Fatty liver: ఫ్యాటీ లివర్‌కు కారణమయ్యే అలవాట్లు ఇవే.. త్వరగా గుర్తిస్తే మేలు
నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆరంభంలో గుర్తిస్తే జీవనశైలి మార్పులతో చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్‌కు కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. సాంకేతికత పెరిగి మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్ డివైజెస్‌పై ఆధారపడడం పెరిగిపోయింది. లైఫ్‌స్టైల్‌లో భారీ మార్పులు వచ్చాయి. కదలిక లేని జీవనశైలి అనేక వ్యాధులకు దారితీస్తోంది. డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్, గుండె జబ్బులు.. ఇలా ఒకటేమిటి అనేక లైఫ్‌స్టైల్ వ్యాధులకు కారణమవుతోంది.
ఇటీవలి దశాబ్దాల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఏఎఫ్ఎల్‌డీ) కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అన్ని వయస్సుల వారినీ ఈ సమస్య వేధిస్తోంది. లివర్ (కాలేయం) చుట్టూ అసాధారణంగా కొవ్వులు పేరుకుపోవడమే ఫ్యాటీ లివర్ డిసీజ్. కాలేయంలో అధికమొత్తంలో కొవ్వు పేరుకుపోతే కడుపు నొప్పి, వికారం, ఆకలి లేకపోవడం, కాళ్లలో వాపు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కొన్ని కేసుల్లో ఆరంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొవ్వు బాగా పేరుకుపోయినప్పుడు ఇక సమస్యలు అనేక రెట్లు పెరుగుతాయి. డయాబెటిస్, ఒబెసిటీ ఉన్న వారిలో సమస్యలు తీవ్రమవుతాయి. వీరినే కాకుండా అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్న వారందరికీ హాని చేస్తుంది. పోషకాహారం తీసుకోకుండా, కేవలం జంక్ ఫుడ్స్ పై ఆధారపడే వారిపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
అయితే ఫ్యాటీ లివర్‌ను ఆరంభంలోనే గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. ముఖ్యంగా జీవనశైలిని మార్చుకోవడం, ఫిట్‌నెస్ పెంచుకోవడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఫ్యాటీ లివర్ వ్యాధి ముదిరితే అది లివర్ సిరోసిస్‌కు దారితీస్తుంది. అంటే లివర్ బాగా దెబ్బతిని, పూర్తిగా విఫలమయ్యే పరిస్థితి. అంతిమంగా అది లివర్ క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు.
ఫ్యాటీ లివర్ వ్యాధికి సంబంధించి కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ అర్కా ముఖోపాధ్యాయ్ వివరించారు. ఫ్యాటీ లివర్‌కు దారితీసే అలవాట్లను వివరించారు.
ఫ్యాటీ లివర్‌కు దారితీసే అలవాట్లు
ఆహార అలవాట్లు:
‘ఫ్యాటీ లివర్‌కు దారితీసే అలవాట్లో మొదటిది ఆహార అలవాట్లు. ధాన్యం గింజలు, పప్పులు, కూరగాయలు, పాల ఉత్పత్తులను తీసుకునే మనం క్రమంగా బర్గర్లు, శాండ్‌విచ్‌లు, ఫ్రైడ్ చికెన్ వంటి వాటికి అలవాటుపడుతున్నాం. ఆకలిగా లేకపోయినా అవి ఇష్టం కాబట్టి తింటున్నాం..’ అని డాక్టర్ ముఖోపాధ్యాయ్ వివరించారు.
కదలిక లేని జీవనశైలి
‘రెండో ప్రమాదకర అలవాటు ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం. మనం కనీసం నడిచే ప్రయత్నం కూడా చేయం. సైకిల్ కూడా తొక్కం. కార్లు, బైకులు, బస్సులను ఆశ్రయిస్తాం. పిల్లలకు క్రీడామైదానాలు కరువయ్యాయి. క్రికెట్, ఫుట్ బాల్ వంటి వాటి జోలికి పోకుండా మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు..’ అని డాక్టర్ ఆందోళన వ్యక్తంచేశారు.
జంక్ ఫుడ్
‘మన శారీరక అవసరాలను తీర్చే శక్తిని ఆహారం సమకూరుస్తుంది. అయితే మనకు అవసరమైనదానికంటే ఎక్కువగా మనం వినియోగిస్తున్నాం. దానిని కరిగించేందుకు మనం శారీరక శ్రమ చేయడం లేదు. ఫలితంగా కొవ్వులు పేరుకుపోతున్నాయి. కాలేయం ఈ కొవ్వులను ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది. అలాగే రక్త నాళాల్లో పేరుకుపోతుంది. ఫలితంగా స్ట్రోక్, గుండె పోటు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఒబెసిటీ వంటి వ్యాధులు చుట్టుముడుతాయి..’ అని డాక్టర్ వివరించారు.
ఫ్యాటీ లివర్ పూర్తిగా నయమవుతుందా?
డాక్టర్ ముఖోపాధ్యాయ్ దీని గురించి మాట్లాడుతూ ఆరంభంలో ఎలాంటి మందులు అవసరం లేదని, తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నూనెలు, కొవ్వులు తగ్గిస్తూ కూరగాయలు, పండ్లు తీసుకోవడం పెంచాలి.
‘కదలిక లేని జీవితాన్ని గడపడం మానేయాలి. కనీసం రోజుకు 30 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వారంలో ఇలా 5 రోజులు చేయాలి. తేడా మీకే తెలుస్తుంది. రోజూ కనీసం 5 వేల అడుగుల దూరం నడవాలి. దీని వల్ల మీ ఫ్యాటీ లివర్ తగ్గుముఖం పట్టడమే కాకుండా, డయాబెటిస్ ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉంటే సాధారణ స్థితికి చేరుకుంటుంది. బరువు తగ్గుతారు. రాత్రి పూట మంచిగా నిద్ర పడుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది..’ అని డాక్టర్ వివరించారు.