Homemade Shampoo: జుట్టు సమస్యలు ఎక్కువ అయ్యాయా? గ్రీన్ టీ, తేనె కలిపి ఇలా షాంపూ తయారు చేసుకోని వాడండి
Homemade Shampoo: ఈ రోజుల్లో జుట్టు సమస్యలు లేని వారే లేరు. అయితే వీటి నుంచి బయటపడటానికి మార్కెట్లో దొరికే రకరకాల షాంపూలను వాడేకన్నా ఇంట్లోనే సహజమైన, రసాయన రహిత షాంపూలను తయారు చేసుకోవడం మంచిది. గ్రీన్ టీ, తేనె కలిపి తయారు చేసుకునే ఈ షాంపూ అనేక జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది. మీరూ ట్రై చేయండి.
జుట్టునుఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి షాంపూ వాడటం చాలా ముఖ్యం. మార్కెట్లో అనేక రకాల షాంపూలు లభ్యమవుతున్నాయి, కానీ వీటిలో చాలా వరకు రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టుకు మేలు కన్నా ఎక్కువ హానినే చేస్తాయి. అందువల్ల మీరు వీలైనంత వరకూ ఇంట్లోనే సహజమైన, రసాయన రహిత షాంపూలు తయారుచేసుకుని వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో జుట్టుకు అధిక శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఈ కాలంలో జుట్టులోని తేమ తగ్గిపోతుంది, దీనివల్ల జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంది. దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది.

మీరు కూడా ఇలాంటి సమస్యలతోనే ఇబ్బంది పడుతుంటే గ్రీన్ టీ, తేనెను కలిపి తయారు చేసిన షాంపూ మీకు సహాయపడుతుంది. ఇది పొడిబారిన మీ జుట్టుకు తేమను అందించి మృదువుగా, ఆరోగ్యంగా తయారు చేస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ముఖ్యంగా చుండ్రు సమస్య ఉన్న వారు ఈ షాంపూను ఉపయోగించడం ద్వారా మీరు ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ షాంపూను ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా ఉంది.
గ్రీన్ టీ, తేనెతో షాంపూ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:
2 స్పూన్ల తేనె
1 స్పూన్ ఆలివ్ నూనె
అరకప్పు గ్రీన్ టీ
1/4 కప్పు కాస్టైల్ సబ్బు
1 స్పూన్ నిమ్మరసం
1 స్పూన్ కలబంద
5-10 చుక్కల పుదీనా, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్
గ్రీన్ టీ, తేనె షాంపూను ఎలా తయారు చేయాలి?
- గ్రీన్ టీ, తేనెలను కలిపి షాంపూ తయారు చేయడానికి ముందుగా వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్‌ను 5-7 నిమిషాలు నానబెట్టండి.
- తర్వాత దాన్ని బయటకు తీసి ఈ నీటిని చల్లారనివ్వండి.
- చల్లారిన తర్వాత దాంట్లో తేనె కలపండి. తర్వాత దాంట్లోనే నిమ్మరసం, పుదీనా, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, ఆలివ్ నూనెలు వేసి చక్కగా కలపండి.
- ఆ తర్వాత దాంట్లొ కాస్టైల్ సబ్బు వేసి బాగా కలపండి.
- అంతే సహజమైన, రసాయన రహిత షాంపూ తయారైనట్టే. దీన్ని ఒక సీసాలో నింపుకుని నిల్వ చేసుకోవచ్చు.
వారానికి కనీసం రెండు సార్లు ఈ షాంపూతో తలస్నానం చేశారంటే అనేక రకాల జుట్టు సమస్యల నుంచి బయటపడచ్చు. తయారు చేయడం కూడా చాలా సులువు కనుక మీరే స్వయంగా తయారు చేసుకుని ఉపయోగించి చూడండి.
సంబంధిత కథనం