ఉప్మా మీకు నచ్చకపోవచ్చు... కానీ పెరుగు ఉప్మా తిన్నారంటే నోరూరిపోతుంది. నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటుంది. ఈ పెరుగు ఉప్మా చేయడం కూడా చాలా సులువు. మేము చెప్పిన పద్ధతిలో పెరుగు ఉప్మా చేసి చూడండి. నమలాల్సిన అవసరం లేకుండా గొంతులోకి జారిపోయేంత మెత్తగా ఉంటుంది. ఈ పెరుగు ఉప్మా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
జీడిపప్పులు - గుప్పెడు
పల్లీలు - గుప్పెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
పెరుగు - అర కప్పు
అల్లం తురుము - ఒక స్పూను
టమాటా తురుము - రెండు స్పూన్లు
నూనె - రెండు స్పూన్లు
ఆవాలు - ఒక స్పూను
జీలకర్ర - అర స్పూను
పచ్చిశనగపప్పు - ఒక స్పూను
మినప్పప్పు - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఎండుమిర్చి - మూడు ఉ
ఉప్మా రవ్వ - ఒక కప్పు
నెయ్యి - ఒక స్పూను
అల్లం తురుము - అర స్పూను
నీళ్లు - తగినన్ని
పసుపు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
1. పెరుగు ఉప్మా చేసేందుకు ఒక గిన్నెలో అరకప్పు పెరుగును వేయండి.
2. అందులోనే అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, టమోటో తురుము, కొత్తిమీర తురుము వేసి బాగా కలుపుకోండి.
3. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
5. ఆ నూనెలో జీడిపప్పులు, పల్లీలు వేసి వేయించండి. వాటిని తీసి పక్కన పెట్టుకోండి.
6. ఇప్పుడు మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకులు వేసి వేయించండి.
7. అది వేగాక ఉప్మా రవ్వను వేసి వేయించండి.
8. అది కూడా వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసి చిన్న మంట మీద ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి.
9. ఇది దగ్గరగా ఉప్మాలాగా అయ్యే వరకు కలుపుకోండి.
10. ఉప్మా లాగా అయ్యాక పైన జీడిపప్పులు, పల్లీలు చల్లుకోండి.
11. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా చల్లండి. కొన్ని కొత్తిమీర తురుము కూడా చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ పెరుగు ఉప్మా రెడీ అయినట్టే.
సాధారణ ఉప్మా బోరు కొట్టినప్పుడు ఇలా పెరుగు ఉప్మా చేసుకోండి. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు. ఇది సున్నితంగా గొంతులోకి జారిపోయేటట్టు ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. ఈ పెరుగు ఉప్మా రుచి అద్భుతంగా ఉంటుంది. మీకు లంచ్ లేదా డిన్నర్ తినాలనిపించకపోతే ఇలా పెరుగు ఉప్మా చేసుకొని తినండి. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పెరుగు ఉప్మా అద్భుతంగా ఉంటుంది.
సంబంధిత కథనం