Tattoo: టాటూలు వేయించుకుంటున్నారా? వద్దని చెబుతున్న కొత్త అధ్యయనం, టాటూల వల్ల వచ్చే ప్రమాదాలు ఇవే
Tattoo: టాటూలు వేయించుకోవడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. కానీ వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో చెడు జరుగుతుందని చెబుతోంది ఒక కొత్త అధ్యయనం.
Tattoo: వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు టాటూలు వేయించుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. చర్మం కాస్త తేటగా ఉంటే చాలు... అక్కడ ఏదో ఒక టాటూ వేయించుకోవాలన్న కోరిక పెరిగిపోతోంది. ఎక్కువ మంది చేతులపై, భుజాలపై టాటూలను వేయించుకుంటున్నారు. న్యూయార్క్‌లోని బింగ్‌హామ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వల్ల ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం కనిపిస్తుందో తెలుసుకునేందుకు అధ్యయనం నిర్వహించారు. అమెరికాలోని చలామణిలో ఉన్న తొమ్మిది టాటూ ఇంక్ బ్రాండ్లను విశ్లేషించారు. వాటిలో 45 రకాల సమ్మేళనాలు ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నట్టు తేలింది. ఆ 45 సమ్మేళనాల పేర్లను కూడా బహిర్గతం కానివ్వలేదు. ప్రజలు తమకు తెలియకుండానే టాటూలతో చర్మ సమస్యలను, ఆరోగ్య ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నట్టు అధ్యయనకర్తలు చెబుతున్నారు.
ఈ రసాయనాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చెబుతున్న ప్రకారం టాటూ ఇంకులో పాలిథిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉంటుంది. ఇది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అలాగే మరొక రసాయనం ఇందులో ఉంది. దాని పేరు 2-ఫినాక్సిథెనాల్ కొన్ని టాటూ ఇంకులలో ఈ ప్రమాదకరమైన పదార్థాన్ని గుర్తించారు. ఈ రసాయనం అధిక మోతాదులో చర్మంలోనికి ఇంకితే... చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మూత్రపిండాలు, నరాలకు కూడా హాని కలుగుతుంది.
టాటూల్లోని రసాయనాలు దీర్ఘకాలంలో ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తాయి. అవి చర్మం ద్వారా శరీరంలోకి ఇంకుతాయి. శరీరం నుంచి ఇతర అవయవాలకు కూడా చేరే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు టాటూలకు దూరంగా ఉండటమే మంచిది.
గతంలో కూడా టాటూలపై అనేక అధ్యయనాలు జరిగాయి. అందులో కూడా పరిశోధకులు ఇలాంటి అభిప్రాయాన్ని చెప్పారు. టాటూల వల్ల చర్మంలోని చెమట గ్రంథులకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. చెమట గ్రంథులు శరీరాన్ని చల్లబరచడం కోసం చెమటను ఉత్పత్తి చేసి బయటకి పంపిస్తాయి. దీనివల్ల మన శరీరంలో తగినంత ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. అయితే టాటూలు వేయించుకున్న చోట చెమట గ్రంథులు సరిగా పనిచేయవు. పచ్చబొట్టు ఉన్న ప్రాంతంలో ఒకలా, పచ్చబొట్టు లేని ప్రాంతంలో ఒకలా చెమట గ్రంధులు పనిచేస్తాయి.
పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే సూదులు సరైనవి కాకపోయినా, ఇతరులకు వేసినవి మీకు వాడినా... అనేక రకాల సమస్యలు రావచ్చు. అలాగే ధనుర్వాతాన్ని, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వ్యాధులకు కూడా గురయ్యే ప్రమాదం ఎక్కువ.
టాపిక్