Ganesh Chaturthi 2024: వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7 నా? పూజ చేయడానికి శుభ సమయం వివరాలివే
Ganesh Chaturthi 2024: వినాయక చవితి వచ్చేసింది. ఈ పండగ సెప్టెంబర్ 6నా లేదా 7వ తేదీనా అనే సందేహం ఉంది. ఈ విషయంలో స్పష్టతతో పాటూ, పండగ ముహూర్తం సమయం కూడా తెల్సుకోండి.
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇది జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టాన్ని ప్రసాదించే గణేశుడి జన్మదిన వేడుక. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో ఆగస్టు లేదా సెప్టెంబరులో గణేశ్ చతుర్థి జరుపుకుంటారు. ఈ పవిత్ర పండుగ సరైన తేదీ, విగ్రహం స్థాపన చేయడానికి శుభ ముహూర్తం వివరాలు తెలుసుకోండి.
గణేష్ చతుర్థి 2024 ఎప్పుడు? సెప్టెంబర్ 6 లేదా 7నా?
ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7న ఉంటుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చతుర్థి తిథి సెప్టెంబర్ 6న ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుండటంతో ఏ తేదీని పరిగణనలోకి తీసుకోవాలనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. అయితే దృక్ పంచాంగం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వినాయక చవితి జరుపుకోనున్నారు.
గణేష్ చతుర్థి 2024: శుభ ముహూర్తం
గణేష్ చతుర్థి శుభ ముహూర్తం, పూజా సమయాలను తెల్సుకోండి.
గణేశ్ పూజ ముహూర్తం - సెప్టెంబర్ 7న ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు,
చతుర్థి తిథి ప్రారంభం - సెప్టెంబర్ 6, 2024న మధ్యాహ్నం 3:01 గంటలకు
చతుర్థి తిథి ముగింపు - సెప్టెంబర్ 7, 2024 సాయంత్రం 5:37
వినాయకుని విగ్రహ స్థాపన సమయం - సెప్టెంబర్ 7, ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు
బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:31 నుంచి 5:16 వరకు
గణేష్ నిమర్జనం మంగళవారం, సెప్టెంబర్ 17
చంద్రుడు:
దృక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3:01 గంటల నుండి రాత్రి 8:16 గంటల వరకు, సెప్టెంబర్ 7 న ఉదయం 9:30 నుండి రాత్రి 8:45 గంటల వరకు చంద్రుడిని చూడకూడదు. వినాయక చవితి రోజున చంద్రుణ్ని చూడకూడదని చెబుతారు.
గణేష్ చతుర్థి వేడుకలు:
గణేష్ చతుర్థి వేడుకలు 10 రోజులు జరుగుతాయి. ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నా కూడా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో.. ముఖ్యంగా ముంబై, పూణే, హైదరాబాద్ వంటి నగరాలలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి.
పండుగ సమయంలో భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి స్థాపన చేసి, స్వామిని ప్రార్థించి, పూజాది కార్యక్రమాలు నిర్వహించి, భోగం సమర్పించి, ఉపవాసం ఆచరిస్తారు. ఆచారాల ప్రకారం, ప్రజలు గణపతిని ఒకటిన్నర రోజులు, మూడు రోజులు, ఏడు రోజులు లేదా పది రోజులు తమ ఇళ్లలో ఉంచుతారు. గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది. ఈ రోజున భక్తులు వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. వచ్చే సంవత్సరం తొందరగా వచ్చేయ్ అంటూ ప్రార్థిస్తూ ఈ వేడుకలు ముగుస్తాయి.
టాపిక్