Tri Color Pulao । తిరంగా పులావుతో.. స్వాతంత్య్రపు రుచిని ఆస్వాదించండి!-give yourselves a treat with special tri color pulao on this independence day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Give Yourselves A Treat With Special Tri Color Pulao On This Independence Day

Tri Color Pulao । తిరంగా పులావుతో.. స్వాతంత్య్రపు రుచిని ఆస్వాదించండి!

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 02:13 PM IST

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశమంతటా జోరుగా సాగుతున్నాయి. కొంతమందికి ఈ వేడుకలను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. మీరు ప్రత్యేకంగా జరుపుకునేందుకు ట్రైకలర్ పులావ్ తో విందు చేసుకోండి. రెసిపీ ఇక్కడ ఉంది.

Tri Color pulao
Tri Color pulao

స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ స్వాతంత్య్రపు అమృత మహోత్సవాన మిఠాయిలు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రతి ఒక్కరి హృదయం దేశభక్తితో ఉప్పొంగుతోంది. దేశ పౌరులు జెండాలోని మూడు రంగులపై తమ ఇష్టాన్ని చూపిస్తూ తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.ఈ జాతీయ పండుగ రోజున విందు కూడా ప్రత్యేకంగా ఉంటే ఎలా ఉంటుంది? మీరు ఈరోజు ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకుంటే మూడు రంగులతో రుచికరమైన పులావ్ తయారు చేసుకోవచ్చు. దీనినే ట్రై కలర్ పులావ్ లేదా తిరంగా పులావ్ అని పిలుస్తారు. మరి మీకూ ఈ తిరంగా పులావ్ రుచిని ఆస్వాదించాలనుకుంటే ఇక్కడ రెసిపీని అందిస్తున్నాం. ప్రయత్నించి చూడండి.

ఈ తిరంగా పులావ్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు సహజంగా లభించే కూరగాయలు, ఆకుకూరలతోనే రెండు రంగులను తీసుకురావచ్చు. ఇక మరొకటి మామూలు అన్నం వండితే చాలు. ఈ మూడింటిని పేర్చి ముచ్చటగా, రుచికరంగా ట్రైకలర్ పులావ్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

ఆరెంజ్ రైస్ కోసం కావాల్సిన పదార్థాలు

  • 1 కప్పు బాస్మతి బియ్యం
  • 1/4 కప్పు టొమాటో ప్యూరీ
  • 1/4 టీస్పూన్ పసుపు పొడి
  • 1/2 స్పూన్ కారం
  • 1/2 ఎర్ర మిరపకాయ పేస్ట్
  • 2 టేబుల్ స్పూన్లు నెయ్యి
  • 1/4 టీస్పూన్ జీలకర్ర
  • 1 స్పూన్ అల్లం పేస్ట్
  • రుచికి తగినంత ఉప్పు

వైట్ రైస్ కోసం

1 కప్పు బాస్మతి బియ్యం (వండినది)

ఆకుపచ్చ రైస్ కోసం కావాల్సిన పదార్థాలు

  • 1 కప్పు బాస్మతి బియ్యం
  • 1/2 కప్పు పాలకూర ప్యూరీ
  • 2 టేబుల్ స్పూన్లు నెయ్యి
  • 1/4 టీస్పూన్ జీలకర్ర
  • 1 స్పూన్ అల్లం పేస్ట్
  • 1 స్పూన్ పచ్చి మిరపకాయ పేస్ట్
  • రుచికి తగినంత ఉప్పు

ట్రైకలర్ పులావ్ తయారు చేసే విధానం

  1. తిరంగా పులావ్‌ను తయారు చేయడం కోసం ముందుగా బాస్మతి బియ్యాన్ని తేలికగా ఉడికించుకోవాలి. ఇందులో రెండు పాళ్లను వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాళ్లను వైట్ రైస్ లాగా వండుకోవాలి.
  2. ఇప్పుడు రెండు వేర్వేరు నాన్‌స్టిక్‌ పాన్‌లలో 2 టేబుల్‌స్పూన్ల నెయ్యిని వేడి చేయండి. ఆపైన జీలకర్ర వేసి వేయించండి.
  3. ఇప్పుడు మొదటి పాన్‌లో అల్లం పేస్ట్, కారం, ఎర్ర మిరపకాయ పేస్ట్ వేయండి. టొమాటో ప్యూరీని, ఉప్పును కూడా వేసి బాగా కలపాలి. కప్పు నీళ్లు పోసి ముందుగానే తేలికగా ఉడికించిన బాస్మతి బియ్యం వేసి కుక్కర్లో ఉడకబెట్టండి.
  4. మరో కడాయిలో పైన పేర్కొన్న మాదిరిగానే అన్నం ఉడికించుకోవాలి. అయితే ఇందులో పాలకూర ప్యూరీని కలుపుకోవాలి.
  5. టొమాటో ప్యూరీ కలిపినది ఆరెంజ్ రంగులో అన్నం తయారవుతుంది, పాలకూర ప్యూరీ కలిపినది ఆకుపచ్చ రంగును పొందుతుంది. వైట్ రైస్ ఎలాగూ ఉంటుంది. ఈ మూడింటిని సర్వింగ్ ప్లేటులోకి మూడు రంగుల వరుస క్రమంలో పేర్చాలి.

అంతే స్పెషల్ తిరంగా పులావ్ సిద్ధమైనట్లే. వేడివేడిగా సర్వ్ చేసుకొని అస్వాదించండి.

WhatsApp channel