Gongura Pulihora: పుల్లపుల్లని గోంగూర పులిహోర, టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ, చేయడం చాలా సులువు-gongura pulihora recipe in telugu know how to make this lunch box recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Pulihora: పుల్లపుల్లని గోంగూర పులిహోర, టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ, చేయడం చాలా సులువు

Gongura Pulihora: పుల్లపుల్లని గోంగూర పులిహోర, టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ, చేయడం చాలా సులువు

Haritha Chappa HT Telugu
Nov 02, 2024 05:30 PM IST

Gongura Pulihora: గోంగూర ఆకులతో చేసే రెసిపీలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక్కడ మేము గోంగూర రైస్ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

గోంగూర పులిహోర రెసిపీ
గోంగూర పులిహోర రెసిపీ

గోంగూర వంటకాలు రుచిగా ఉంటాయి. గోంగూర పచ్చడి అంటే తెలుగువారికి ఎంతో ఇష్టం. గోంగూర పప్పు, గోంగూర మటన్ కూరలే కాదు ఒకసారి గోంగూర రైస్ కూడా చేసి చూడండి. ఇది పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీ గా ఉపయోగించవచ్చు. గోంగూర రైస్ చేయడం కూడా చాలా సులువు. స్పైసీగా చేసుకుంటే రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా గోంగూర పచ్చిమిర్చి కాంబినేషన్లో ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది.

గోంగూర రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

గోంగూర ఆకులు - రెండు కట్టలు

బాస్మతి బియ్యం - ఒక కప్పు

మిరియాలు - నాలుగు

జీలకర్ర - అర స్పూను

ఎండుమిర్చి - నాలుగు

ధనియాలు - ఒక స్పూను

నూనె - సరిపడినంత

పల్లీలు - గుప్పెడు

పచ్చిశనగపప్పు - ఒక స్పూను

ఆవాలు - అర స్పూను

పచ్చిమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

ఉప్పు - రుచికి సరిపడా

గోంగూర రైస్ రెసిపీ

1. గోంగూర ఆకులను ఏరి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. బాస్మతి బియ్యాన్ని ముందుగానే వండుకోవాలి. అది పొడిపొడిగా వచ్చేలా ఆరబెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు వేసి వేయించాలి.

4. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

6. ఆ నూనెలో గోంగూర ఆకులను వేసి ఉడికించాలి.

7. గోంగూర ఆకుల మొత్తం మెత్తగా పేస్టులా అయ్యే వరకు ఉడికించుకోవాలి.

8. అందుకు తగిన నీళ్లు కూడా పోయాలి. ఇలా గోంగూర ఆకులు మెత్తగా వేయించుకున్నాక ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

9. కొంచెం చింతపండు కూడా అందులో వేసి మిక్సీ చేసుకోవాలి.

10. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి నూనె వేయాలి.

11. ఆ నూనెలో పల్లీలు వేసి వేయించాలి.

12. అలాగే శనగపప్పు, మినప్పప్పు కూడా వేసి వేయించాలి.

13. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి.

14. కొన్ని కరివేపాకులను కూడా వేసి వేయించాలి.

15. ఇప్పుడు గోంగూర పేస్టును అందులో వేసి బాగా కలుపుకోవాలి.

16. పసుపు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.

17. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి.

18. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి.

19. పైన నిమ్మరసాన్ని చల్లుకోవాలి. అంతే టేస్టీ గోంగూర రైస్ రెడీ అయినట్టే.

20. ఇది చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీ గా దీన్ని తినవచ్చు.

గోంగూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ బి2, విటమిన్ బి1, విటమిన్ సి, విటమిన్ బి9, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలన్నీ గోంగూరలో ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యవసరమైనవి. గోంగూరను తినడం వల్ల అన్ని రకాలుగా మనకు మేలే జరుగుతుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో గోంగూర ముందు ఉంటుంది.

Whats_app_banner