Wednesday Motivation: పట్టలేనంత కోపం వస్తోందా? శ్రీశ్రీ రవిశంకర్ కోపాన్ని నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు చెబుతున్నారు-getting too angry sri sri ravi shankar gives some tips to control anger ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation: పట్టలేనంత కోపం వస్తోందా? శ్రీశ్రీ రవిశంకర్ కోపాన్ని నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు చెబుతున్నారు

Wednesday Motivation: పట్టలేనంత కోపం వస్తోందా? శ్రీశ్రీ రవిశంకర్ కోపాన్ని నియంత్రించేందుకు కొన్ని చిట్కాలు చెబుతున్నారు

Haritha Chappa HT Telugu

Wednesday Motivation: పట్టరాని కోపం ఎన్నో అనర్ధాలకు కారణం అవుతుంది. అందుకే యాంగర్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యాంగర్ మేనేజ్‌మెంట్ అంటే కోపాన్ని అదుపులో ఉంచుకునే ఒక ప్రక్రియ.

మోటివేషనల్ స్టోరీ (Pixabay)

Wednesday Motivation: జీవితం ప్రశాంతంగా సాగాలన్నా, అనుబంధాలు చక్కగా ఉండాలన్నా కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. కోపం వల్ల స్నేహాలు దెబ్బతింటాయి. అనుబంధాలు విడిపోతాయి. జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. కాబట్టి కోపాన్ని అణిచివేయడం చాలా అవసరం. మీకు కోపం తెచ్చే విషయాలను ట్రిగ్గర్లు అంటారు. ఆ ట్రిగ్గర్లేమిటో తెలుసుకుంటే కోపాన్ని అదుపులో పెట్టుకోవడం సులువే. సమర్థవంతంగా యాంకర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో శ్రీశ్రీ రవిశంకర్ వివరిస్తున్నారు.

కోపాన్ని తగ్గించుకోవడం వల్ల భావోద్వేగపరంగా ఒత్తిడి తగ్గుతుంది. శారీరక ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కోపాన్ని తగ్గించుకునేందుకు ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు చేయడం చాలా అవసరం. అవి చేస్తున్నప్పుడు శ్వాస పైనే దృష్టి ఉంచాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపకుడు ఆధ్యాత్మికవేత్త, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఎలాంటి పద్ధతుల ద్వారా కోపాన్ని తగ్గించుకోవాలో ఇక్కడ చెబుతున్నారు.

కోపం ఎక్కువగా వస్తే చిరునవ్వు ఖరీదైనదిగా మారిపోతుంది. కాబట్టి కోపాన్నే వజ్రంలా అత్యంత ఖరీదైనదిగా మార్చండి. అప్పుడు చిరునవ్వు చాలా తక్కువ ధరకే లభిస్తుంది అంటారు శ్రీ శ్రీ రవి శంకర్. అంటే చిరునవ్వును చిందిస్తూ కోపాన్ని ఎంతగా అణచి పెడితే అంత మంచిదని ఆయన చెబుతున్నారు.

కోపం తెచ్చుకోకూడదని వంద సార్లు మీరు అనుకోవచ్చు. కానీ ఉద్వేగం, కోపం అనేది తుఫానులా వస్తాయి. వాటిని నియంత్రించుకోవడం చాలా కష్టమైపోతుంది. మీరు మార్చలేని విషయాల గురించి ఆలోచించడం మానేయండి. ఎప్పుడైతే ఆ విషయాన్ని విస్మరిస్తారో... కోపం కూడా రావడం మానేస్తుంది. కోపం అనేది అర్థరహితమైనదని వివరిస్తున్నారు రవిశంకర్.

మీ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే వారిని క్షమించడం నేర్చుకోండి. వారిని క్షమించకుండా మీరు కోపం పెంచుకుంటే అది మీకే శిక్షగా మారిపోతుంది. వారు మీ గుండెల్లో కక్షను రగిలిస్తారు. భోజనం చేస్తున్నా, నడుస్తున్నా, స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నా వారి తాలూకు గుర్తులే జ్ఞప్తికి వస్తాయి. ఇది కోపాన్ని మరింతగా రగిలిస్తాయి. ఎప్పుడైతే మీరు క్షమించడం నేర్చుకుంటారో మిమ్మల్ని మీరు రక్షించుకున్న వారు అవుతారు.

కోపం అనేది ఒక సాధనంలా, ఒక ఆయుధంలా వాడాలి. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తే అది అర్థరహితంగా మారిపోతుంది. కోపంగా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఆ మాటల వల్ల అతను సమాజంలో గుర్తింపును, విలువను కోల్పోతాడు. మీకు మరీ కోపం వస్తే కాసేపు బయటికి వెళ్లిపోండి. మనుషులకు దూరంగా పచ్చని ప్రకృతిలో కాసేపు కూర్చోండి. ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ కోపంలో మీరు అనర్థమైన చర్యలు పాల్పడకుండా జాగ్రత్త తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది.