Holi Colours Remove : బట్టలకు అంటుకున్న మెుండి రంగులను సులభంగా తొలగించండి ఇలా
Holi Colours Remove : హోలీ వేడుకల్లో బట్టలకు రంగులు అంటుకోవడం సహజం. ఈ మెుండి రంగులను వదిలించాలంటే చాలా కష్టం. కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా వదిలించుకోవచ్చు.
హోలీ రోజున ఉదయం నుంచి చిన్నాపెద్దా అందరూ రంగుల ఆటతో ఆనందిస్తారు. రంగులతో ఆడుతున్నప్పుడు చర్మం, జుట్టుతో పాటు బట్టలపై రంగు పడటం చాలా సాధారణం. రసాయనిక రంగుల బారిన పడకుండా చర్మాన్ని, వెంట్రుకలను కాపాడుకోవడానికి ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకుంటాం కానీ, బట్టలపై పెద్దగా శ్రద్ధ చూపం. చూపినా ప్రయోజనం ఉండదు. ఫలితంగా రంగులతో ఆడిన తర్వాత, మీరు బట్టల నుండి మరకలను తొలగించేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. మరకలు పోవు.. కాబట్టి మొత్తం దుస్తులు పడేయాల్సి వస్తుంది. అయితే మీ బట్టలపై ఉన్న రంగును సులభంగా తొలగించే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఆ పద్ధతులను పరిశీలించండి.
గోరువెచ్చని నీటితో క్లోరిన్ కాని బ్లీచ్ కలపండి. మీ దుస్తులను అందులో నానబెట్టండి. ఇతర బట్టలపై రంగు రాకుండా విడిగా బట్టలు ఉతకాలి. హోలీ రోజు రంగు పడిన దుస్తులను ఇతర దుస్తులతో కలిపితే వాటికి కూడా రంగు అంటుకునే అవకాశం ఉంది. అందుకే వాటిని విడిగా ఉతుక్కోవాలి.
2-3 లీటర్ల చల్లటి నీటిలో అర కప్పు వైట్ వెనిగర్, 2-3 టీస్పూన్ల ఏదైనా డిటర్జెంట్ కలపండి. రంగు వేసిన బట్టలను అందులో కాసేపు నానబెట్టి, తర్వాత నీళ్లలో ఉతకాలి. ఇలా చేస్తే రంగులు తొలగించుకునేందుకు అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా రంగులను తొలగించుకోవచ్చు.
గ్లాస్ విండో క్లీనింగ్ స్ప్రేలు సాధారణంగా అమ్మోనియా ఆధారితవి. మీరు ఈ స్ప్రేతో బట్టలపై ఉన్న రంగు మరకలను తొలగించవచ్చు. మరకపై స్ప్రే చేసి, కాసేపు అలాగే ఉంచండి. తర్వాత శుభ్రమైన గుడ్డతో మరకను తుడిచి శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
వెనిగర్ లేకపోతే మీరు నిమ్మకాయను ఉపయోగించవచ్చు. నిమ్మరసం ఎలాంటి మచ్చలనైనా తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలోని ఆమ్ల స్వభావం మొండి మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. బట్టలను నిమ్మరసంలో 15 నిమిషాలు నానబెట్టి, ఆపై సున్నితంగా రుద్దండి, కడగాలి. దీనితో రంగు పోతుంది.
జుట్టు నుంచి హోలీ రంగులు తొలగించే చిట్కాలు
జుట్టు నుండి రంగును తొలగించడానికి వేడి నీటిని ఉపయోగించవద్దు. వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టుకు చాలా నష్టం జరుగుతుంది. వేడి నీటిని ఉపయోగించడం వల్ల జుట్టు పొడిగా, గరుకుగా మారుతుంది. మీ జుట్టును కడిగిన తర్వాత హెయిర్ డ్రైయర్‌ని ఉపయోగించవద్దు, బదులుగా జుట్టును సహజంగా ఆరనివ్వండి.
హోలీ ఆడిన తర్వాత శెనగపిండి, పెరుగు కలిపి హెయిర్ ప్యాక్ సిద్ధం చేయండి. ఈ ప్యాక్‌ని మీ జుట్టుపై కనీసం 30 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత షాంపూ వాడితే హోలీ రంగు తల, జుట్టు నుంచి పోతుంది.
హోలీ రంగు వల్ల జుట్టు దెబ్బతినకుండా ఉండేందుకు మీరు కలబంద సహాయం తీసుకోవచ్చు. కలబందను జుట్టుకు పట్టించాలి. కలబందలో విటమిన్ ఎ, బి12, సి మరియు ఇ ఉన్నాయి. ఇది జుట్టును రసాయన రంగుల నుండి కాపాడుతుంది. జుట్టు గరుకుగా, పొడిగా మారకుండా చేస్తుంది.
హెయిర్ ప్యాక్ తర్వాత మీ తలను శుభ్రమైన నీటితో కడగాలి. ఇప్పుడు గుడ్డులోని పచ్చసొనను జుట్టుకు పట్టించాలి. మీరు అందులో రెండు చుక్కల వెనిగర్ లేదా నిమ్మరసం కూడా కలపవచ్చు. గుడ్డు పచ్చసొనలో బయోటిన్, బి12 ఉంటాయి. ఇవి జుట్టుకు అత్యంత అవసరమైన పోషకాలు.