పాలను సంపూర్ణ ఆహారంగా చెబుతారు. ఇది దాదాపు అన్ని ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఆవు లేదా గేదె పాలు కంటే ఎక్కువ పోషకమైన ఆహారం లేదన అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వాటిని మించిన పోషకాహారం గురించి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదే బొద్దింక పాలు. ఇది ఆవు పాల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుందని వివరిస్తున్నారు.
శాస్త్రవేత్తలు బొద్దింక పాలను సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, నట్స్ లో ఉన్నట్టే బొద్దింక పాలలో కూడా చాలా పోషకాలు ఉన్నాయని అంటున్నారు. కానీ వాస్తవానికి బొద్దింక విడుదల చేసేది పాలు కాదు. పసుపు రంగులో ఉండే ద్రవం. ఇది గట్టిపడి స్ఫటికాల రూపాన్ని తీసుకుంటుంది. ఆ స్పటికాలనే బొద్దింక పాలగా పరిగణిస్తారు.
సూపర్ ఫుడ్ అనే పదాన్ని పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో పాటు తక్కువ కేలరీల కంటెంట్ కలిగి ఉంటే వాటిని సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు. బొద్దింక పాలను కూడా ఈ జాబితాలో చేర్చారు.
బొద్దింకలు తమ పిల్లలకు ఆహారం ఇవ్వడానికి ప్రోటీన్ నిండిన పసుపు ద్రవాన్ని విడుదల చేస్తాయి. అవి స్ఫటికాల రూపంలోకి మారుతాయి. ఈ స్ఫటికాలు అధిక పోషక విలువలను కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, కొవ్వు నిష్పత్తి పూర్తిగా సమతుల్యంగా ఉంటుంది. వీటితో పాటు ఈ బొద్దింక పాలలో మొత్తం తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉంటాయి. వీటిని మన శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు.ఈ అమైనో ఆమ్లాలను ఆహారం ద్వారా మాత్రమే తీసుకోవాలి. శరీరంలోని కణాలను మరమ్మత్తు చేయడానికి, నిర్వహించడానికి ప్రోటీన్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లను తిన్న తర్వాత, అవి విచ్ఛిన్నమై జీర్ణక్రియ, కణాల పునరుత్పత్తి, పెరుగుదలకు తోడ్పడే అమైనో ఆమ్లాలను ఏర్పరుస్తాయి.
బొద్దింక పాలలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని 1997లో నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఇందులో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో పాటు అన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయి. అదే సమయంలో, ఈ పాలు లాక్టోస్ లేనివి. కానీ 2016లో చేసిన పరిశోధన తర్వాత ప్రజల్లో ఆసక్తి పెరిగింది.
2016 లో, ఆడ పసిఫిక్ బీటిల్ బొద్దింకల పాలపై విశ్లేషణలు జరిగాయి. ఇందులో బొద్దింక పిల్లలు తినే స్ఫటికాలు అత్యంత పోషకమైనవని కనుగొన్నారు. జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ యానిమల్ క్రిస్టలోగ్రఫీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, బొద్దింకలలో గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ కేలరీలు ఉంటాయి.
బొద్దింకలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి బొద్దింక పాలలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని తెలుసుకున్నారు. కానీ జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ నుండి వచ్చిన పరిశోధన బొద్దింక పాలు మానవులకు తినడానికి సురక్షితం అని ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పింది. దీనిపై మరింత లోతైన పరిశోధనలు అవసరమని చెప్పాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం