Moon Facts: చంద్రునిపై ఉన్న ఏకైక సమాధి ఈయనదే, ఈ వ్యక్తి ఎవరు?
Moon Facts: చంద్రునిపై ఒకే ఒక వ్యక్తి సమాధి ఉంది. ఈ ఘనత సాధించిన వ్యక్తి ఎవరు? ఎందుకు అతని సమాధిని చంద్రుడిపై ఉంది? వంటి విశేషాలు తెలుసుకోండి.

Moon Facts: భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. మన కథల్లోనూ, జీవితంలోనూ చంద్రుడికి ఉన్న అనుబంధం ఎంతో ఎక్కువ. పిల్లలు పుట్టినప్పటి నుంచి చందమామను చూపిస్తూనే పెంచుతారు తల్లులు. ప్రతిరోజూ చంద్రుడు భూమికి తూర్పు వైపు నుంచి పడమర వైపుకు తిరుగుతూ ఉంటాడు. చంద్రుడు నిర్జన ప్రదేశంలా ఉంటాడు. బంజర భూమిని తలపిస్తాడు. ఎలాంటి జీవులు అక్కడ ఉండవు. ఎంతోమంది వ్యోమగాములు చంద్రుడి పై అడుగుపెట్టి వచ్చారు. అయితే ఎవరికీ దక్కని అరుదైన గుర్తింపు, అవకాశం ఒక వ్యక్తికి దక్కింది. చంద్రుడి నేలలో ఆ వ్యక్తి శాశ్వతంగా కలిసి పోయాడు. చంద్రుడి నేలలో ఖననమైన ఒకే ఒక వ్యక్తి ‘యూజిన్ షో మేకర్’.
ఎవరు ఇతను
యూజిన్ షూమేకర్ ఒక అమెరికన్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త. అతను భూమి, గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలపై అధ్యయనం చేస్తూ ఉండేవారు. చంద్రుపై నడిచిన అనేకమంది అపోలో వ్యోమగాములకు శిక్షణ ఇచ్చిన వ్యక్తి ఈయన. అతను రెండు ఖనిజాలను కూడా కనిపెట్టాడు. సౌర శాస్త్రంలో అతని సేవలు ఎంతో గుర్తింపు పొందాయి.
షూమేకర్ జూలై 18, 1997లో ఆస్ట్రేలియాలో ఒక ఉల్కాపాతం గురించి పరిశోధన చేస్తున్నప్పుడు కారు ప్రమాదంలో మరణించారు. అప్పుడు ఆయన వయసు 69 ఏళ్లు. ఆయన జీవించి ఉన్నప్పుడు అతనికి ఉన్న ఒకే ఒక కోరిక చంద్రుడిని పై అడుగు పెట్టాలని. కానీ ఆయన జీవించి ఉండగా ఆ కోరిక తీరలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు దహన సంస్కారాలను పూర్తి చేశారు. ఆ దహన సంస్కారాలలో మిగిలిన అవశేషాలను, బూడిదను చంద్రుడి పైకి పంపాలని అనుకున్నారు. అందుకోసం సెలెస్టిస్ అనే సంస్థను సంప్రదించారు. షూమేకర్ బూడిద ఉన్న చిన్న క్యాప్సూల్ ను చంద్రుపైకి పంపడానికి ఒప్పుకుంది ఆ సంస్థ. ఆ క్యాప్సుల్లో షూమేకర్ ఫోటోతో పాటు, అతని పేరు, జనన మరణ తేదీలు, అతని శరీర బూడిద ఉంది. 1999లో ఈ క్యాప్సూల్ ను చంద్రునిపై చేరేలా చేశారు. ఇలా చంద్రునిపై ఖననమైన ఒకే ఒక వ్యక్తిగా షూమేకర్. ఇదొక చరిత్ర అనే చెప్పుకోవాలి. అయితే ఈ షూమేకర్ క్యాప్సూల్ ఎక్కడ పడిందో అనేది మాత్రం అస్పష్టంగానే ఉంది. చంద్రుడిపై ఎలాంటి వాతావరణం ఉండదు, కాబట్టి ఈ క్యాప్సూల్ వందల ఏళ్ళ పాటు సురక్షితంగా ఉంటుంది.
చంద్రుని పై షూమేకర్ అవశేషాలను పంపించి అక్కడ ఖననం చేయడం అనేది ఆయనకు వ్యక్తిగత నివాళి మాత్రమే కాదు, సౌర రంగంలో మానవాళి విజయాలకు కూడా ఇది నిదర్శనం. చంద్రుని చేరుకోవాలన్న అతని కలను తీర్చడం వల్ల అతని ఆత్మ శాంతించి తీరుతుంది.
టాపిక్