మహిళలూ.. మీ ఎనర్జీని మేల్కొలపడంతో పాటు ప్రశాంతమైన జీవితం కావాలంటే దేవీ ఆసనం ట్రై చేయాల్సిందే!-for women who want both strength and stillness try this devi asana ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మహిళలూ.. మీ ఎనర్జీని మేల్కొలపడంతో పాటు ప్రశాంతమైన జీవితం కావాలంటే దేవీ ఆసనం ట్రై చేయాల్సిందే!

మహిళలూ.. మీ ఎనర్జీని మేల్కొలపడంతో పాటు ప్రశాంతమైన జీవితం కావాలంటే దేవీ ఆసనం ట్రై చేయాల్సిందే!

Ramya Sri Marka HT Telugu

మహిళలూ.. మీలోని అంతర్గత శక్తిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తున్నారా? మీ శరీరానికి దృఢత్వాన్ని, మనస్సుకు ప్రశాంతతను అందించే ఒక యోగాసనం కోసం చూస్తున్నారా? స్త్రీ శక్తిని ప్రతిబింబించే ఒక ప్రత్యేకమైన భంగిమ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ దేవీ ఆసనం మీ కోసమే!

దేవీ ఆసనం ఎలా వేయాలంటే..

దేవీ ఆసనం గురించి చెప్పాలంటే, ఇది యోగాలోనే ఒక అందమైన, శక్తివంతమైన ఆసనం. ఈ ఆసనం స్త్రీ శక్తిని సూచిస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలో శక్తి పెరగడంతో పాటు ప్రత్యేకించి మహిళలకు ఎన్నో లాభాలు అందుతాయి. ఇదొక శక్తివంతమైన యోగాసనంగా చెబుతుంటారు.

దేవీ ఆసనం ఎలా వేయాలి?

  1. తాడాసనంలో ప్రారంభించాలి. దాని కోసం నిటారుగా నిలబడండి.
  2. మీ పాదాలను కొద్దిగా దూరంగా ఉంచి, చేతులు మీ శరీరానికి ఇరువైపులా ఉంచుకోండి.
  3. ఊపిరి పీల్చుకుంటూ, మీ పాదాలను బయటి వైపుకు 45 నుండి 60 డిగ్రీల వరకు తిప్పండి.
  4. ఈ భంగిమలో నిల్చొన్నప్పుడు మీ మడమలు ఒకే వరుసలో ఉండాలి.
  5. ఊపిరి వదులుతూ, నిదానంగా మీ తొడలను నేలకు సమాంతరంగా వంచుతూ ఉండండి..
  6. ఇది చేస్తున్నంతసేపు మీ వెన్నెముక నిటారుగా ఉండాలి.
  7. ఈ భంగిమలో మీ టెయిల్ బోన్‌ను కొద్దిగా లోపలికి మడవండి.
  8. మీ చేతులను భుజాల వరకూ పైకి ఎత్తండి.
  9. మీ మోచేతులను వంచి, మీ అరచేతులను ముందుకు తిప్పండి. మీ వేళ్లు పైకి చూస్తూ ఉండాలి. ఇది "దేవీ ముద్ర" అని కూడా అంటారు.
  10. మీరు మీ చేతులను నమస్కార ముద్రలో ఛాతీ ముందు కూడా ఉంచవచ్చు.
  11. ఈ ఆసనం వేసేంతసేపు వెన్నెముక మాత్రమే కాకుండా మీ దృష్టి కూడా స్ట్రైట్‌గా ఉండాలి.

ఆసనంలో ఎంతసేపుండాలి:

ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండండి. మీ శరీరం మొత్తం బిగుసుకున్నట్లుగా ఉండాలి, కానీ మీ భుజాలు, మెడ రిలాక్స్ గా ఉండాలి. మీ శ్వాసను సాధారణంగా తీసుకుని వదులుతూ ఉండండి. ఊపిరి పీల్చుకుంటూ, నెమ్మదిగా మీ కాళ్లను నిటారుగా చేసి, మీ చేతులను క్రిందికి దించండి. మళ్లీ తాడాసన స్థితికి రండి.

దేవీ ఆసనం వల్ల నేరుగా కలిగే ఉపయోగాలు:

  • తొడలు, పిరుదులు, కండరాలు బలపడతాయి.
  • తుంటి ప్రాంతాన్ని బలపరుస్తుంది.
  • ఉదర అవయవాలను ఉత్తేజపరుస్తుంది.
  • శరీరాన్ని శక్తివంతం చేస్తుంది.
  • స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.
  • మనస్సును శాంతపరిచి, ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

దేవీఆసనం వల్ల ఏం లబ్ది చేకూరుతుందంటే;

ఈ ఆసనం వేయడం వల్ల తొడలు, పిరుదులు, నడుం భాగం, జననాంగానికి ఇరువైపులా ఉండే కండరాలపై ప్రభావం కనపడుతుంది. ఇది స్థిరత్వాన్ని మెరుగుపరిచి, వెన్నులో శక్తిని వృద్ధి చేస్తుంది. ప్రత్యేకించి మహిళల్లో నెలసరి సమయంలోనూ, ప్రెగ్నెన్సీకి సిద్ధమవుతున్న సమయంలోనూ, మెనోపాజ్ టైంలోనూ ఆరోగ్యకరంగా ఉంటాయి. మహిళల్లో శక్తిని పెంచడమే కాదు, అంతర్గతంగా కాన్ఫిడెన్స్‌ను మెరుగుపరుస్తుంది. శరీరంలో అంతర్లీనంగా ఉన్న శక్తిని మేల్కొలిపి, భావోద్వేగాలపై స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. అంతేకాకుండా కాన్ఫిడెన్స్ మెరుగుపరిచి ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపిస్తుంది. ఇదొక శక్తివంతమైన భంగిమ.

పొట్ట భాగంలోని కండరాలపై పని చేయడంతో పాటు పెల్విక్ ప్రాంతంలోకి రక్త సరఫరా మెరుగుపరుస్తుంది. దీని వల్ల నెలసరి రెగ్యూలర్‌గా కావడంతో పాటు పీరియడ్స్ సమయంలో కలిగే అసౌకర్యాన్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా అరుగుదలకు తోడ్పడుతుంది. తొడల్లోని భాగం సాగదీసినట్లుగా నిల్చోవడం వల్ల, నడుంతో పాటు కాలిపిక్కల వరకూ చర్మం బిగుతుగా మారి శరీరాన్ని చలాకీగా ఉంచుతుంది. ప్రత్యేకించి ఈ భంగిమ ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికి బాగా హెల్ప్ ఫుల్‌గా ఉంటుంది.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.