పొడవాటి, ఒత్తైన జుట్టు ప్రతి ఒక్కరి కల. కానీ నేటి జీవనశైలి, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి... వెరసి జుట్టు రాలడం సాధారణ సమస్యగా తయాయరింది. వీటితో పాటు మీరు ఊహించని ఒక చిన్న అలవాటు కూడా మీ జుట్టు రాలడానికి కారణం కావచ్చు తెలుసా? దీన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. అదే మీరు నిద్రపోయే విధానం!
రాత్రంతా మీ జుట్టు ఎలా ఉంటుందో పట్టించుకోకపోతే, అది బలహీనంగా మారి రాలడం మొదలుపెడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మరి నిద్రపోయేటప్పుడు జుట్టును విప్పేసి పడుకోవాలా లేక చక్కగా జడ వేసుకుని పడుకోవాలా? ఎలా ఉంచితే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు? తెలుసుకుందాం!
నిద్రపోయేటప్పుడు జడ వేసుకోవడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో, కొన్ని రకాల కట్టుబాట్లు జుట్టుకు హాని కూడా కలిగిస్తాయి. కాబట్టి, సరైన మార్గం ఏంటో చూడండి.
పొడవాటి జుట్టును వదులుగా వదిలేస్తే, రాత్రిపూట అది చిక్కులు పడుతుంది. అలాంటప్పుడు దువ్వినప్పుడు జుట్టు రాలిపోయే అవకాశం పెరుగుతుంది. కాబట్టి, నిద్రపోయేటప్పుడు వదులుగా జడ వేసుకోవడం లేదా బన్ లాంటిది వేసుకోవడం వల్ల జుట్టు చిక్కులు పడకుండా ఉంటుంది, తద్వారా తెగిపోవడం తగ్గుతుంది.
జుట్టు కట్టి ఉంచడం అంటే జడ వేసుకోవడం వల్ల మంచం మీద ఎక్కువగా వ్యాపించదు. దీనివల్ల దుమ్ము, ధూళి, చెమట వంటి వాటి వల్ల జుట్టు పాడయ్యే అవకాశం తగ్గుతుంది.
ముఖ్యంగా వేసవి కాలంలో జుట్టు కట్టుకుని నిద్రపోవడం వల్ల మెడకు, వీపుకు జుట్టు తగలకకుండా ఉంటుంది. తద్వరా కాస్త తక్కువ వేడిగా అనిపిస్తుంది. చికాకు ఉండదు.
నిద్రపోయేటప్పుడు జుట్టు ముఖానికి అడ్డు రాకుండా ఉంటే చర్మంపై మొటిమలు లేదా దద్దుర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. జుట్టు చర్మంపై ఒత్తిడి కలిగించడం వల్ల రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వచ్చే అవకాశం ఉంది.
జుట్టును మరీ బిగుతుగా రబ్బర్ బ్యాండ్లు లేదా క్లిప్‌లతో కట్టడం వల్ల జుట్టు మూలాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది జుట్టును బలహీనపరుస్తుంది, తెగిపోయేలా చేస్తుంది.
చాలా గట్టిగా కట్టడం వల్ల తలలో నొప్పి లేదా అసౌకర్యం కలుగుతుంది. ఇది నిద్రకు కూడా భంగం కలిగిస్తుంది.
క్రమం తప్పకుండా బిగుతుగా ఉండే హెయిర్ స్టైల్స్ వేసుకోవడం వల్ల జుట్టు మూలాలు బలహీనపడతాయి. దీని వల్ల వెంట్రుకలు పలుచగా మారతాయి, రాలడం పెరుగుతుంది.
నెత్తిని మరీ గట్టిగా కట్టడం వల్ల గాలి సరిగా ప్రసరించదు. ఇది చుండ్రు లేదా దురద వంటి సమస్యలకు దారితీస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిద్రపోయేటప్పుడు జుట్టును మరీ బిగుతుగా కాకుండా వదులుగా కట్టాలి లేదా విప్పార వేయాలి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఎల్లప్పుడూ వదులుగా ఉండే జడ వేసుకోవడం లేదా వదులుగా ఉండే బన్ వేసుకోవడం మంచిది.
అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం నిద్రపోయేటప్పుడు మీ జుట్టును ఎలా ఉంచుతున్నారో ఒకసారి గమనించండి. సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోండి.