Eyes and Health: డయాబెటిస్ నుంచి క్యాన్సర్ వరకు ఏ వ్యాధి ఉన్నా మీ కళ్లల్లో కనిపించే లక్షణాలు ఇవే
Eyes and Health: మీ కళ్ళు డయాబెటిస్, అధిక రక్తపోటు, క్యాన్సర్… ఇలా కొన్ని వ్యాధులకు సంబంధించిన ప్రారంభ లక్షణాలను చూపిస్తాయి. ఆ లక్షణాలేంటో తెలుసుకుంటే ముందుగానే వైద్యులకు సంప్రదించి తగిన చికిత్స తీసుకోవచ్చు.
.డయాబెటిస్ 2030 నాటికి జనాభాలో దాదాపు ఎనిమిది శాతం మందిని ప్రభావితం చేస్తుందని ఒక అంచనా. అందుకే డయాబెటిస్ వచ్చిందో రాలేదో తెలుసుకునేందుకు 30 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ ఏడాదికి కనీసం మూడు సార్లయినా పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. డయాబెటిస్ ప్రారంభమైన 6 నుండి 13 సంవత్సరాల తర్వాతే ఎక్కువగా నిర్ధారణ అవుతుంది. దీని వల్ల పరిస్థితి ముదిరిపోతూ ఉంటుంది. అయితే డయాబెటిస్ నుంచి క్యాన్సర్ వరకు కొన్ని వ్యాధులును కళ్లల్లో కనిపించే లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్ వల్ల కంటి చూపు ప్రభావితం అవుతుంది. రంగులు చూసేందుకు మీ కళ్లు ఇబ్బంది పడుతున్నా, చూపు అప్పుడప్పుడు మసకబారుతూ ఉన్నా తేలికగా తీసుకోకండి.
గుండె వ్యాధిని చెప్పేస్తాయి
మీ కళ్లు డయాబెటిస్ మాత్రమే కాదు అధిక రక్తపోటు ఉన్నా, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోయినా కూడా చెప్పేస్తాయి. కళ్లల్లో రక్తానాళాలు క్లియర్ గా బయటికి కనిపిస్తుంటే తేలికగా తీసుకోకండి. కంటిలోని రక్త నాళాలు ఎర్రగా కనిపించడం అనేది గుండె ఆరోగ్యం ప్రమాదంలో ఉందని చెబుతున్నట్టే.
అధిక రక్తపోటు ఉంటే
అధిక రక్తపోటును "సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారు. ఇది ఎప్పుడు శరీరంలో మొదలవుతుందో చెప్పడం కష్టమే. కంటిలోని రక్తనాళాలు సంకోచించడం వంటి పరిస్థితికి అధికరక్తపోటు తీసుకువస్తుంది. రెటీనా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. చూపులో ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే అధికరక్తపోటు ఉందేమో చెక్ చేయండి. అదేవిధంగా, అధిక కొలెస్ట్రాల్ ఉన్నా కూడా కళ్ళ చుట్టూ కార్నియా పసుపు రంగు పాచెస్ (క్సాంథెలాస్మా) కనిపిస్తాయి. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటే ఈ సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు.
గ్లాకోమా
గ్లాకోమా… ఇదొక నిశ్శబ్ద ఆప్టిక్ నరాల వ్యాధి. ఇది కంటిపై అధిక ఒత్తిడి వల్ల సంభవిస్తుంది. ఇది క్రమంగా నరాలను దెబ్బతీసి, దృష్టి నష్టానికి కారణమవుతుంది. గ్లాకోమా వ్యాధి రావడానికి తక్కువ రక్తపోటు ఉండడం, స్లీప్ అప్నియా వంటి వ్యాధులు కూడా కారణం కావచ్చు.
క్యాన్సర్ ను ఎలా గుర్తించవచ్చు?
క్యాన్సర్ ఉన్న వారిలో రెటినోబ్లాస్టోమా వంటి కళ్ళ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఊపిరితిత్తులు, కాలేయం వంటి ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. అనేక రకాల క్యాన్సర్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అసాధారణ కంటి కదలికలు, చదువుతుంటే ఇబ్బందిగా అనిపించడం, డబుల్ విజన్, కళ్లు తరచూ ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కంటి ఆరోగ్యం ఎన్నో వ్యాధులను సూచిస్తుంది.