How Many Steps A Day। రోజుకి కనీసం ఎన్ని అడుగులు నడవాలి? ఎలాంటి ప్రయోజనాలుంటాయి?
How Many Steps A Day: నడక ఆరోగ్యకరమే కానీ, రోజూ ఎంత దూరం నడవాలి? ఎన్ని అడుగులు నడిస్తే ప్రయోజనకరం? ఇక్కడ తెలుసుకోండి.
How Many Steps A Day: నడక ఆరోగ్యానికి మంచిది అని మనందరికీ తెలుసు, కానీ రోజూ ఎంత దూరం నడవాలి? ఎన్ని అడుగులు నడిస్తే ప్రయోజనకరం? ఈ ప్రశ్నకు కొంతమంది కనీసం 6,000 అడుగులు నడవాలని చెప్తారు, మరికొంత మంది రోజుకు 10,000 నడిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. ఇలా నడకకు వెళ్లే అడుగులకు సంబంధించి విభిన్న ప్రతిస్పందనలు వింటూ ఉంటాం. కానీ ఒక కొత్త అధ్యయనం ప్రకారం రోజుకు కేవలం 4,000 అడుగులు నడవడం వల్ల ఎలాంటి అనారోగ్య కారణం వల్లనైనా మరణించే ప్రమాదాన్ని చాలా తగ్గిస్తుంది, రోజుకు కనీసం 2,337 అడుగులు వేస్తే హృదయ సంబంధ వ్యాధులతో మరణించే ప్రమాదం తగ్గుతుంది. అయితే, మీరు ఎంత ఎక్కువ నడిస్తే అంత ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆ అధ్యయనం పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
పోలాండ్‌లోని మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ లాడ్జ్‌లోని పరిశోధకులు ప్రజలు ప్రతిరోజూ ఎన్ని అడుగులు నడిస్తే ఎలాంటి ఎంత ప్రయోజనం ఉంటుందనే దానిపై అధ్యయనం చేశారు.
రోజుకు కనీసం ఎన్ని అడుగులు నడవాలి?
రోజుకు కనీసం 1,000 అడుగులు నడిస్తే ఏదైనా అనారోగ్య కారణం వల్ల చనిపోయే ప్రమాదం 15 శాతం తగ్గుతుందని పరిశోధకులు నిర్ధారించారు, మరో 500 అడుగులు ఎక్కువ నడిస్తే హృదయ సంబంధ వ్యాధులతో మరణించడం 7 శాతం తగ్గుతుంది. అయితే కనీసం రోజుకు 5 వేల అడుగులైనా నడవాలి, 5,000 అడుగుల కంటే తక్కువ నడిస్తే అది కూడా 'నిష్క్రియాత్మక జీవనశైలి' గానే పరిగణించడం జరుగుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.
అధ్యయనం ప్రకారం, రోజుకు 7000 నుంచి 13,000 వరకు అడుగులు వేసే యుక్త వయస్కుల వారిలో ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు, ఒక రోజులో 6,000 నుంచి 10,000 నడవ గలిగితే వారు వ్యాధుల కారణంగా మరణించే అవకాశాలు 42 శాతం తగ్గుతుంది.
అయితే, రోజుకు ఇంతకంటే ఎక్కువ నడవడం వలన కూడా లభించే ప్రయోజనాలలో ఎలాంటి తేడా ఉండదని అధ్యయనం పేర్కొంది. రోజుకు 20,000 అడుగులు లేదా 14-16 కిలోమీటర్ల వరకు నడిచే వ్యక్తులు అథ్లెటిక్ ఫిట్‌నెస్‌ను పొందవచ్చునని ఫలితాలు చూపిస్తున్నాయి.
నడక ప్రయోజనాలు
ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, అలసటను తగ్గించడం, నిరాశను పోగొట్టడం, మానసిక స్థితిని మెరుగుపరచడం, కీళ్లపై ఒత్తిడిని తగ్గించడం, అర్థ్రరైటిస్ నొప్పిని తగ్గించడం, బరువు పెరగడాన్ని నివారించడం, క్యాన్సర్ వ్యాధి సహా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను నడక కలిగి ఉంది. కాబట్టి నడిస్తే పోయేదేం లేదు, మీ అనారోగ్యాలు తప్ప.
సంబంధిత కథనం