Fake Badam: కల్తీ బాదం పప్పులతో ఆరోగ్య సమస్యలు, నకిలీ బాదం పప్పులను ఎలా గుర్తించాలి?
Fake Badam: మార్కెట్లో ఇప్పుడు ప్రతి వస్తువులను కల్తీ చేస్తున్నారు. అలాగే బాదం పప్పులు కూడా నకిలీవి వస్తున్నాయి. వాటిని తినడం ద్వారా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మార్కెట్లో నకిలీ బాదం పప్పులను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
బాదంపప్పులను ప్రతిరోజూ తినేవారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా శీతాకాలంలో రోగనిరోధక శక్తి కోసం బాదం పప్పులను తింటూ ఉంటారు. అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూలను కూడా అధికంగా తింటూ ఉంటారు. ఈ లడ్డూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో జలుబు, దగ్గు బారిన పడకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా త్వరగా అనారోగ్యానికి గురికాకుండా కాపాడతాయి.
రసాయనాలతో కల్తీ
మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు కల్తీ బారిన పడుతున్నాయి. చివరికి బాదం పప్పులను కూడా కల్తీ చేసి అమ్మేస్తున్నారు. బాదంలో కొన్నిసార్లు రసాయనాలు లేదా నకిలీ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. బాదం పప్పుల అమ్మకాలను పెంచడానికి, అవి మరింత ఆకర్షణీయంగా చూపించడానికి, చాలాసార్లు వ్యాపారులు హైడ్రోజన్ పెరాక్సైడ్, బ్లీచింగ్ ఏజెంట్లతో సహా హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. బాదం రంగును పెంచేందుకు ఈ రసాయనాలను ఉపయోగిస్తారు. కానీ ఇది బాదం సహజ నాణ్యత, పోషకాల కంటెంట్ను తగ్గిస్తుంది. ఇవి శరీరంలో చేరి విషాన్నిచేరుస్తాయి. జీర్ణవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. అందుకే బాదం పప్పులను కొనే ముందు చిన్న చిట్కాల ద్వారా అవి మంచివో లేక రసాయనాలు కలిసిన కల్తీవో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఇక్కడ మేము కొన్ని చిట్కాలు అందించాము. ఆ చిట్కాల ద్వారా బాదంపప్పులు మంచివో కాదో తేల్చుకోండి.
కల్తీ బాదంను గుర్తించడానికి చిట్కాలు
నిజమైన బాదం పప్పుల ఆకారం పొడవుగా, గుండ్రంగా ఉంటుంది. వీటి రంగు లేత గోధుమ లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అదే నకిలీ బాదం పప్పుల విషయానికి వస్తే వాటి ఆకారం అసాధారణంగా ఉంటుంది. దాని రంగు కూడా కొంచెం తేడాగా ఉంటుంది.
రుచి
నిజమైన బాదం తీపి, క్రీమీ రుచిని కలిగి ఉంటుంది. అదే కల్తీ బాదం పప్పులు తింటే కొంత చేదు రుచిని కలిగిస్తాయి.
నీటి టెస్ట్
నిజమైన బాదం పప్పులను నీటిలో నానబెట్టిన కొన్ని గంటల తర్వాత, వాటి తొక్కలు సులభంగా ఊడి వచ్చేస్తాయి. కానీ నకిలీ బాదం తొక్కలు అంత సులభంగా బయటకు రావు.
నూనె
నిజమైన బాదం పప్పులను చేతిలో రుద్దడం వల్ల వాటి నుండి తేలికపాటి నూనె విడుదల అవుతుంది. నకిలీ బాదం పప్పులను చేత్తో గట్టిగా నలిపితే నూనె ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు.
బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రొటీన్, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని రాత్రిపూట నానబెట్టి ఉదయం తినడం వల్ల ఇందులో ఉండే పోషకాలు అందుతాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు బాదం పప్పులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. వీటిని తినడం ద్వారా బరువు కూడా త్వరగా తగ్గవచ్చు. ఆకలి తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. కాబట్టి మంచి బాదంపప్పులను ఎంపిక చేసుకుని తినాలి.
టాపిక్