గోంగూరతో చేసే వంటకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎప్పుడూ గోంగూర పచ్చడి, గోంగూర పులుసు వంటివే కాదు... ఒకసారి గోంగూర పలావు కూడా ట్రై చేసి చూడండి. గుంటూరు స్టైల్లో గోంగూర పలావ్ ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము. ఇలా చేయడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా గోంగూర పలావ్ చేసి పెడితే వారికి కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. గోంగూర పలావ్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
గోంగూర ఆకులు - 100 గ్రాములు
ఉల్లిపాయలు - మూడు
ఉప్పు - రుచికి సరిపడా
బిర్యాని ఆకులు - రెండు
అనాస పువ్వులు - రెండు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - ఐదు
యాలకులు - ఐదు
మరాఠీ మొగ్గ - ఒకటి
పత్తర్ కా ఫూల్ - చిన్నది
జీడిపప్పులు - 15
షాజీరా - ఒక స్పూను
కరివేపాకులు - గుప్పెడు
పచ్చిమిర్చి - ఐదు
పసుపు - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
టమాటోలు - రెండు
బియ్యం - రెండు కప్పులు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
పుదీనా తరుగు - గుప్పెడు
1. గోంగూర ఆకులను ఏరి కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. బాస్మతి బియ్యాన్ని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనెలో ఉల్లిపాయలను నిలువుగా సన్నగా తరిగి రంగు మారే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు మిగిలిన నూనెలో మరి కొంచెం నూనె వేసుకోవాలి.
6. అందులోనే బిర్యాని ఆకులు, అనాసపువ్వు, దాల్చిన చెక్క లవంగాలు, పత్తర్ కా ఫుల్, మరాఠీ మొగ్గ, యాలకులు వేసి వేయించుకోవాలి.
7. అవి మంచి వాసన వస్తున్నప్పుడు జీడిపప్పులను వేసి వేయించాలి.
8. ఇప్పుడు ఈ మిశ్రమంలో షాజీరా నిలువుగా కోసిన పచ్చిమిర్చి, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
9. ఇవి వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
10. ఇప్పుడు ఈ మిశ్రమంలో నిలువుగా తరిగిన టమాటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గనివ్వాలి.
11. టమాటాలు యాభై శాతం మగ్గితే అవి మెత్తగా అవుతాయి.
12. ఆ సమయంలోనే ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరను వేసి బాగా కలుపుకోవాలి.
13. పైన మూత పెట్టి గోంగూర మెత్తగా ఇగురులాగా ఉడికే వరకు ఉంచాలి.
14. ఆ తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.
15. ఇది ఉడకడానికి సరిపడా నీటిని వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
16. పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
17. ముందుగా వేయించి పెట్టుకున్న వేయించిన ఉల్లిపాయలను పైన చల్లుకోవాలి మూత పెట్టి అన్నం ఉడికే దాకా మీడియం మంట మీద ఉంచాలి. పావుగంటలో ఇది ఉడికిపోతుంది.
18. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే టేస్టీ గోంగూర పులావ్ రెడీ అయినట్టే.
గోంగూర పులావ్ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది స్పైసీగా కొంచెం పుల్లపుల్లగా అనిపిస్తుంది. నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలా గోంగూర పలావ్ చేసుకుంటే అదిరిపోతుంది. పైగా ఇది గుంటూరు స్టైల్లో చేసింది. కాబట్టి రుచి అద్భుతంగా ఉంటుంది. ఒకసారి వండి వడ్డించండి. ఇది కచ్చితంగా వారికి నచ్చుతుంది. మీకు ప్రశంసలు కూడా దక్కుతాయి.
సంబంధిత కథనం