Sugar Cravings: తీపి పదార్థాలతో ఆరోగ్య సమస్యలు, ఈ ఆహారాలను తింటే తీపి తినాలన్న కోరిక తగ్గిపోతుంది
Sugar Cravings: తీపి పదార్థాలు తినాలన్న కోరిక ఎక్కువగా అనిపిస్తే... ఆరోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్టే. పంచదారతో చేసిన ఆహారాలు ఎంత తక్కువగా తింటే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు.
Sugar Cravings: షుగర్ క్రేవింగ్స్ అంటే తీపి తినాలన్న కోరికలు పుట్టడం. అలాంటప్పుడు ఎన్నో స్వీట్లు గుర్తుకు వస్తాయి. వాటిని వెంటనే తినాలనిపిస్తుంది. పంచదారతో చేసిన ఇలాంటి స్వీట్లు తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా హానికరమే. షుగర్ క్రేవింగ్స్ తగ్గించే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని ప్రతిరోజూ తింటే మీకు పంచదారతో చేసిన ఆహారాలు తినాలన్న కోరిక పుట్టడం తగ్గుతుంది.
చాక్లెట్ తినాలన్న కోరిక మీకు పుట్టిందంటే... మీ శరీరంలో మెగ్నీషియం తగ్గిందని అర్థం. అలాగే ఉప్పగా ఉండే స్నాక్స్ తినాలన్న కోరిక మీకు కలిగిందంటే మీ శరీరంలో సోడియం తగ్గిందని అర్థం చేసుకోవాలి. ఇలా ప్రతి కోరిక వెనక ఏదో ఒక అర్థం ఉంటుంది. మీలో కలిగే ఒత్తిడి, విసుగు, భావోద్వేగాలు కూడా కొన్ని రకాల ఆహారాలను తినాలన్న కోరికను పెంచుతాయి. ముఖ్యంగా షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయి. అంటే మీరు ఒత్తిడికి, భావోద్వేగాలకు గురవుతున్నారని అర్థం చేసుకోవాలి. ఎలాంటి ఆహారాలు తింటే షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయో తెలుసుకోండి.
బెర్రీలు
మార్కెట్లో ఎన్నో బెర్రీ జాతుల పండ్లు లభిస్తున్నాయి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీలు... ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదే. వీటిని తరచూ తినడం వల్ల మీకు పంచదారతో చేసిన ఆహారాలు తినాలన్న కోరిక తగ్గిపోతుంది. ఈ బెర్రీ పండ్లు తినడం వల్ల క్యాలరీలు కూడా తక్కువగానే అందుతాయి. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవు.
నట్స్
బాదం, జీడిపప్పులు, వాల్ నట్స్... వంటివి తరచూ తింటూ ఉండాలి. ఇవి చక్కెర కోరికలను తగ్గిస్తాయి. గింజలను తింటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉండేలా చేస్తాయి. ఇవి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లను అందిస్తాయి.
పెరుగు
రోజూ కప్పు పెరుగు తినడం అలవాటుగా మార్చుకోండి. దీనిలో ప్రోటీన్ తో పాటు ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. పెరుగును తినడం వల్ల చక్కెర పదార్థాలు తినాలన్న కోరిక తగ్గుతుంది. పెరుగులో ఒక స్పూన్ తేనె కలుపుకొని తింటే ఇంకా మంచిది. లేదా పెరుగులో తాజా పండ్ల ముక్కలను వేసుకొని తిన్నా మంచిదే.
అవకాడో
అవకాడో పండ్లు తినడం వల్ల తీపి పదార్థాలు తినాలన్న కోరిక తగ్గుతుంది. అవకాడోలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అవకాడోలను వారానికి రెండుసార్లు తినడం అలవాటు చేసుకోండి.
దాల్చిన చెక్క
ప్రతిరోజూ తినే ఆహారంలో దాల్చిన చెక్కను భాగం చేసుకోండి. లేదా పాలల్లో దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగండి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే తీపి రుచి కోరికలు పెరగవు.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్లు తినడం వల్ల ఒత్తిడి, భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికం. కాబట్టి తీపి కోరికలను తగ్గిస్తుంది. ఇది కాస్త చేదుగా ఉంటుంది. కానీ తీపి తినాలన్న కోరికను సంతృప్తి పరుస్తుంది.
టాపిక్