తలనొప్పి అనేది ప్రతి వ్యక్తి తలలో తరచుగా వచ్చే ఒక కోరుకొని అతిథి. అధిక ఒత్తిడి, ఆందోళన, కొన్నిసార్లు ఆరోగ్య కారణాల వలన తలనొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. తలనొప్పి వేధిస్తున్నప్పుడు ఏ పని చేయాలనిపించదు. పనిలో ఉన్నప్పుడు తలనొప్పి కలిగితే ఆ వ్యక్తి ఆందోళన, అశాంతితో ఉంటాడు. చాలా మంది తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి, వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకోవడమే పరిష్కారంగా భావిస్తారు. అయితే చాలామందికి తెలియనిది ఏమిటంటే పెయిన్‌కిల్లర్స్ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఆందిస్తాయి. మరోవైపు పెయిన్‌కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది మీ గుండె, మెదడు రెండింటిపై చెడు ప్రభావాలను కలిగి ఉంటుంది. కాబట్టి తలనొప్పి కలిగినపుడు వెంటనే మాత్రల జోలికి వెళ్లకుండా సహజమార్గాల ద్వారానే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
తలకు నూనె పట్టించడం, మసాజ్ చేయడం ద్వారా కూడా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని మనకు తెలుసు. అయితే ఈ మసాజ్ థెరపీలలో జపనీస్ షియాట్సు థెరపీ మరింత ప్రభావవంతమైనది. ఈ థెరపీ ఎలా చేస్తారు, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
షియాట్సు థెరపీ అనేది తల, స్కాల్ప్ , మెడకు చేసే మసాజ్. ఇది జపనీస్ ఆక్యుప్రెషర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది నొప్పుల నుంచి లోతుగా ఉపశమనం కలిగించే అద్భుతమైన చికిత్స.
ఇది ఒక రకమైన ఫింగర్ మసాజ్ థెరపీ. నొప్పి తలకే అయినా ఈ థెరపీలో చేతి వేళ్లు, తల, మెడ, భుజాలు, చేతులపై ఆక్యుప్రెషర్ పాయింట్లలో నొక్కడం చేస్తారు. ఇందులో భాగంగా వేళ్లను సాగదీయడం, వాటిని నొక్కడం, కొన్ని పాయింట్లను నొక్కడం వంటివి ఉంటాయి.తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి జపాన్‌లో ఎక్కువగా షియాట్సు థెరపీపైనే ఆధారపడతారు. ఈ షియాట్సు మసాజ్ ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇది ఎవరికి వారు కూడా చేసుకోగలిగే సెల్ఫ్ మసాజ్ థెరపీ.
మీకు విపరీతమైన తలనొప్పి ఉంటే, ఉపశమనం పొందడానికి మీ చేతుల రెండు వేళ్లను ఉపయోగించి మీ నుదిటిపై వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల సిరల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, సిరల ఉద్రిక్తతను తగ్గిస్తుంది, ఇది నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది.
అలాగే మీ కనుబొమ్మల మధ్య ఖాళీని మీ వేళ్ళతో మసాజ్ చేయండి. జపనీస్ షియాట్సు థెరపీ ప్రకారం, ఈ ప్రదేశం నుండి శరీరంలో ముఖ్యమైన శక్తి ప్రవహిస్తుంది. అందుకే ఈ పాయింట్‌ని ఒక నిమిషం పాటు నొక్కితే, అది యాక్టివేట్ అవుతుంది. మీరు నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.
సంబంధిత కథనం