DIY Curd Facial । పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే పెరుగుతో ఫేషియల్ చేసుకోండిలా!
DIY Curd Facial: ప్రతీసారి పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, పెరుగుతో మీ ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూడండి.
DIY Curd Facial: మీ చర్మ సంరక్షణ కోసం, ముఖాన్ని అందంగా ఉంచుకోవడం కోసం కనీసం నెలకు ఒకసారైనా ఫేషియల్ చేసుకోవాలి. ఇందుకోసం మీరు ప్రతీసారి పార్లర్‌కి వెళ్లి ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, మీకు మీరుగా ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చు. సహజసిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే (Homemade) ఫేషియల్ చేసుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీకు వంట ఇంట్లో అందుబాటులో ఉండే అనేక పదార్థాలు మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోడానికి ఉపయోగించవచ్చు. ఇందులో భాగంగా మీరు పెరుగును ఉపయోగించి ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చు. పార్లర్‌కు వెళ్లి ఫేషియల్ చేసుకున్నంత మెరుపును పొందవచ్చు.
పెరుగుతో మరికొన్ని పదార్థాలను కలిపితే అద్భుతమైన ఫేషియల్ సిద్ధం అవుతుంది. పెరుగుతో సులభమైన దశలతో మీ ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూడండి.
క్లెన్సింగ్
ముఖానికి సంబంధించిన మొదటి దశ శుభ్రపరచడం. దీనికి కావలసింది పెరుగు మాత్రమే. మీ చేతులకు కొద్దిగా పెరుగును అప్లై చేయండి, ఆపై దానిని మీ చర్మానికి అప్లై చేసి వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. బాగా మసాజ్ చేసిన తర్వాత కాటన్ తో శుభ్రం చేసుకోవాలి.
స్క్రబ్బింగ్
కొరియన్ చర్మ సంరక్షణలో బియ్యం పిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. వారి సౌందర్య ఉత్పత్తులలో బియ్యం కూడా ఒక భాగమే. పెరుగు ఫేషియల్‌లో స్క్రబ్బింగ్ కోసం పెరుగుతో బియ్యం పిండిని కలపండి. ఈ పేస్ట్‌తో మీ ముఖంపై సున్నితంగా స్క్రబ్ చేయండి. మృతకణాలు, బ్లాక్ హెడ్స్ ఏమైనా ఉంటే తొలగిపోతాయి.
మసాజ్
ఫేషియల్ లో మసాజ్ చాలా ముఖ్యం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని కోసం మీరు పెరుగులో ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె కలపాలి. దానితో మీ ముఖాన్ని మసాజ్ చేయండి. ఈ సమయంలో మీరు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలి.
ఫేస్ ప్యాక్
ఫేషియల్ చివరి దశ ఫేస్ ప్యాక్ వేసుకోవడం, ఇది చాలా ముఖ్యమైనది. ఇది చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి, రంధ్రాలను మూసివేయడానికి సహాయపడుతుంది. పెరుగుతో ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా పెరుగులో కొద్దిగా కాఫీపొడిని కలపండి. ఆపైన ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. కాసేపయ్యాక నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
ఇంతే, చూశారుగా ఫేషియల్ చేసుకోవడం ఎంత సింపుల్. మీరు ఎప్పుడైనా వేడుకలలో పాల్గొనేందుకు వెళ్తున్నప్పుడు ఇలా త్వరగా ఫేషియల్ చేసుకొని వెళ్తే, అందరి మధ్యన మీరు తళుక్కున మెరిస్తారు.
సంబంధిత కథనం