Plants in summer: వేసవిలో మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి!
How To Take Care Of Plants In Summer:వేసవిలో ఎండిపోతున్న మొక్కలను కాపాడుకోవడానికి ఏమేం చేయాలి? వాటికి ఏ సమయంలో నీరు పోయాలి? ఎలాంటి జాగ్రత్తుల తీసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం రండి.
మొక్కలంటే మీకు చాలా ఇష్టమైతే. మీ ఇంట్లో మీరు ఎన్నో రకాల మొక్కలను పెంచుతుంటే వేసవిలో మీ బాధేంటో మేం అర్థం చేసుకోగలం. వేసవిలో మొక్కలను కాపాడటం చాలా కష్టమని మాకు తెలుసు. ఎందుకంటే ఎండలు పెరుగుతున్నాయి. తీవ్రమైన వేడి, ఎండ, వేడిగా గాలలుతో మనకే ఇన్ని ఇబ్బందులుంటే, మొక్కల సంగతి ఏంటి? ఇవి వాటిని ఎంతగా ప్రభావితం చేస్తాయో! నిజానికి ఎండాకాలం మొక్కలకు సవాలుగా ఉండే కాలం. తీవ్రమైన సూర్యకాంతి వల్ల ఎండిపోవడం, వాడిపోవడం, ఆకులు రాలిపోవడం జరుగుతుంది. కొన్ని సార్లు ప్రాణాలను కోల్పోతుంటాయి. ఇలా జరగుండా ఉండటం కోసం వేసవిలో మొక్కల విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, చిట్కాలను మీకోసం మేం తీసుకొచ్చాం. అవేంటో తెలుసుకోండి. మీకు ఇష్టమైన మొక్కలను జాగ్రత్తగా చూసుకోండి.
వేసవిని తట్టుకునే మొక్కలు
వేసవిలో మీరు చేయగలిగే చక్కటి సులభమైన పద్ధతి ఏమిటంటే తీవ్రమైన వేడిని తట్టుకుని పెరిగే మొక్కలను పెంచడం. మీ బాల్కనీ తోటలో లేదా మీ గార్డెన్లో అలాంటి మొక్కలనే పెంచే ప్రయత్నం చేయండి. పామ్ చెట్టు, మల్లెపూలు, కలబంద వంటి మొక్కలను తీవ్రమైన సూర్యకాంతిలో పెంచవచ్చు. ఇవి సంవత్సరం పొడవునా ఆకుపచ్చగా ఉంటాయి.
వేసవికి ముందే మట్టి మార్చాలి
మొక్క ఆరోగ్యాన్ని కాపాడే మరో చిట్కా ఏమిటంటే, వేసవి మొదలు కాకముందే మొక్కను వేరే మట్టిలో నాటాలి. మంచి తాజా మట్టితో పాటు కొత్త ఎరువులతో పెద్ద మట్టి పాత్రలోకి మొక్కలను మార్చండి. దీనివల్ల మొక్క బాగా పెరగుతుంది.
నీరు పోయడం..
వేసవి వచ్చిందంటే మొక్కలకు నీరు పోయడం విషయంలో చాలా మందికి చాలా సందేహాలుంటాయి. నీరు రోజూ పోయాలా? ఎన్ని సార్లు పోయాలి? ఎప్పుడు ఎప్పుడు పోయాలి అని. అన్నింటికీ ఒకే సమాధానం మట్టి ఎండిపోకుండా ఉంచడమే. అంటే వేసవిలో మొక్కలు ఎండిపోవడానికి ప్రధాన కారణం మట్టి త్వరగా ఎండిపోవడమే. కాబట్టి మీ మొక్కలకు మట్టి ఎండిపోయిన వెంటనే నీరు పోయడం అలవాటు చేసుకోండి. అయితే అధికంగా నీరు పోస్తే వేర్లు కుళ్ళిపోతాయని గుర్తుంచుకోండి.
నీడ పడేలా చూడండి..
తీవ్రమైన సూర్యకాంతి మొక్కల మీద నేరుగా పడకుండా చూసుకోండి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి 3 గంటల వరకు నేరుగా పడితే మొక్కలు ఎండిపోతాయి. కాబట్టి ఈ సమయంలో మొక్కలను లోపలికి తీసుకురావాలి లేదా నీడ పడేలా ఒక గుడ్డను వేసి కప్పి ఉంచాలి.
అధిక ఎరువులు
ఎరువులు ఏవైనా సరే వేసవి కాలంలో మొక్కలకు అధికంగా వేయకూడదు. ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్కపై అధిక ఒత్తిడి పడుతుంది. తీవ్రమైన వేడిలో మొక్క పెరగడానికి బాగా కష్టపడుతుంది. ఎరువుల ఒత్తిడి మొక్కకు అదనపు సమస్య అవుతుంది.
గాలి తాకనివ్వండి
కఠినమైన వేసవిలో, సాయంత్రం గాలి చల్లగా ఉంటుంది. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మొక్కపై కప్పి ఉంచిన గుడ్డను తీసివేయడం మర్చిపోకండి. మొక్కల ఆరోగ్యానికి తాజా గాలి చాలా అసవరం.
ఆకులకు కూడా నీరు
మనం ఎక్కువగా మట్టిలో అంటే చెట్టు మొదట్లోనే నీరు పోస్తాం. కానీ వేసవి కాలంలో ఆకులకు కూడా నీరు పోయాలి. మీరు రోజూ నీరు పోసేటప్పుడు ఆకులపై కొన్ని చుక్కలు చల్లుతూ ఉండండి. కాండాలకు రోజుకు రెండుసార్లు నీరు పోయాలి.
శాఖలను తొలగించడం
మొక్క చక్కగా ఎదగాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా పసుపు రంగులోకి మారిన ఆకులను, ఎండిపోయిన ఆకులను తొలగించడం మంచిది. ఎందుకంటే అవి మొక్క శక్తిని పీల్చుకుంటాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్