Friday Feelings । మీరు మీలా ఉండండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఎవరితోనో మీకేంటి!-friday feelings be you and love yourself people may bark you need to care ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Friday Feelings Be You And Love Yourself People May Bark, You Need To Care

Friday Feelings । మీరు మీలా ఉండండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఎవరితోనో మీకేంటి!

HT Telugu Desk HT Telugu
Mar 17, 2023 05:05 AM IST

Friday Feelings: ప్రేమ అనేది ఒకరు ఇస్తేనే తీసుకునేది కాదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీపై మీరు ప్రేమను కురిపించుకొని చూడండి. మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా జీవించండి.

Friday Feelings
Friday Feelings (Unsplash)

Friday Feelings: ఒకరిని ప్రేమించడం గొప్ప అనుభూతి, ఒకరి చేత ప్రేమించబడటం అదృష్టం, కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంతకంటే గొప్ప వరం. ఈరోజుల్లో మీ నుంచి మీ ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించని నిస్వార్థమైన ప్రేమను ఎవరు ఇవ్వగలరు? కల్మషం లేని మనుషులను కనుగొనడం సాధ్యమేనా? కొన్ని సందర్భాలలో మిమ్మల్ని కన్నవారు సైతం మీపై కర్కషంగా వ్యవహరించవచ్చు, మీ పరిస్థితులను అర్థం చేసుకోకపోవచ్చు. మిమ్మల్ని ఎవరూ ప్రేమించడం లేదు, మీ గురించి ఎవరూ ఆలోచించడం లేదు అని చింతించడం ఎందుకు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎవరి దయాదాక్షిణ్యాలు మీకు అవసరం లేదు. మీ జీవితంలో ఎవరిని ప్రేమించినా, ప్రేమించకపోయినా, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా ముఖ్యం. ఇది మిమ్మల్ని మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.

కొన్నిసార్లు మనిషిలో కొంత స్వార్థం కూడా ఉండాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకునే విషయంలో, మీ కోసం మీరు తీసుకునే చర్యల విషయంలో ఎవరి ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. మీపై స్వార్థపరులు అని ముద్రవేసినా, మీ స్వంత ప్రయోజనాలే మీరు చూసుకుంటారని నిందలు వేసినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీసారి మీరు మంచివాళ్లు అని రుజువు చేసుకోవాల్సిన పనిలేదు. మీరేంటో మీకు తెలుసు, మీ మంచితనం ఏంటో మీకు తెలుసు. మీరు మీలా ఉండండి చాలు.

జీవితంలో మీ ప్రేమాభిమానాలు, మీ సహాయ సహకారాలు పొందినవారు ఎందరో ఉంటారు. కానీ జనాలు వాటిని గుర్తించే స్థితిలో ఉండరు. మీ గుణగణాల గురించి వారికి పూర్తిగా తెలియదు. మీరు ఎంత చేసినా, ఎన్ని చేసినా వారు తమ సొంత అభిప్రాయాన్నే కలిగి ఉంటారు.

మీరు కూడా జీవితంలో తప్పులు చేసి ఉండవచ్చు, నిజంగా మీరు మంచివారు కాదని మీకే ఒక్కోసారి అనుమానం కలగవచ్చు. కానీ తప్పులు చేయని వారు ఎవరు? నీతి వాక్యాలు చెప్పే వారే ఆ నీతులను అనుసరించరు. తప్పులు చేయని వారంటూ ఉండరు. మీది ఎంత పెద్ద తప్పిదమైనా సరే.. మీరు చేసిన తప్పుకి నూటికి నూరు శాతం మీరు మాత్రమే బాధ్యులు కాదు. అందుకు ఎన్నో అంశాలు మిమ్మల్ని ఆ పరిస్థితుల్లోకి నెట్టివేసి ఉండవచ్చు. మీరు చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఇది మిమ్మల్ని మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది.

మీరు చాలా అద్భుతమైన వ్యక్తి, మీ మనసు చాలా గొప్పది. దానిని గుర్తించే లక్షణం ఎదుటివారికి ఉండకపోవచ్చు, మీలాంటి మంచి మనసు అందరికీ ఉండకపోవచ్చు. మీకేం తక్కువ? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి మీరు అన్ని విధాల అర్హులు. కాబట్టి మీతో మీరే ప్రేమలో పడండి, జీవితాన్ని ఆస్వాదించండి.

WhatsApp channel