Friday motivation: ఏ కష్టం చెప్పిరాదు.. వచ్చినపుడు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండు..
Friday motivation: కష్టాల కొలిమిలో కూరుకుపోయాక బాధ పడటం కన్నా కష్టాలను ఎదుర్కోడానికి మనల్ని మనం ముందుగానే సిద్ధం చేసుకుంటే ధైర్యంగా ఉండగలం.
వేటగాడు బాణాన్ని, ఉద్యోగి నెలజీతాన్ని, పేదవాడు ఆరోగ్యం కోసం కాస్త డబ్బుని ఎప్పుడూ సిద్దంగా ఉంచుకోవాలి. జంతువొచ్చినపుడు బాణం తీసి వేసే లోపు వేటగాడి మీద దాడి చేసేస్తుంది జంతువు. ఉద్యోగం ఉన్నపుడే డబ్బు దాచుకోకపోతే ఉన్నపలంగా ఏదైనా అయితే కష్టాల పాలవుతాడు ఉద్యోగి. దొరికిందంతా దాచుకోకుండా ఒకేపూట ఖర్చు పెట్టేస్తే అనారోగ్యం పాలయితే ఇబ్బంది పడతాడు పేదవాడు.
అదే బాణం గురిపెట్టి సిద్దంగా ఉన్న వేటగాడు పెద్దపులిని కూడా చంపగలడు. నెలకు సరిపడా జీతం ఉంచుకుంటే ధైర్యంతో ఇంకో ఉద్యోగం కోసం వెతుక్కోగలడు. చిన్న ఖర్చులకు సరిపోయే డబ్బుంటే ఉంటే నిశ్చింతగా నిద్రపోగలడు పేదవాడు.
జీవితంలో ఏ కష్టం చెప్పిరాదు. కానీ మనం ఎదుర్కోలేని కష్టం ఏంటో గుర్తించాలి. ఏకష్టం మనకు రాదులే అని నిశ్చింత, ధీమా ఉంటే సరిపోదు. వచ్చినా ఎదర్కునే ఏర్పాటు చేసుకోవాలి. అయితేనే సుఖంగా ఉండగలం. అలాగని కష్టాలు తప్పకుండా వస్తాయని కాదు. వచ్చినపుడు ఎదుర్కొనే సత్తా ఉండాలి. కనీసం నీ చేతులో ఉన్న వాటికి ముందే సన్నద్దంగా ఉండాలి. డబ్బు, బంధాలు, ఉద్యోగం, వ్యాపార నష్టాల వల్ల వచ్చే కష్టాలు ముందే ఊహించొచ్చు.
ఒక రోజు ఒక అడవిపంది తన దంతాలను అంటే తన కోర పన్నులను చెట్టుకి గీకుతూ పదును పెడుతోంది.
అదే సమయంలో అటుగా వెళ్తున్న నక్క చూసి అడవిపందిని ఆటపట్టిద్దాం అనుకుంది. ఎవరో శత్రువులు వస్తున్నట్టు బిక్కుబిక్కుమని దాక్కుంటూ నటించసాగింది.
దాని నటనను లెక్క చేయకుండా అడవిపంది దాని పని అది చేసుకుంటోంది. ఇక నక్క ఆత్రం పట్టలేక ఏంటీ శత్రువులెవరైనా వస్తారనిపిస్తుందా? సిద్దం అవుతున్నావంది.
ఎవరో దాడి చేశాక దంతాలు పదును పెట్టుకుని ఏం లాభం. నా పదునైన దంతాలు చూసి శత్రువు అసలు నా దగ్గరికే రాకుండా ఉంటారు. అనుకోకుండా వచ్చినా ఎదుర్కోవడానికి నేనెప్పుడూ సిద్దంగా ఉండాలి. నీలా బిక్కుబిక్కుమని దాక్కోను అంటుంది.
మనం ఆపద వచ్చాక ఆలోచిస్తే సరైన నిర్ణయాలు తీసుకోలేం. మన బలహీనత, మన అసంసిద్ధతే కష్టాన్ని పెద్దది చేస్తుంది.