Friday Motivation: మీ దగ్గర ఈ మూడు లక్షణాలు ఉంటే విజయం తప్పక దక్కి తీరుతుంది
Friday Motivation: విజయం ఎవరిని పడితే వారిని వరించదు, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్న వారి వెంటే విజయం కూడా నడుస్తుంది. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకోండి.
Friday Motivation: దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక... ఈ మూడు ఎక్కడ ఉంటాయో విజయం అక్కడ తప్పక దక్కి తీరుతుంది. ఏదైనా సాధించాలన్న సంకల్పం ఒక మనిషిలో నరనరాన జీర్ణించు పోవాలి. తాను అనుకున్నది సాధిస్తానన్నా నమ్మకం తనపై తనకు ఉండాలి, ఆ విజయాన్ని సాధించాలన్న కోరిక మనసులో నాటుకుపోవాలి. అప్పుడే అనుకున్న దాన్ని అందుకోవడం సులభం అవుతుంది.
చాలామంది ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకోరు. ఒకవేళ లక్ష్యం ఉన్నా తాము ఆ పని చేయలేమంటూ నీరసించిపోతారు. దానిని సాధించాలన్న కోరిక వారికి మనసు నిండుగా ఉండదు. అలాంటివారు విజయాన్ని చేరుకోవడం చాలా కష్టం. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడానికి ప్రయాణాన్ని ఆరంభించాలి. జీవితంలో సాధ్యం కానీ ప్రయాణం అంటే అప్పటివరకు ప్రారంభించనిదే.
లక్ష్యాన్ని చేరుకోవడంలో చిన్న కష్టం ఎదురైనా ఎంతోమంది అక్కడే ఆగిపోతారు. కష్టాలు... మీ శత్రువులు కాదు, మీ బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో తెలియజేసే నిజమైన మిత్రులు. ప్రతి కష్టంలోను మీ బలాన్ని గుర్తించండి. అలాగే మీ బలహీనతలను ఎలా దాటాలో తెలుసుకోండి. ప్రతి దాని గురించి అతిగా ఆలోచించడం మానేయండి. విజయం సాధించాలంటే అతి ఆలోచనలను దూరం పెట్టాలి.
విజయం కోసం ఓర్పు అవసరం
చేసిన ప్రతి పనిలోను సత్ఫలితాలు రాకపోవచ్చు. కానీ ఏ పని చేయకపోతే అసలు ఏ ఫలితమూ రాదని గుర్తుపెట్టుకోండి. విజయం కోసం ఓర్పుగా ఉండాలి. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో... దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీపిగా ఉంటుంది. ఆ తీయదనం మీకు కావాలంటే ఓర్పుగా విజయం కోసం పనిచేయాలి.
పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు మీ మాటను, చేతను అదుపులోనే పెట్టుకోండి. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో ఉండవు, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని ఆధీనంలోనే కచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీ ప్రవర్తనకు మీరే చివరికి బాధ్యులు అవుతారు.
గెలవడం నేర్చుకోండి
విజయాన్ని అందుకునే ప్రయాణంలో తొలి పరాజయం రాగానే చేసే పనిని వదిలి పారిపోవద్దు. ఆ పనిని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేయమని ఆ ఓటమి మీకు నేర్పుతోంది. ఓడిపోతే గెలవడం నేర్చుకోండి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. గెలుపును ఎలా సాధించాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే ఎక్కువ విజయాలను సాధిస్తాడు.
మీకంటూ సమయం
ప్రతిరోజు మీకోసం ఒక సమయాన్ని కేటాయించుకోండి. రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. మీకు ఏం కావాలో గుర్తు తెచ్చుకోండి. మీ ఆరోగ్యం ఎలా ఉందో అంచనా వేసుకోండి. మీరు ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతారు. మీరు బలవంతులం అనుకుంటే మీరు బలంగానే ముందడుగు వేస్తారు. అదే నేను ఏమీ చేయలేనని బలహీనుడినని అనుకుంటే... మీరు బలహీనుల జాబితాలోనే మొదటి స్థానంలో ఉంటారు. మీరు బలవంతులో, బలహీనులు మీరే నిర్ణయించుకోండి. యుద్ధం చేయాలనుకుంటే అరచేయే కూడా ఆయుధంలా మారుతుంది... అదే వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి మీ సంకల్ప బలాన్ని గట్టిగా మార్చుకోవాలి.