Walking Tips । బరువు తగ్గేందుకు నడక మంచిదే, కానీ ఇలా నడిస్తే!-from increasing pace to inclining here are some walking tips to lose weight easily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walking Tips । బరువు తగ్గేందుకు నడక మంచిదే, కానీ ఇలా నడిస్తే!

Walking Tips । బరువు తగ్గేందుకు నడక మంచిదే, కానీ ఇలా నడిస్తే!

HT Telugu Desk HT Telugu
Mar 08, 2023 08:55 AM IST

Walking Tips To Lose Weight: ప్రతిరోజూ ఒక గంట పాటు నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. అయితే మీ నడకలో కొన్ని మార్పులు చేసుకుంటే మరింత కొవ్వును కరిగించవచ్చు. అది ఎలాగో ఇక్కాడ చూడండి.

Walking Tips To Lose Weight
Walking Tips To Lose Weight (Unsplash)

Walking: నిశ్చల జీవనశైలి బరువు పెరగడానికి, ఇతర అనేకమైన అనారోగ్య సమస్యలకు కారణమని మనందరికీ తెలుసు. వ్యాయామం చేయాలని ఉన్నప్పటికీ, విరామంలేని బిజీ షెడ్యూల్‌లు లేదా సుదీర్ఘమైన ఆఫీసు వేళల కారణంగా, మనలో చాలామంది వ్యాయామం కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. అయితే మీరు వ్యాయామం కోసం ప్రత్యేకంగా జిమ్‌లో చేరటం, తీవ్రమైన వర్కౌట్లు చేసే అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే అనేక సాధారణ కార్యకలాపాలు కూడా బోలెడు ఉన్నాయి. అందులో నడక ఒకటి, చాలా మంది నడక ఒక వ్యాయామం కాదు అనుకుంటారు. కానీ, కొవ్వును కరిగించడానికి నడక చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. నడక కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తుంది, రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది, రక్తపోటును నియంతిస్తుంది, తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

Walking Tips To Lose Weight- నడకతో బరువు తగ్గేందుకు చిట్కాలు

ప్రతిరోజూ ఒక గంట పాటు నడవడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి, మీ శరీర బరువు కొన్ని కిలోలు తగ్గుతుంది. మీరు బరువు తగ్గేందుకు నడకను మీ వ్యాయామంగా ఎంచుకుంటే కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా నడిచేటప్పుడు మరింత కొవ్వును కరిగించవచ్చు. తద్వారా కొన్ని రోజుల్లోనే మీరు అధిక బరువును తగ్గించుకోవడంతో పాటు ఊబకాయం నివారించవచ్చు, గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నడిచేటపుడు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోండి.

మీ వేగాన్ని పెంచండి

మీ నడక వేగాన్ని పెంచడం వల్ల మీ వ్యాయామానికి గొప్ప మార్పు వస్తుంది. తీరికగా నడుస్తున్నప్పుడు కంటే వేగంగా నడిచేటప్పుడు మీరు ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం, చురుకైన నడక కలిగిన వారు ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తారు. పరిగెత్తే వారి కంటే కూడా నడకకు వెళ్లే వారిలోనే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. నడక లేదా పరుగు ఏదైనా మంచిదే, అయితే నడక అందరికీ అనుకూలమైన వ్యాయామం.

ఎత్తుపైకి నడవడం

మీరు ట్రెడ్‌మిల్‌పై నడిచినా లేదా ఏదైనా చదునైన ఉపరితలంపై నడుస్తున్నా, క్రమం తప్పకుండా ఎత్తుపైకి నడవడం వల్ల అదనపు కొవ్వు కరిగిపోతుంది. ఎత్తుకు నడవడానికి ఎక్కువ శ్రమ అవసరం, ఇది అదనపు కేలరీలను కోల్పోయేలా చేస్తుంది. మీ ట్రెడ్‌మిల్‌పై నడుస్తుంటే అందులో ఇన్‌క్లైన్ వాకింగ్ సెట్ చేసుకోండి.

పవర్ వాక్

పవర్ వాక్ అనేది మీరు క్రమం తప్పకుండా అనుసరించగల అధిక-తీవ్రత కలిగిన నడక. మొదటగా సుమారు 5-10 నిమిషాలు శక్తివంతమైన నడకతో ప్రారంభించండి. ఆపై మీ నడక వేగాన్ని 15-20 సెకన్ల పాటు పెంచండి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, శక్తివంతంగా నడవండి, ఇంకా వేగంగా నడవండి కానీ పరుగెత్తకండి. ఒక అర నిమిషం పాటు ఇలా నడిచిన తర్వాత మీ సాధారణ వేగానికి తిరిగి వెళ్లండి. మధ్యమధ్యలో దీన్ని పునరావృతం చేస్తూ ఉండండి.

విరామంలో తరచుగా చిన్న నడక

చాలా దూరం నడవడం, మీ లక్ష్యాలను చేరుకోవడం మంచిదే . కానీ, బరువు తగ్గాలనుకున్నప్పుడు తరచుగా విరామం సమయంలో తక్కువ దూరాలకు చిన్న నడక కూడా చేయండి. భోజనం చేసిన తర్వాత మీరు నడవవచ్చు. ఏదైనా కొనుగోలు చేయడానికి నడవచ్చు. మీరు రోజూ గంట పాటు నడిచే నడకను రోజంతా మూడు లేదా నాలుగు చిన్న నడకలుగా కూడా విభజించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ వ్యవధిలో మితమైన నడక కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటును అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సమానంగా సహాయపడుతుంది.

అడుగులు పెంచండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ 10,000 అడుగులు నడవడం బరువు తగ్గడానికి అనువైనది. మీరు దీన్ని మించి స్టెప్ కౌంట్‌ను పెంచగలిగితే, అది ఎక్కువ కేలరీలు, బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే, మీ శక్తి స్థాయిలను కూడా దృష్టిలో ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ స్టెప్ కౌంట్‌ని పెంచడం మీరు అలసిపోయేలా, ఆయాస పడేలా నడవడం మంచిది కాదు.

ఇక్కడ పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకోండి, నడక ప్రారంభించండి, మీ బరువు తగ్గేంతవరకు నడవండి, నడుస్తూ ఉండండి.

WhatsApp channel

సంబంధిత కథనం