Travelling tips: చిన్న పిల్లలతో ప్రయాణమా? మీ పనిని సులువు చేసే జాగ్రత్తలివే
Travelling tips: చిన్న పిల్లలతో ప్రయాణం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ల ఆహారం, బొమ్మలు, కావాల్సిన వస్తువుల గురించి అవగాహనతో ఉండాలి. అవేంటో తెల్సుకోండి.

చిన్న పిల్లలతో ప్రయాణమంటే చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అతి ముఖ్యమైతేనే దూర ప్రయాణాలు చేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూసేయండి..
ఆహారం విషయంలో..:
ఆరు నెలలు దాటిన పిల్లలకు ఆహారం విషయంలో కొన్ని ముందు ఏర్పాట్లు చేసుకోవాలి. నీళ్లు, వాళ్లకు పెడుతున్న ఆహారం మీ వెంట ఉండాల్సిందే. వేడి నీళ్లలో కలిపి పిల్లలకు ఎక్కడైనా తినిపించగలిగేలా కొన్ని పోషకాలుండే పొడులు, కొన్ని ప్యూరీల్లాంటివి ఇంటి నుంచే తీసుకెళ్లాలి. అలాగే పాలు తాగే పిల్లలైతే పాల డబ్బాలు, బ్రెస్ట్ మిల్క్ పంప్ తప్పకుండా మీ వెంట ఉంచుకోవాలి. ఫార్ములా పాలయితే మీ వెంట వేడి చేసి చల్లార్చిన నీళ్లు, ఫార్ములా పౌడర్ ఉంచుకోవడం మర్చిపోవద్దు.
బొమ్మలు:
ప్రయాణ సమయంలో పిల్లలు నిద్రపోతే పరవాలేదు. లేదంటే వాళ్లకు ఇష్టమైన బొమ్మలు వెంట ఉండాల్సిందే. కిటికీలకు, ముందు సీట్‌కు అంటుకుని ఫ్యాన్ లాగా తిరిగే బొమ్మలుంటాయి. అవి గాలికి తిరుగుతుంటే పిల్లలు వాటిని చూస్తూ ఉండిపోతారు. బిజీ బోర్డు గేమ్స్, కలరింగ్ బుక్స్, వుడెన్ పజిళ్లాంటివి తీసుకెళ్తే పిల్లలు ఆటలో నిమగ్నమవుతారు.
మందులు:
వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, విరేచనాల్లాంటివి రావచ్చు. అందుకే ముందుగానే అలాంటి వాటికోసం నాజల్ సలైన్ డ్రాప్స్, ఇతర మందులు దగ్గరుంచుకోవాలి. అవసరమైనప్పుడు గాబరా పడాల్సిన అవసరం ఉండదు. పిల్లలకు రోజూవారీ వాడే మందులు కూడా వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.
డిస్పోజల్ బ్యాగులు:
డైపర్లు మార్చిన తర్వాత పడేయడానికి కుదరకపోతే కొన్ని ప్లాస్టిక్ డిస్పోజల్ బ్యాగులు వెంట ఉంచుకోవాలి. వాటిలో పెట్టేసి తర్వాత పడేయొచ్చు. అలాగే పాప కోసం, మీకోసం ఒక డ్రెస్సు ఎక్కువగా వెంట ఉంచుకోండి. అలాగే డైపర్ మార్చాక నీళ్ల సౌకర్యం లేకపోతే ఇబ్బంది కాబట్టి కూర్చున్న సీటులోనే మార్చేట్లుగా వెట్ వైప్స్ ఉంటే ఉపయోగపడతాయి.
ఈ విషయంలో బాధ వద్దు:
చాలా మంది చిన్న పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్యాసెంజర్లు ఇబ్బంది పడతారేమో అని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీరు మీ పిల్లల వల్ల వేరేవాళ్లు ఇబ్బంది పడకుండా వీలైనంత ప్రయత్నం చేయండి. మంచి చెడు చెప్పండి. ఆ తర్వాత కూడా ఏదైనా ఇబ్బంది అయితే మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. వాళ్లూ అర్థం చేసుకుంటారు. అంతేకానీ మీ పెంపకం గురించి మీరే ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు.
ప్రయాణ సమయం:
పిల్లలు ఒక సమయంలో నిద్ర పోవడానికి, ఆటకు, స్నానానికి, తినడానికి అలవాటు పడి ఉంటారు. అందుకే మీ ప్రయాణ సమయం దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. కాబట్టి వాళ్ల నిద్ర పూర్తయ్యాక ప్రయాణం మొదలుపెడితే కాసేపు చికాకు లేకుండా ఆడుకుంటారు. హాయిగా ఉంటారు. మీకూ ఏ ఇబ్బందీ ఉండదు.