Facial at Home: పార్లర్‌లాంటి ఫేషియల్ ను ఇంటి దగ్గరే ఇలా చేసుకోండి, మీ చర్మానికి అద్భుతమైన మెరుపు-get a parlor like facial at home and leave your skin glowing ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Facial At Home: పార్లర్‌లాంటి ఫేషియల్ ను ఇంటి దగ్గరే ఇలా చేసుకోండి, మీ చర్మానికి అద్భుతమైన మెరుపు

Facial at Home: పార్లర్‌లాంటి ఫేషియల్ ను ఇంటి దగ్గరే ఇలా చేసుకోండి, మీ చర్మానికి అద్భుతమైన మెరుపు

Haritha Chappa HT Telugu
Jul 25, 2024 05:58 PM IST

Facial at Home: ముఖంపై మరకలు, నల్లటి మచ్చలు తొలగిపోయి ప్రకాశవంతమైన చర్మం కావాలంటే ఇంట్లోనే హోమ్ మేడ్ ఉత్పత్తులతో ప్రయత్నించవచ్చు. వారానికి రెండు మూడుసార్లు వాడటం వల్ల చర్మానికి కోరుకున్న మెరుపు వస్తుంది.

బ్యూటీ టిప్స్
బ్యూటీ టిప్స్ (shutterstock)

చర్మానికి మెరుపు కోసం తరచూ బ్యూటీ పార్లర్‌కు వెళుతూ ఉంటారు. పార్లర్ కు వెళితే అయ్యే ఖర్చు కూడా ఎక్కువే. కొంతమంది అంత సమయం, బడ్జెట్ కూడా ఉండదు. అలాంటి వారు ఇంట్లోనే కొన్ని పద్ధతుల్లో ముఖానికి మెరుపు తీసుకురావచ్చు. ఇంట్లో దొరికే వస్తువులతోనే మూడు దశల్లో ఫేషియల్స్ చేసుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.

శ్రావణ మాసం ప్రారంభమవ్వబోతోంది. త్వరలో పూజలు, వ్రతాలు చేయాల్సి ఉంటుంది. ఎంతో మంది ఇంటికి వచ్చిపోతుంటారు. శ్రావణమాసంలో ముఖానికి మెరుపు తెచ్చుకుంటే మంచిది. ముఖానికి సహజమైన గ్లో కోసం ఇంట్లోనే టోనర్లు, ఫేస్ మాస్క్ లు, సీరమ్స్ తయారు చేసుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే ఇది మెరుపును తెస్తుంది.

ఇలా చేయండి

బియ్యాన్ని బాగా కడిగి రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఉదయాన్నే వడగట్టి తీసేయాలి. ఇప్పుడు ఆ బియ్యం నీటిలో ఒక టీస్పూన్ అలోవెరా జెల్ మిక్స్ చేయాలి. ఇది టోనర్‌లా ఉపయోగించుకోవచ్చు. దీనిలో దూది ముంచి ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. రోజూ ఈ టోనర్ సహాయంతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం మీద ఉండే మరకలు, కణాలు తొలగిపోతాయి. ముఖంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.

ఫేస్ మాస్క్ తయారీ

ఇంట్లోని వస్తువులతోనే ఫేస్ మాస్క్ ను తయారుచేసి వారానికి కనీసం రెండుసార్లు అప్లై చేయడం వల్ల ముఖానికి కాంతివంతంగా మారుతుంది. ఫేస్ మాస్క్ తయారు చేయాలంటే కేవలం మూడు వస్తువులు అవసరం అవుతాయి. బియ్యం పిండి, తేనె , పాలు, ఈ మూడింటిని మిక్స్ చేసి ఫేస్ మాస్క్ తయారు చేసి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను అప్లై చేయడం వల్ల ముఖంపై మెరుపు పెరుగుతుంది. వారంలో మూడు సార్లు ఫేస్ మాస్క్ వేసుకుంటే మంచిది.

ఫేస్ సీరమ్ తయారీ

ఇంట్లోనే ఫేస్ సీరమ్ తయారు చేసుకుని రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయాలి. ఇది ముఖ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. నల్ల మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఈ ఫేస్ సీరమ్ తయారు చేయడానికి కావాల్సిన ఉత్పత్తులు రెండు టీస్పూన్ల బియ్యం నీరు, ఒక క్యాప్సూల్ విటమిన్ ఇ, రెండు టీస్పూన్ల కలబంద జెల్, ఒక టీస్పూన్ గ్లిజరిన్. ఇవన్నీ కలిపి ఒక సీసాలో వేయాలి. దీన్ని అప్లై చేయడం వల్ల మొటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. చర్మం కాంతివిహీనంగా ఉండే సమస్య తొలగిపోతుంది.

సీరమ్, టోనర్, ఫేస్ మాస్క్ వంటివి బయట మార్కెట్లో కొంటే ఎన్నో డబ్బులు ఖర్చయిపోతాయి. అదే ఇంట్లోనే వీటిని తయారు చేసుకుంటే చాలా తక్కువ మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. తక్కువ డబ్బుతోనే చర్మానికి సహజమైన మెరుపును తెచ్చుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి.

Whats_app_banner