Cloves Benefits: లవంగంతో ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదండోయ్.. కీళ్లనొప్పులకు కూడా..-health benefits of cloves you must know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Health Benefits Of Cloves You Must Know

Cloves Benefits: లవంగంతో ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదండోయ్.. కీళ్లనొప్పులకు కూడా..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 10, 2022 05:37 PM IST

Cloves Benefits: వంటింట్లో ఉండే మసాలాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే వంటశాలలోని పదార్థాలతో చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు అంటుంటారు. అయితే వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లవంగం గురించి. ఒక్క పంటినొప్పికే.. ఇంకా దీనితో చాలా ఉపయోగాలు ఉంటాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

లవంగాలు
లవంగాలు

Cloves Benefits : ఆయుర్వేద రంగానికి చెందిన చాలా సహజ మూలికలు, సుగంధ ద్రవ్యాలు మన వంటగదిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. అయినప్పటికీ వాటిని మనం సరిగా ఉపయోగించము. వాటి ఫలితాలు తెలియకపోవడం వల్లనే వాటిని మనం దూరం పెడతాము. వాటిలో ఒకటి లవంగం. ఇది శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో.. వీటిని శరీరానికి తగినట్లు ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

లవంగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఎండిన లవంగం శరీరంలోని తెల్ల రక్త కణాల పెరుగుదలను ప్రోత్సహించే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ కణాలు వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడానికి బాధ్యత వహిస్తాయి. పడుకునే ముందు రెండు లవంగాలను నమలి.. గోరువెచ్చని నీరు తాగితే.. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.

మీ కాలేయాన్ని బలంగా చేస్తుంది

మీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకుంటున్నారా? అయితే లవంగాలు మీకు సహాయపడతాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కాలేయాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. అంతే కాదు కాలేయ కణాల పునరుత్పత్తిని ప్రేరేపించే హెపాటోప్రొటెక్టివ్ లక్షణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజూ లవంగాలను నమలడం వల్ల మీ లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

దగ్గు నుంచి ఉపశమనం కోసం..

శ్వాసకోశ వ్యాధులను లవంగం నివారిస్తుంది. ముఖ్యంగా COVID-19 వ్యాప్తి తర్వాత ప్రజలు ఎక్కువగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే లవంగాలు దగ్గు, స్వరపేటికవాపు, గొంతు నొప్పి వంటి వాటిని ఎదుర్కోవడానికి సహజంగా పనిచేస్తుంది. మీరు లవంగం తీసుకుని బుగ్గన పెట్టుకోవచ్చు. అది దాని రుచిని కోల్పోయినప్పుడు ఊసివేయవచ్చు. మీరు వాటిని చూర్ణం చేసి గోరువెచ్చని నీటితో కలిపి తాగవచ్చు.

కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది

కీళ్ల నొప్పులు చాలా క్రూరంగా ఉంటాయి. అయితే మీరు రోజూ లవంగాలను తీసుకుంటే.. మీరు కొంత ఉపశమనం పొందడం ఖాయం. మీ కీళ్లను రిలాక్స్ చేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లవంగంలో పుష్కలంగా ఉన్నాయి.

దీనిలో ఉండే యూజీనాల్‌ కీళ్లనొప్పుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పంటి నొప్పికి చికిత్స చేస్తుంది. ఈ ప్రయోజనాలను పొందేందుకు మీరు రోజూ గోరువెచ్చని నీటిలో లవంగం పొడి కలిపి తాగవచ్చు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఈ రోజుల్లో జీర్ణ సమస్యలు సర్వసాధారణం. అపానవాయువు, వికారం, పొట్టలో పుండ్లు, అజీర్తి మనల్ని ఇబ్బంది పెట్టే జీర్ణ సంబంధిత రుగ్మతలు. అయితే లవంగాలను రోజూ తీసుకోవడం వల్ల ఇలాంటి అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు.

లవంగం మీ శరీరంలో ఎంజైమ్ స్రావాన్ని ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది అతిసారాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

WhatsApp channel

టాపిక్