Telugu News  /  Lifestyle  /  Gandhi Jayanti 2022 Mahatma's Ideas And Philosophies Help You To Live Your Life Like A Legend
Gandhi Jayanti 2022
Gandhi Jayanti 2022

Gandhi Jayanti 2022 । మహాత్మ గాంధీ ఆదర్శాలు అనుసరిస్తే.. మీరే మహోన్నత శక్తులు!

02 October 2022, 9:47 ISTHT Telugu Desk
02 October 2022, 9:47 IST

Gandhi Jayanti 2022: నేడు జాతిపిత మహాత్మ గాంధీ జయంతి. బాపు ఆలోచనలు, ఆదర్శాలు ప్రపంచానికే దిక్సూచి. ఆయన జీవితమే ఒక పాఠం. గాంధీజీ చూపిన బాటలో నడిస్తే వ్యక్తిగతంగానూ అది మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలుపుతుంది. అవేంటో చూడండి.

ఈరోజు అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ఈ ప్రత్యేకమైన రోజును ఎందుకు నిర్వహిస్తారో మనకు తెలిసిందే. ఎందుకంటే ఈరోజు మన జాతిపిత మహాత్మాగాంధీ జయంతి (Gandhi Jayanti) . ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. గాంధీజీని మనం ముద్దుగా గాంధీ తాతా, బాపు అని పిలుచుకుంటాం.

ట్రెండింగ్ వార్తలు

నెత్తుటి చుక్క రాల్చనీయకుండా శాంతి మార్గంలో స్వాతాంత్య్రోద్యమాన్ని ముందుకు నడిపారు, సహనంతోనే బ్రిటీష్ సంకెళ్లు తెంచి భారత జాతికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించారు, సకల జనుల హృదయాల్లో మహాత్ముడయ్యారు. అహింసాతో మహాత్ముడు చూపిన దారి మనకు, మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శం.

గాంధీజీ జీవితం అంతా ఒక పాఠం వంటిది. ఆయన ఆదర్శాలలో కొన్నింటిని పాటించినా అవి వ్యక్తులకు మైరుగైన జీవనశైలిని, బంగారు భవిష్యత్తును అందించడంలో తోడ్పడతాయి. బాపు నేర్పిన విలువలు పాటిస్తే ఏ వ్యక్తినైనా అవి మహోన్నత స్థానంలో నిలుపుతాయి.

మహాత్మా గాంధీ జీవితం నుండి నేర్చుకోవలసిన పాఠాలు

మహాత్మా గాంధీ ఆలోచనలు, ఆయన రాసిన పుస్తకాలు ప్రజల జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. ఈ గాంధీ జయంతి సందర్భంగా మహత్ముడి నుంచి నేటి బాలలు, యువత నేర్చుకోవలసిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

Mahatma Gandhi's ideas, philosophies:

అహింస:

అహింస పరమో ధర్మాన్ని ఆదర్శంగా తీసుకున్న గాంధీజీ, హింస దేనికీ సమాధానం కాదన్నారు. కానీ నేటి పిల్లలకు చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. అటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు తమ పిల్లలకి వివరించాలి, మీకు పాఠశాల లేదా ఇంటి దగ్గర స్నేహితుడితో వివాదం ఉంటే, గాంధీజీ వలె అహింసతో దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే శాంతి సామరస్యం నెలకొంటుంది.

ఏదీ కష్టం కాదు:

ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే, ఎట్టి పరిస్థితులలో అతడు తన గమ్యాన్ని చేరుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. వ్యక్తి యొక్క పట్టుదల, ధైర్యమే అతనికి ప్రతి కష్టాన్ని పోరాడే శక్తిని ఇస్తుంది. గాంధీజీ సాగించిన అనేక ఉద్యమాలలో కూడా ఈ వైఖరి కనిపిస్తుంది.

సత్యం:

అబద్ధాలు, మోసాలకు దూరంగా ఉండటం మంచిది. బాపు ఎప్పుడూ సత్యాన్నే నమ్మేవారు. అబద్ధంతో మసిపూసి మోసం చేయడం ఆయనకు నచ్చేది కాదు. ఎంత కష్టమైనా నిజం చెప్పడానికే ధైర్యం చూపేవారు. నేటికాలంలో అవసరం ఉన్నా, లేకపోయినా అబద్ధాలు చెబుతారు. అబద్ధాల మీదే కాలం వెల్లదీస్తున్నారు. ఏ నాటికైనా నిజమే గెలుస్తుందని గ్రహించాలి. నిజం మాట్లాడటానికి సిద్ధంగా ఉండటం ద్వారా, నిజమైన సంబంధాలు ఏర్పడతాయి.

సాదాసీదా జీవనం:

ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వారు ఆడంభరాలకు పోరు. సాదాసీదా జీవనం గడుపుతారు. మహాత్మా గాంధీ చాలా సాదాసీదా స్వభావం కలిగిన వ్యక్తి. వారు తమ వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందారు, దానిలోనే ఆనందం కనుగొన్నారు. ఇది కూడా మహత్ముడి నుంచి నేర్చుకోవలసిన అంశం. సాదాసీదా జీవితంలోనే ఆనందం ఉందని గ్రహించాలి.

సమానత్వం:

గాంధీజీ ఎవరినీ కులం, మతం ప్రకారం చూడలేదు. ఆయనకు ప్రతి వ్యక్తి సమానమే. ఇలా సమానత్వం చూపినపుడే సమాజంలో ప్రేమ వెల్లివెరుస్తుంది. కానీ నేటి సమాజంలో ఇది కరువైంది. అందుకే ఎక్కడ చూసినా అశాంతి, ధ్వేషం రాజ్యమేలుతోంది. మతం చూడని, కులం చూడని సమసమాజ స్థాపన జరిగినపుడే అభివృద్ధి సాధ్యపడుతుంది. ఐకమత్యం వర్ధిల్లుతుంది. ఇది గాంధీ నుంచి కచ్చితంగా నేర్చుకోవాల్సిన ఆదర్శం.