Ghee Mysore Pak: నెయ్యి మైసూర్ పాక్ ఇలా ఇంట్లోనే సులువుగా చేసేయండి
Ghee Mysore Pak: మైసూర్ పాక్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. దీన్ని కొనుక్కొని తినేవారే ఎక్కువ. నిజానికి నెయ్యి మైసూర్ పాక్‌ను ఇంట్లోనే చాలా సులువుగా చేసేయొచ్చు.
మైసూర్ పాక్ పేరు చెబితేనే తినాలన్న కోరిక పుడుతుంది. దీనికోసం స్వీట్ షాపులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. నెయ్యి, శెనగపిండి కొనుక్కుంటే చాలు... రుచికరమైన నెయ్యి మైసూర్ పాక్ సిద్ధమైపోతుంది. పైగా దీన్ని చేయడం చాలా సులువు. ఇంట్లో వేడుకలు, పండుగలు, పుట్టినరోజుల సమయంలో కొనాల్సిన అవసరం లేకుండా నెయ్యి మైసూర్ పాక్‌ను మీరే ఇంట్లోనే చేసేయండి. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
నెయ్యి మైసూర్ పాక్ రెసిపీకి కావలసిన పదార్థాలు
శెనగపిండి - ఒక కప్పు
నెయ్యి - ముప్పావు కప్పు
నీళ్లు - తగినన్ని
పంచదార - ఒక కప్పు
నెయ్యి మైసూర్ పాక్ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంటను పెట్టాలి.
2. అందులో శెనగపిండిని వేసి రెండు నిమిషాలు పాటు వేయించుకోవాలి.
3. ఆ శెనగపిండి జల్లించి ఉండలు లేకుండా పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు నెయ్యిని కరిగించి ఈ శెనగ పిండిలోనే ఆ నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి.
5. అరకప్పు నెయ్యిని వేసి కలిపితే ఈ శనగపిండిలో బాగా కలుస్తుంది.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పంచదార వేసి పావు కప్పు నీళ్లను వేయాలి.
7. పంచదార నీళ్లలో బాగా కరిగాక పక్కన పెట్టుకున్న శెనగపిండి, నెయ్యి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి.
8. దీన్ని చిన్న మంట మీదే ఉంచి ఉడికించాలి.
9. ఈ మొత్తం కాస్త దగ్గరగా చేరి గట్టిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.
10. ఇప్పుడు ఒక ప్లేటుకు అడుగున నెయ్యి రాసి ఈ మొత్తం మిశ్రమాన్ని సమానంగా పరచాలి.
11. అదే గట్టిపడే వరకు అలా వదిలేయాలి లేదా ఫ్రిజ్లో పెట్టుకున్నా మంచిదే.
12. గట్టిపడ్డాక దాన్ని ముక్కలుగా కోసుకోవాలి.
13. అంతే మైసూర్ పాక్ రెడీ అయినట్టే. దీన్ని తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది.
14. మైసూర్ పాక్ పై నెయ్యి ఎక్కువగా ఉపయోగించాం.
15. కాబట్టి నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఉంటుంది ఈ స్వీట్.
శెనగపిండితో చేసే మైసూర్ పాక్ ఆరోగ్యానికి కూడా మేలే చేస్తుంది. దీన్ని మనం నెయ్యి కూడా వేసి చేసాం కాబట్టి నెయ్యిలోని పోషకాలు కూడా శరీరంలో చేరుతాయి. ఒక్కసారి మీరు ఈ స్వీట్ చేసుకొని చూడండి. మీకు నోరూరిపోవడం ఖాయం. దీన్ని బయట దుకాణాల్లో కొనాలంటే ఎక్కువ రేటు ఉంటుంది. అదే ఇంట్లో అయితే చాలా సులువుగా కేవలం పావు గంటలో దీన్ని తయారు చేసుకోవచ్చు.