Mother's Day 2023: యాభై దాటిన మహిళలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Mother's Day 2023: ఈ మదర్స్ డే రోజు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతి మహిళ ప్రతిజ్ఞ తీసుకోవాలి. యాభై సంవత్సరాలు దాటాక జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
యాభై సంవత్సరాలు దాటగానే మహిళల శరీరంలో చాలా మార్పులొస్తాయి. ఎముక బలహీనంగా మారడం, నిద్ర లో మార్పులు, హృదయ స్పందన రేటు తగ్గడం, జీర్ణ శక్తి తగ్గడం లాంటి సమస్యలొస్తాయి. అందుకే యాభై దాటాక కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.
ట్రెండింగ్ వార్తలు
మంచి ఆహారం:
వయసు పెరుగుతూ ఉంటే శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా మారతాయి. విటమిన్లున్న ఆహారం, మినరళ్లు, పీచు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. మంచి ఆహారం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ సమస్యలు ధరి చేరవు. వీలైనన్ని ఎక్కువ పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారం, ఎక్కువ కొవ్వున్న ఆహారం తీసుకోవాలి.
శారీరక శ్రమ:
వ్యాయామం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. సరైన బరువులో ఉంటారు. అందుకే రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వాకింగ్ చేయడం, సైక్లింగ్, యోగా మీ దిన చర్యలో భాగం చేసుకోండి. మీ ఆరోగ్య స్థితి బట్టి డాక్టర్ సలహాతో ఇవి మొదలు పెట్టండి.
నిద్ర:
వయసు పైబడుతున్న కొద్దీ కావాల్సినంత విశ్రాంతి తీసుకోవాలి. యాభై దాటాక నిద్రలేమి సమస్య కాస్త ఇబ్బంది పెడుతుంది. రోజూ ఒకే సమయంలో నిద్ర పోవడం లేవడం, ఆల్కహాల్ కి దూరంగా ఉండటం, పడుకునే ముందు కాఫీ, టీకి దూరంగా ఉండటం మంచి నిద్రకు సాయపడతాయి.
వైద్య పరీక్షలు:
గుండె జబ్బులు, ఆస్టియోపోరోసిస్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఎముక సాంద్రతకు సంబంధించిన టెస్టులు, కొలెస్ట్రాల్ చెకప్ లు చేయించుకోవాలి. దీనివల్ల సరైన సమయంలో వైద్య సహాయం అందుతుంది.
శారీరక మార్పుల్ని మనం నియంత్రించలేం కానీ, వాటి ప్రభావం ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవన విధానంతో అది సాధ్యమవుతుంది.