Anxiety: యాంగ్జైటీకి లోనైతే కనిపించే శారీరక సమస్యలు ఇవే
యాంగ్జైటీకి లోనైనప్పుడు కండరాల నొప్పి నుంచి నిద్ర లేమి వరకు అనేక శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
రోజువారీ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఉన్న భయాందోళనలు యాంగ్జైటీకి దారితీస్తాయి. ఇది శరీరంలో అనేక మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆయాసం, చెమట కనిపిస్తుంది. శరీరంలో ఇంకా చాలా మార్పులు కనిపిస్తాయి. థెరపిస్ట్ అన్నా పపైన్నౌ దీని గురించి తన ఇన్‌స్టా పోస్టులో చర్చించారు. ‘తల నుంచి పాదాల వరకు, శరీరంలోని ప్రతి వ్యవస్థ యాంగ్జైటీ వల్ల ప్రభావం చెందుతుంది. యాంగ్జైటీ వల్ల శారీరక మార్పులకు కారణం శరీరం స్పందించే తీరే. రాబోయే ప్రమాదం నుంచి కాపాడుకునేందుకు శరీరం సంసిద్ధం అయ్యేందుకు శరీరం ఇలా స్పందిస్తుంది..’ అని వివరించారు.

జీర్ణ సమస్యలు: యాంగ్జైటీకి లోనైనప్పుడు మీ డైట్‌లో, జీవనశైలిలో మార్పులు సంభవిస్తాయి. ఇది మీ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. శరీరం స్పందించే తీరు జీర్ణక్రియను దెబ్బతీయడం వల్ల మలబద్ధకం లేదా డయేరియా, ఇతర జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి.
నిద్ర, ఏకాగ్రత సమస్యలు: స్ట్రెస్ హార్మోన్ల విడుదల ఎక్కువై మీ నిద్రకు భంగం కలుగుతుంది. ఈ కారణంగా అలసట ఏర్పడుతుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది.
తల, ముఖంలో టెన్షన్: స్ట్రెస్ హార్మోన్లు పెరిగిపోవడం, భంగిమలో మార్పుల వల్ల మీ దవడ బిగుసుకుపోవడం, దంతాలు రాసుకోవడం ప్రారంభమవుతుంది.
గుండె వేగం పెరగడం: శరీరంలోని భారీ కండర సమూహాలకు రక్త ప్రసరణ చేసేందుకు గుండె ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ కారణంగా గుండె వేగం పెరుగుతుంది.
కండరాల్లో ఒత్తిడి, నొప్పి: యాంగ్జైటీ ఉన్న వారిలో కండరాలు ఎక్కువసేపు బిగుసుకుపోతాయి. ఇది ఒత్తిడిని, నొప్పిని కలిగిస్తుంది. బలహీనంగా తయారు చేస్తుంది.
‘మీరు యాంగ్జైటీకి లోనవుతున్నట్టు గ్రహించకపోయినప్పటికీ శారీరక లక్షణాలను మీరు గుర్తించవచ్చు..’ అని థెరపిస్ట్ అన్నా వివరించారు. లోతైన శ్వాస తీసుకోవడం, కండరాల ఉపశమన టెక్నిక్స్ ఆచరించడం వల్ల యాంగ్జైటీ నుంచి కోలుకోవచ్చు. తద్వారా శారీరకంగా సమస్యలు తగ్గుతాయి. దీంతో రోజువారీ పనుల్లో నిమగ్నం కావొచ్చు..’ అని వివరించారు.