Strong Tea: స్ట్రాంగ్ టీ తాగడం అలవాటా? అయితే మీ ఆరోగ్యానికి డ్యామేజ్ తప్పదంటున్న ఐసీఎమ్ఆర్
Strong Tea: టీ ని స్ట్రాంగ్‌గా తాగేవారి సంఖ్య ఎక్కువే. టీ స్ట్రాంగ్ గా చేసేందుకు ఎక్కువ సమయంపాటూ మరిగిస్తూ ఉంటారు. ఇలా ఎక్కువసేపు మరిగించడం వల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్ట్రాంగ్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు.
టీ కి అభిమానులు ఎక్కువ. ప్రతిరోజూ మూడు నాలుగు సార్లు టీ తాగేవారు ఉన్నారు. ఉదయం లేవగానే ఉత్సాహం రావడానికి, సాయంత్రం అలసట పోవడానికి ఇలా ఒక్కో కారణం చెబుతూ రోజులో టీ చాలాసార్లు తాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం పూట స్ట్రాంగ్ టీ తాగే వారి సంఖ్య ఎక్కువే. స్ట్రాంగ్ టీ చేయడం కోసం ఆ టీని ఎక్కువసేపు మరిగిస్తారు. ఇలా ఎక్కువసేపు మరిగించి తాగే టీ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) టీ తాగే విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
పాలతో చేసిన టీని అధికంగా మరిగించి తాగడం వల్ల శరీరంలో ఇనుము శోషణకు ఆటంకం కలుగుతుందని ICMR హెచ్చరిస్తోంది. అంతే కాదు ఎక్కువ సేపు ఉడకబెట్టిన టీ తాగడం వల్ల కాలేయం, గుండెపై చెడు ప్రభావం పడుతుంది. మిల్క్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రధాన అనర్థాలేంటో తెలుసుకోండి.
స్ట్రాంగ్ టీతో వచ్చే సమస్య
ఎక్కువ సేపు మరిగించిన టీ తాగడం వల్ల ఒక వ్యక్తి బీపీ పెరిగే అవకాశం ఉంది. టీని ఎక్కువ సేపు మరిగించినా, లేదా పదే పదే వేడి చేసిన తర్వాత తాగినా టానిన్లు అధికంగా విడుదలవుతుంది. ఇది రక్తపోటును పెంచడానికి పనిచేస్తుంది. కాబట్టి హైబీపీ ఉన్న వారు స్ట్రాంగ్ టీ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
స్ట్రాంగ్ టీలో ఉండే టానిన్లు శరీరంలో పోషకాలను, ముఖ్యంగా ఇనుము, కాల్షియం శోషణను అడ్డుకుంటాయి. టీని ఎక్కువ మోతాదులో తీసుకునే వారిలో ఎముకలు, దంతాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు, అధికంగా స్ట్రాంగ్ టీ తాగడం వల్ల రక్తహీనత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మహిళలు, పిల్లలు స్ట్రాంగ్ టీ తాగడం ఏమాత్రం మంచిది కాదు.
మిల్క్ టీని ఎక్కువగా మరిగించినప్పుడు అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ తొలగిపోతాయి. మిల్క్ టీని ఎంత ఎక్కువగా మరిగిస్తే అంతగా అది జీర్ణం కావడం కష్టమవుతుంది.
ఎసిడిటీ పెరుగుతుంది
టీని ఎక్కువ సేపు మరిగించడం ద్వారా అందులో ఉండే థియాఫ్లేవిన్, కాటెచిన్స్ వంటి ఒత్తిడిని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు తొలగిపోతాయి. అలా కాకుండా టీని ఎక్కువ సేపు మరిగించి తాగితే అందులో ఎసిడిటీ గుణం పెరిగి జీర్ణం కావడం కష్టమవుతుంది. టీ చేదు రుచితో మారుతుంది.
జీర్ణ సమస్యలు
ఉడికించిన టీ తాగడం వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. ఇలాంటి టీని ఎక్కువగా తాగడం వల్ల ప్రోటీన్ నిర్మాణంలో మార్పు కలుగుతుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, నొప్పి, కడుపులో ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిరంతరం పాల టీని మరిగించడం వల్ల టీలో ఉండే టానిన్లు ఎక్కువవుతాయి. ఇది జీర్ణం కావడం కష్టమవుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)