Yesubai Bhonsale: ఛావా సినిమా చూశారా? శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి-have you seen the movie chava there are many things to know about yesubai the wife of sambhaji maharaj ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yesubai Bhonsale: ఛావా సినిమా చూశారా? శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి

Yesubai Bhonsale: ఛావా సినిమా చూశారా? శంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి

Haritha Chappa HT Telugu
Published Feb 18, 2025 09:33 AM IST

Yesubai Bhonsale: చావా సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన భార్య యేసు బాయిగా రష్మిక నటించారు. యేసుభాయి భోంస్లే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

యేసుబాయి భోంస్లే
యేసుబాయి భోంస్లే

ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్య యేసుభాయి భోంస్లే గురించి మరాఠాలు ఇప్పటికీ చెప్పుకుంటారు. చారిత్రక విషయాలను సినిమాల రూపంలో చిత్రీకరిస్తుంటే యేసుభాయిలాంటి వీరవనితల గురించి ప్రజలకు తెలుస్తోంది. చావా సినిమా చూసిన వారందరికీ యేసుభాయి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కచ్చితంగా పుడుతుంది. ప్రముఖ చారిత్రక వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ మహారాజ్. ఆయన భార్య యేసు భాయి భోంస్లే. సినిమాలో చూసిన దానికన్నా ఈమె గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి.

శౌర్యం, ధైర్య సాహసాలకు పేరుగాంచిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన ఎనిమిది వివాహాలు చేసుకున్నారు. అందులో ఎక్కువ భాగం రాజకీయ లబ్ధి కోసమే పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ ఎనిమిది వివాహాల వల్ల శివాజీకి ఆరుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు పుట్టారు. పెద్ద కుమారుడు శంభాజీ. శంభాజీ శివాజీ పెద్ద భార్య అయినా సాయి బాయికి జన్మించారు. 1657లో శంభాజీ జన్మించారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. దాంతో అమ్మమ్మ ఆయన జీజాబాయి దగ్గరే పెరిగారు.

ఛావా అంటే ఏమిటి?

జిజా బాయి శంభాజీని పాండిత్యంలో, సైనిక శిక్షణలో ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దింది. అందుకే అతనిని చావా అని పిలుచుకుంటారు. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. సింహం శివాజీ అయితే... అతని కొడుకు ఛావా. అంటే సింహం పిల్ల.

యేసుబాయి పెళ్లి చిన్నప్పుడే

1664లో అంటే కేవలం ఏడేళ్ల వయసులోనే శంభాజీ వివాహం యేసుబాయితో జరిగిపోయింది. అది కూడా ఒక రాజకీయ లబ్ధి కోసమే. యేసు బాయి దేశ్ ముఖ్ కుటుంబానికి చెందిన అమ్మాయి. మహారాష్ట్రలోని తాళ్-కొంకణి ప్రాంతంలో ఈ దేశ్ ముఖ్‌లు ఎంతో శక్తివంతమైన వారు. శివాజీ తన మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించాలన్న కోరికతో దేశ్ ముఖ్‌ల అమ్మాయిని తన ఇంటికి కోడలుగా తెచ్చుకున్నారు.

మంచి రాజకీయ నిపుణురాలు

అప్పట్లో బాల్యవివాహాలే ఉండేవి. కనుక చాలా చిన్న వయసులోనే వివాహాలను చేసేవారు. అలా శంభాజీకి, యేసుభాయికి కూడా వివాహం జరిగిపోయింది. యేసు బాయి మరాఠా సర్దార్ అయిన ఫిలాజీ రావు షిర్కే కూతురు. ఆమె కేవలం ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్య మాత్రమే కాదు మంచి రాజకీయ నిపుణురాలు కూడా. మరాఠా సామ్రాజ్యంలో రాజకీయ అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని సరిదిద్దడానికి సహాయపడిన రాజకీయ నాయకురాలిగా కూడా ఎదిగింది.

భర్తను ఉరితీసినా...

1689లో ఆమె భర్త శంభాజీని మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఉరితీసాడు. ఆ సమయంలో అందరి మహిళల్లా ఆమె ఏడుస్తూ కూర్చోలేదు. అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా అద్భుతమైన దౌత్య సామర్ధ్యాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించింది. 1680 నుండి 1730 వరకు యేసుబాయి మరాఠా సామ్రాజ్యానికి బలమైన పునాదిలా నిలిచింది. ఔరంగజేబుతో భర్త పోరాడుతున్నప్పుడు ఆమె కూడా రాజకీయ యుద్ధ తాంత్రికతను ప్రదర్శించింది. శంభాజీ మరణించిన వెంటనే తన మరిది యువరాజ్ రాజారామ్ ను తదుపరి చత్రపతిగా ప్రకటించింది. శంభాజీ మరణం తర్వాత కూడా ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు ఆమె యుద్ధాన్ని కొనసాగేలా చేసింది.

ముప్పై ఏళ్లు జైల్లోనే

యుద్ధంలో ఓటమి తరువాత ఔరంగజేబు ఆమెను సుమారు 30 సంవత్సరాలు పాటు జైల్లోనే ఉంచాడు. అయినా కూడా ఆమె బలంగా నిలిచి ఉంది మరాఠా సామ్రాజ్యం పడిపోకుండా చూసుకుంది. చరిత్రలో ఎక్కువ మంది రాణులు కేవలం అంత:పురానికే పరిమితమయ్యేవారు. కానీ యేసుబాయి అలా కాదు. భర్తతో కలిసి రాజ్యాన్ని పాలించేందుకు ముందుకు వచ్చింది. భర్త యుద్దాల పేరుతో ఎక్కువ కాలం రాజధానికి దూరంగానే ఉన్నప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకొని రాజ్యాన్ని ముందుకు నడిపించింది. ఛత్రపతి రాజధానిలో లేనప్పుడు స్వరాజ్యాన్ని చూసుకునే అధికారాలను కలిగి ఉన్న ప్రధాన వ్యక్తిగా ఆమె మారింది.

భారతదేశ చరిత్రలో గొప్ప మహిళల్లో యేసుబాయి కూడా ఒకరు. ఆమె మరాఠా సామ్రాజ్యంలో తనదైన ముద్రను వేసింది. ఇప్పటికీ శివాజీ, శంభాజీతో పాటు యేసు బాయిని కూడా మరాఠాలు తలుచుకుంటూనే ఉంటారు. యేసుభాయిలోని ధైర్యమే మరాఠా సామ్రాజ్యాన్ని పూర్తిగా కూలిపోకుండా కాపాడింది.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం