమకూర్చుకోలేదు. ఎక్కువసేపు నీరసంగా ఉండాల్సి వస్తుంది.

8. దీర్ఘకాలిక సమస్యలు:

డయాబెటిస్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ ఆర్థరైటిస్ లాంటి సమస్యలున్న వారిలో నీరసం అనేది సాధారణంగానే కనిపిస్తుంది. శరీరం పూర్తిగా ఒత్తిడికి గురయ్యేలా చేసి మీలోని శక్తి స్థాయిలు క్షీణించేలా చేస్తుంది. ఉదాహరణకు డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో ఉండే షుగర్ లెవల్స్ అలసిపోయిన ఫీలింగ్ కలుగజేస్తాయి. క్యాన్సర్ పేషెంట్లు కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత శక్తి పూర్తిగా తగ్గిపోయినీరసించిపోతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం