Memory Loss at young Age: ఈ ఆహారాలు తింటే.. మతిమరుపు మరింత పెరగొచ్చు..
Memory Loss in young Age: తక్కువ వయస్సులోనే మతిమరుపు సమస్య ఇబ్బంది పెడుతుందా? అయితే మీరు దూరంగా ఉండాల్సిన ఆహారాలివే..
పర్సు మర్చిపోతుంటారు. బైక్ కీస్ మర్చిపోతుంటారు. సెల్ ఫోన్ మరిచిపోతుంటారు. ఇలా బయటకు వెళ్లేప్పుడు రెండు మూడు సార్లు మళ్లీ ఇంట్లోకి రావడం, చాలా ముఖ్యమైన రోజుల్ని, సమయాన్ని కూడా గుర్తుంచుకోలేకపోవడం.. ఇలాంటివన్నీ మరీ ఎక్కువగా అనిపిస్తే మతిమరుపు సమస్య గురించి ఆలోచించాల్సిందే. ఇదివరకు వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ అల్జీమర్స్ లక్షణాలు ఇప్పుడు చిన్న వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 65 మిలియన్ల మంది ప్రజలు మతిమరుపుతో బాధపడతారని అంచనా. అందుకు కారణం మనం రోజూ తినే ఆహారాలేనని ఓ సర్వే చెబుతోంది. దాదాపుగా 18వేల మందిపై చేసిన ఓ సర్వేలో చిన్న వయసులోనే మతిమరుపు వచ్చిన వారి ఆహారపు అలవాట్లను పరిశీలించారు. వారు ఏమేం ఆహార పదార్థాలను తింటున్నారన్నది చూసి ఆ ప్రకారం ఓ లిస్ట్‌ని విడుదల చేశారు. దాని ప్రకారం ఏమేం తింటున్నవారిపై అల్జీమర్స్ ఎక్కువ ప్రభావం చూపుతోందో తెలుసుకోండి.
ట్రెండింగ్ వార్తలు
ఎర్రటి మాంసం :
రోజు వారీ ఆహారంలో ఎక్కువగా రెడ్‌మీట్, ప్రోసెస్డ్ మీట్ తీసుకునే వారిలో ఈ లక్షణాలు కనిపించాయి. మాంసం, పాల ఉత్పత్తులు లాంటి వాటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ మెదడు పని తీరును మందగించేలా చేస్తుంది.
కూల్ డ్రింకులు :
పంచదార ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్‌లు, ఎనర్జీ డ్రింకులు, పళ్ల రసాలు ఎక్కువగా తాగేవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. మధుమేహం లేకపోయినప్పటికీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల మతిమరుపు పెరుగుతుంది. ఇందులో ఉండే చక్కెర మెదడు పని తీరుపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. జ్ఞాపక శక్తి తగ్గడం, దేన్నీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, నేర్చుకోలేకపోవడం లాంటి లక్షణాలు వస్తున్నాయి. చక్కెరలో ఎక్కువగా ఉండే ఫ్రక్టోజ్ వల్ల ఇదే కాకుండా ఊబకాయం, హైబీపీ, డయాబెటీస్, జీవ క్రియ సరిగ్గా లేకపోవడం లాంటివీ సంభవిస్తాయి.
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్‌లు :
తెల్లగా పాలిష్ పట్టిన బియ్యం, బ్రెడ్‌లు, పాస్తా, చిప్స్, ప్యాక్డ్ ఆహారాలు లాంటివన్నీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కిందకే వస్తాయి. ఇవి తేలికగా అరిగిపోయి రక్తంలో కలుస్తాయి. దీంతో రక్తంలో ఒక్కసారే షుగర్, ఇన్సులిన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇవి పెరిగిపోవడం అనేది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
మద్యం:
ఎక్కువగా మద్యం తాగే వారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మద్యం మెదడు పనితీరును మందగించేలా చేస్తుంది. విటమిన్ బీ అనేది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఎక్కువగా మద్యం తాగే వారిలో సాధారణంగా బీ1 విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. దీంతో వీరికి ఈ లక్షణాలు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
టాపిక్