Gummadikaya Halwa: టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెసిపీ ఇదిగోండి, ఇంటిల్లిపాదికీ ఇది నచ్చేస్తుంది
Pumpkin Halwa: గుమ్మడికాయ హల్వా చాలా రుచిగా ఉంటుంది, కానీ దీన్ని చేయడం వచ్చిన వారి సంఖ్య తక్కువే. నిజానికి దీన్ని చాలా సులువుగా చేయవచ్చు. రెసిపీ ఇదిగోండి.

Pumpkin Halwa: పూర్వం గుమ్మడికాయలతో ఎన్నో రెసిపీలను చేసేవారు. కానీ ఇప్పుడు వాటిని తినేవారి సంఖ్యా తగ్గిపోయింది. గుమ్మడికాయతో హల్వా చేస్తే అదిరిపోతుంది. ఎప్పుడూ క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వానే కాకుండా ఇలా గుమ్మడికాయ హల్వా చేసి చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పంచదార వేస్తాం, కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు తినకపోవడమే మంచిది.
గుమ్మడికాయ హల్వా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
తీపి గుమ్మడికాయ - ఒకటి
పాలు - రెండు కప్పులు
యాలకుల పొడి - ఒక స్పూను
నెయ్యి - రెండు స్పూన్లు
జీడిపప్పు - అర కప్పు
కోవా - ఒక కప్పు
చక్కెర - ఒక కప్పు
గుమ్మడికాయ హల్వా రెసిపీ
1. తీపి గుమ్మడికాయను ఈ హల్వా కోసం ఎంపిక చేసుకోవాలి. దాని పైన చెక్కు తీసి గింజలను వేరు చేయాలి.
2. మిగతా గుమ్మడికాయను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు దళసరిగా ఉండే గిన్నెను స్టవ్ మీద పెట్టాలి.
3. అందులో నెయ్యిని వేసి జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఆ నెయ్యిలోనే గుమ్మడికాయ తురుమును వేసి వేయించాలి. మంట చిన్నగా పెట్టుకోవాలి.
5. పాలు పోసి బాగా ఉడికించాలి. అది కాస్త చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కోవా వేసుకొని బాగా ఉడికించుకోవాలి.
6. అది మొత్తం దగ్గరగా హల్వాలాగా వచ్చేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి.
7. పైన ముందుగా వేయించుకున్న జీడిపప్పులను చల్లుకోవాలి.
8. అంతే రుచికరమైన గుమ్మడికాయ హల్వా తినేందుకు సిద్ధమైపోయింది.
9. ఇది అతిధులకు వడ్డిస్తే బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా గుమ్మడికాయ హల్వా చేసి పెట్టండి.
పిల్లలైనా, పెద్దలైనా ఇప్పుడు గుమ్మడికాయలతో చేసిన రెసిపీలు తినడం తగ్గించేశారు. వీటితో ఉండే కూరలు అంత రుచిగా ఉండవు. కాబట్టి ఈ గుమ్మడికాయలను తినేవారి సంఖ్య తగ్గిపోయింది. అలాంటివారు గుమ్మడికాయ హల్వా చేసుకుని తినేందుకు ప్రయత్నించండి. అలా అయినా గుమ్మడికాయలోని పోషకాలు శరీరంలోకి చేరుతాయి. పంచదారను తగ్గించుకుంటే మంచిదే. కోవా వేసాంజ... కాబట్టి పంచదార తక్కువగా వేసుకున్నా పర్వాలేదు. పంచదార బదులు బెల్లాన్ని ప్రయత్నించవచ్చు. కాకపోతే అది కాస్త జిగటగా వస్తుంది.
టాపిక్