పచ్చి మామిడికాయ పకోడీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి తింటే వదల్లేరు, నోరూరిపోవడం ఖాయం-have you ever eaten raw mango pakoda know how to make this pakodi recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పచ్చి మామిడికాయ పకోడీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి తింటే వదల్లేరు, నోరూరిపోవడం ఖాయం

పచ్చి మామిడికాయ పకోడీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి తింటే వదల్లేరు, నోరూరిపోవడం ఖాయం

Haritha Chappa HT Telugu

పచ్చి మామిడికాయ వేసవిలోనే అధికంగా దొరుకుతుంది. ఇక్కడ మేము పచ్చి మామిడికాయతో చేసే మ్యాంగో పకోడీ రెసిపీ ఇచ్చాము. తిన్నారంటే వదల్లేరు.

మామిడి పకోడీ రెసిపీ

పకోడీలను అనేక రకాలుగా చేస్తారు. ఒకసారి పచ్చి మామిడికాయతో కూడా చేసి చూడండి. ఈ మ్యాంగో పకోడీ పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. సాయంత్రం పూట ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే.. ఇలా మ్యాంగో పకోడీ చేసేయండి. ఒక పచ్చి మామిడికాయ, శెనగపిండి ఉంటే చాలు టేస్టీ పకోడీ సిద్ధమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం... మామిడికాయ పకోడీ ఎలా చేయాలో తెలుసుకోండి.

మ్యాంగో పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పచ్చి మామిడికాయ - ఒకటి

శనగపిండి - అరకప్పు

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

కరివేపాకు తరుగు - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

కారం - అర స్పూను

ఉల్లిపాయలు - రెండు

వంట సోడా - పావు స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

మామిడికాయ పకోడీ రెసిపీ

1. పచ్చి మామిడి కాయను తీసుకొని దానిమీద పొట్టును తీసేయండి.

2. ఇక మిగతా మామిడికాయను సన్నగా తరగండి.

3.మీకు పకోడీలలో మామిడికాయ ముక్కలు ఏ సైజులో కావాలో ఆ సైజులో తరగొచ్చు. లేదా ఉల్లిపాయల్లాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవచ్చు.

4. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండిని వేసి రుచికి సరిపడా ఉప్పును వేయండి.

5. అలాగే కారం, వంట సోడా కూడా వేసి బాగా కలపండి.

6. ఇప్పుడు మామిడికాయ తురుము, ఉల్లిపాయల తురుము, కరివేపాకుల తురుము, కొత్తిమీర తురుము కూడా వేసి బాగా కలుపుకోండి.

7. చిన్న స్పూన్ తో రెండు మూడు స్పూన్ల నీటిని కూడా వేసి బాగా కలపండి.

8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసి వేడెక్కించండి.

9. అది వేడెక్కాక మామిడికాయ మిశ్రమాన్ని చేత్తో తీసి పకోడీల్లా వేసుకోండి. అన్ని వైపులా ఇది వేగేలా చూసుకోండి.

10. ఆ తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేయండి. టిష్యూ పేపర్ ఆ నూనెను బాగా పీల్చేస్తుంది.

11. ఇప్పుడు మామిడికాయ పకోడీ సిద్ధమైనట్టే. ఇంకెందుకు ఆలస్యం ఈ మ్యాంగో పకోడీని ట్రై చేయడం మొదలుపెట్టేయండి.

వేసవిలోనే పచ్చి మామిడికాయలు అధికంగా దొరుకుతాయి. కాబట్టి మీరు ఈ పచ్చి మామిడికాయ పకోడీని ఇప్పుడే ట్రై చేయాలి. పండిన మామిడి దీనికి పనికిరాదు. పచ్చిగా ఉన్న మామిడినే ఎంపిక చేసుకోవాలి. మామిడికాయలో ఉన్న పోషకాలు కూడా శరీరంలో చేరుతాయి. మీకు ఆయిల్ డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ఎయిర్ ఫ్రైయర్ లో ఈ పకోడీని చేసుకోవచ్చు. ఎలా చేసినా ఈ మామిడికాయ పకోడీ మాత్రం అద్భుతంగా ఉంటుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.