BP Checking At Home: ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా? ఈ తప్పులు చేశారంటే సరైన బీపీని తెలుసుకోలేరు!-health tips are you checking your bp at home dont do these mistakes for the proper result ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bp Checking At Home: ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా? ఈ తప్పులు చేశారంటే సరైన బీపీని తెలుసుకోలేరు!

BP Checking At Home: ఇంట్లోనే బీపీ చెక్ చేసుకుంటున్నారా? ఈ తప్పులు చేశారంటే సరైన బీపీని తెలుసుకోలేరు!

Ramya Sri Marka HT Telugu

BP Checking At Home: మీకు బీపీ ఉందా? తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేక ఇంట్లోనే బీపీ మిషన్‌తో రక్తపోటును చెక్ చేసుకుంటున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. బీపీ చెక్ చేసుకునే సమయంలో కొన్ని పొరపాట్లు చేశారంటే సరైన బీపీని తెలుసుకోలేరు. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి.

ఇంట్లోనే బీపీ చెక్ చేసుకోవడం ఎలా? (shutterstock)

ఈ రోజుల్లో రక్తపోటు, షుగర్ అనేవి అందరి ఇళ్లల్లోనూ ఉండే సాధారణ సమస్యలుగా మారాయి. వీటిని ఎప్పటికప్పుడు పరీక్షించుకుని తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోక తప్పడం లేదు. చాలా మంది రక్తపోటు, షుగర్‌లో హెచ్చు తగ్గులకు పరీక్షించుకునేందుకు తరచూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేక మిషన్ తెచ్చుకుని ఇంట్లోనే పరీక్షలు చేసుకుంటున్నారు.

బిపీ చెక్ చేసుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మెషిన్లు దొరుకుతాయి. వీటి సహాయంతో బీపీ పెరుగుతుందో, తగ్గుతుందో తెలుసుకుని దాన్ని సాధారణ స్థాయిలో ఉంచుకోవడానికి ఆహారం, మందులు వాడుకోవచ్చు. ఇది మంచి విషయమే. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే.. చాలా మంది రక్తపోటును చెక్ చేసుకునేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు చేస్తారు. దీనివల్ల వారు సరైన బీపీని తెలుసుకోలేరు. ఈ విషయం గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ సౌరభ్ బాలీ తన సోషల్ మీడియాలో వివరంగా చెప్పుకొచ్చారు. బీపీ చెక్ చేసుకునే ముందు, చెక్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందులో వివరించారు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఇంట్లోనే బీపీ చెక్ చేసుకునేటప్పుడు చేయకూడని తప్పులు ఏంటి?

పని మధ్యలో బీపీ చెక్ చేయకండి:

ఇంట్లోనే రక్తపోటును పరీక్షించుకోవాలంటే.. ఎవరి బిపి చెక్ చేయాలో వారిని ముందుగా సిద్ధం చేయండి. అంటే 5 నిమిషాల పాటు వారిని విశ్రాంతి తీసుకోమని చెప్పండి. హడావిడిలో పనులు చేస్తే మధ్యలో వచ్చి బీపీ చెక్ చేసుకోకూడదు. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా ఉండి తప్పుడు బీపీ నమోదు అవుతుంది. 5 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత గుండె కొట్టుకునే వేగం సాధారణ స్థితికి చేరుకుంటుంది. తర్వాత బీపీ చెక్ చేశారంటే సరైన బీపీని తెలుసుకోవచ్చు.

కాఫీ, టీ తాగిన తర్వాత బిపి చెక్ చేయకండి

బిపి చెక్ చేసుకోవాలంటే కనీసం అరగంట ముందు ఏ రకమైన టీ, కాఫీ, సోడా తాగకండి. వ్యాయామం చేయకండి. ఇవన్నీ రక్తపోటును ప్రభావితం చేస్తాయి. ఇవి చేసి బీపీ చెక్ చేసుకుంటే మీకు తప్పుడు సమాచారమే అందుతుంది.

మూత్ర విసర్జన చేయడం చాలా ముఖ్యం

బిపి చెక్ చేసుకునే ముందు తప్పకుండా మూత్ర విసర్జన చేయాలని గుర్తుంచుకోండి. మూత్రాశయం నిండుగా ఉంటే బిపి పెరుగుతుంది.

సరిగ్గా కూర్చోండి

రెండు చేతులు టేబుల్ మీద పెట్టి, కుర్చీలో నిటారుగా వెనుకకు వాలి కూర్చోండి, కాళ్ళు నేల మీద పెట్టుకోండి. చాపి ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఇలా చాలా సడలింపుగా, ప్రశాంతంగా కూర్చోని బీప్ చెక్ చేసుకుంటే సరైన బీపీని తెలుసుకోవచ్చు.

బిపి కఫ్‌ను సరిగ్గా అమర్చండి

బిపి కఫ్‌ను బట్టల మీద అంటే కాకుండా చేతి మీద అమర్చండి. అవసరం కంటే ఎక్కువగా బిగువుగా కట్టకండి. రెండు వేళ్లు సులభంగా లోపలికి వెళ్ళేంత బిగువుగా ఉండాలి. ప్రశాంతంగా ఉండి, నిశ్శబ్దంగా బిపి చెక్ చేయండి.

రెండుసార్లు చెక్ చేయండి

బిపి చెక్ చేసి రికార్డ్ చేసుకోవాలంటే ఒకటి నుండి రెండు నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు చెక్ చేయండి. రెండుసార్లు వేరువేరు నంబర్లు వస్తే, సగటును నమోదు చేసుకోండి.

బిపి చెక్ చేసుకోవడానికి ఉత్తమ సమయం

రోజుకు రెండుసార్లు బిపి చెక్ చేసుకోవాలి. ఒకటి ఏమీ తినక ముందు అంటే ఉదయం, మరొకటి సాయంత్రం. రోజూ ఒకే సమయంలో బిపి చెక్ చేసుకుంటే సరైన రక్తపోటును తెలుసుకోగలుగుతారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం